3

ఎపెక్ సదస్సులో ఒకే వేదికపై కనిపించిన ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్

చైనాలోని షెన్‌జెన్ నగరంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బుధవారం తొలిసారిగా ఒకే వేదికపై కనిపించారు. ఆసియా-, పసిఫిక్ ఆర్థిక సహకార (ఎపెక్) సదస్సు సందర్భంగా షీ జిన్‌పింగ్, ఆయన సతీమణి పెంగ్ లియువాన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు (గాలా బాంకెట్) వేడుకకు ముందు రెడ్ కార్పెట్‌పై ముగ్గురు నేతలు కలిసి ఫొటో దిగారు. అంతకుముందు ట్రంప్, జిన్‌పింగ్ దంపతులు నిల్చుని ఉండగా, పుతిన్ వారి వద్దకు నడుచుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్, పుతిన్ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని, భుజాలు తట్టుకుంటూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. అనంతరం ముగ్గురు నేతలు కలిసి గ్రూప్ ఫొటోకు పోజులిచ్చారు. క్రెమ్లిన్ మీడియా బృందం టెలిగ్రామ్‌లో విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2025 ఆగస్టులో అలాస్కాలో జరిగిన రష్యా-, అమెరికా సదస్సు తర్వాత ట్రంప్, పుతిన్ కలుసుకోవడం ఇదే తొలిసారి. గురువారం జరగనున్న త్రైపాక్షిక సమావేశానికి ముందు ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో షెన్‌జెన్ చేరుకున్న ట్రంప్‌కు జిన్‌పింగ్ స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి స్వాగతం పలికారు. అమెరికా,- చైనా సంబంధాలు, ఆసియా -పసిఫిక్ సహకారం, ప్రపంచ వ్యవహారాలపై చర్చలు జరిపేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్లు జిన్‌పింగ్ తెలిపారు. ట్రంప్‌కు ముందే పుతిన్ షెన్‌జెన్ చేరుకుని షీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మాస్కో, -బీజింగ్ విదేశాంగ విధానం సత్ఫలితాలు ఇస్తున్నదని పుతిన్ పేర్కొన్నారు. ట్రంప్ ఈ పర్యటనకు ముందు మనీలాలో ఏషియన్ సమిట్​లో పాల్గొని థాయిలాండ్, ఫిలిప్పీన్స్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గురువారం జరగనున్న ఎపెక్ సదస్సులో ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ మధ్య అధికారిక త్రైపాక్షిక సమావేశం జరగనుంది. 

Related Post

Previous
Next Post »