3

అమరావతి ఔటర్ పనులకు టెండర్లు పిలిచిన భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రూపురేఖలను సమూలంగా మార్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. మొత్తం 195.13 కిలోమీటర్ల పొడవున 6 లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టెండర్లను ఆహ్వానించింది. ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 15,116.45 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో చేపట్టనున్న ఈ రహదారి నిర్మాణం ద్వారా రాజధాని ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయి అనుసంధానం లభించనుంది. ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థఈ ఔటర్ రింగ్ రోడ్‌ను రెండు ప్రధాన ప్యాకేజీలుగా విభజించింది. మొదటి ప్యాకేజీ కింద కంచికచర్ల - ఆగిరిపల్లి - ఉయ్యూరు మధ్య 87.63 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించనున్నారు. అలాగే, రెండో ప్యాకేజీ కింద ఉయ్యూరు - గుంటూరు - కంచికచర్ల వరకు 107.50 కిలోమీటర్ల పొడవున పనులు చేపట్టనున్నారు. ఈ రెండు ప్యాకేజీల ద్వారా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు జిల్లాల పరిధిలోని ప్రధాన రహదారులు, జాతీయ రహదారులు ఒకదానితో ఒకటి అనుసంధానం కానున్నాయి. టెండర్ల ప్రక్రియకు సంబంధించి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ స్పష్టమైన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆసక్తి గల నిర్మాణ సంస్థలు తమ బిడ్లను దాఖలు చేయడానికి 2027 జనవరి 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. అనంతరం జనవరి 18న టెక్నికల్ బిడ్లను ఓపెన్ చేయనున్నట్లు ప్రకటించింది. భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేస్తున్నందున టెండర్ల ఖరారు తర్వాత క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభం కానున్నాయి.


Related Post

Previous
Next Post »