3

రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్‌ సీఎంతో సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ భేటీ : సమ్మక్క సాగర్‌ బ్యారేజీకి ఎన్ఓసీ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామనన్న సీఎం విష్ణుదేవ్‌

సమ్మక్క సాగర్‌ బ్యారేజీకి నిరభ్యంతర పత్రం జారీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ హామీ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆయనతో మంగళవారం రాయ్‌పూర్‌లో భేటీ అయ్యారు. ప్రాజెక్టుకు అవసరమైన ఎన్‌వోసీని త్వరగా ఇవ్వాలని కోరారు. వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన సాయ్‌.. ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకొని మిగిలిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు. సమ్మక్క సాగర్‌ అంశానికి పరిష్కారం లభిస్తే గోదావరి జలాల వినియోగంలో అంతర్రాష్ట్ర సహకారానికి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. చర్చలు, శాస్త్రీయ అంచనాల ద్వారా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తూనే స్థానికుల ప్రయోజనాలను కాపాడవచ్చన్నారు. ముంపు అంశాల పరిశీలనకు, ఉమ్మడి సర్వేలు, వివరాల నిర్ధారణకు సహకరించిన ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం, జలవనరుల శాఖ, బీజాపూర్‌ జిల్లా అధికారులు, సాంకేతిక బృందాలకు కృతజ్ఞతలు తెలిపారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో ఇరు రాష్ట్రాలకూ ప్రయోజనం చేకూరే పరిష్కారాన్ని తెలంగాణ కోరుకుంటోందని స్పష్టం చేశారు. ముంపు, బ్యారేజీ వల్ల ఎగువన నీరు ఎగదన్నే ప్రభావంపై ఛత్తీస్‌గఢ్‌ లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని రేవంత్‌, ఉత్తమ్‌ తెలిపారు. వర్తించే చట్టాలు, నిబంధనల మేరకు పరిహారం చెల్లించేందుకు, అవసరమైతే ఆ మొత్తాన్ని ముందుగానే జమ చేసేందుకు సిద్ధమని గతంలోనే పలుమార్లు తెలియజేశామన్నారు. ముంపు అంచనా, వివరాల నిర్ధారణకు అయ్యే ఖర్చునూ భరిస్తామని చెప్పారు. బ్యారేజీ వల్ల ఎగువన ముంపు ప్రభావంపై స్వతంత్ర అధ్యయనం చేసే బాధ్యతను ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఐఐటీ ఖరగ్‌పూర్‌కు అప్పగించింది. ఛత్తీస్‌గఢ్‌ అధికారులు కోరిన సమగ్ర అధ్యయనాలు, సర్వేల కోసం తెలంగాణ ఇప్పటికే సుమారు రూ.9.8 కోట్లు చెల్లించింది. సమావేశంలో ప్రస్తావించిన అధ్యయన వివరాల ప్రకారం భారీ వరదల సమయంలో అదనంగా ప్రభావితమయ్యే విస్తీర్ణం 100 ఎకరాల లోపే ఉంటుంది. పూర్తి నిల్వ మట్టం వద్ద నదీ భాగాన్ని మినహాయిస్తే సుమారు 32 ఎకరాల ప్రైవేటు భూమి ముంపునకు గురవుతుంది. ఇరు రాష్ట్రాల అధికారులు ఇప్పటికే ఉమ్మడి సర్వేలు చేపట్టారు. రెండు రాష్ట్రాలూ అంగీకరించిన విధానంలో ముంపు బాధితులుగా గుర్తించిన ప్రతి భూ యజమానికీ పరిహారం చెల్లించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని నేతలు తెలిపారు. పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణ అనుమతులతోపాటు తొలి, రెండో దశ అటవీ అనుమతులు ఇప్పటికే లభించాయని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. జలవిజ్ఞాన విభాగం, సీఎస్‌ఎంఆర్‌ఎస్‌, కేంద్ర భూగర్భ జల మండలి, కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థ తదితర సంస్థల సాంకేతిక పరిశీలనలు పూర్తయ్యాయని పేర్కొంది. కేంద్ర జల సంఘం వద్ద పరిష్కారం కావాల్సిన ప్రధాన అంతర్రాష్ట్ర అంశం ఛత్తీస్‌గఢ్‌ సమ్మతేనని వివరించింది. ఈ అంశంపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రితో చర్చించారు. 2025 సెప్టెంబరు 22న రాయ్‌పూర్‌లో, 2026 జూన్‌ 11న హైదరాబాద్‌లో, అదే ఏడాది సెప్టెంబరు 4న దిల్లీలో ఆయనతో భేటీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి 2025 జనవరి 18, మార్చి 3, జూలై 14, సెప్టెంబరు 14, డిసెంబరు 13తో పాటు 2026 జూన్‌ 11న కూడా ఈ అంశంపై లేఖలు రాశారు.సాంకేతిక అంశాల్లో చాలా వాటిని పలుమార్లు పరిశీలించామని, నిర్ణయం తీసుకునేందుకు తగిన సమాచారం ఇప్పుడు అందుబాటులో ఉందని తెలంగాణ నేతలు తాజా భేటీలో తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రజల చట్టబద్ధమైన ప్రయోజనాలన్నింటినీ కాపాడుతూ తెలంగాణలో లక్షలాది మంది రైతులకు సాగునీటి భద్రత కల్పించాలన్నది తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్‌ఓసీ త్వరగా లభిస్తే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రజాహిత ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావచ్చని, ఇరు రాష్ట్రాలకూ ప్రయోజనం చేకూరడంతోపాటు ఉమ్మడి నదీజలాల విషయంలో సహకార సమాఖ్య స్ఫూర్తి బలపడుతుందని పేర్కొన్నారు.

Related Post

Previous
Next Post »