3

23 పట్టణ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించాలి : టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న 23 పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యనేతలు మొదలుకుని గ్రామస్థాయి కార్యకర్తల వరకు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీలు ఎలాంటి సమన్వయంతో ముందుకు సాగుతున్నాయో, క్షేత్రస్థాయిలోనూ అంతే ఐక్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని, ఒక కూటమి - మూడు పార్టీలు ఐక్యతే మన బలం అన్న విధానంతో గ్రామస్థాయి నుంచి మంచి నాయకత్వాన్ని నిర్మించుకోవాలని ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్న మంచి పనులను ప్రతి ఇంటికీ తీసుకెళ్లేందుకు పంచాయతీ, పట్టణ ఎన్నికలను ఒక వేదికగా మార్చుకోవాలని చంద్రబాబు నాయుడు కోరారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్నామని, సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూనే, పీ4 విధానం ద్వారా పేదరికంలో ఉన్న కుటుంబాలకు చేయూతనిస్తున్నామని గుర్తుచేశారు. రోడ్ల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, భారీ పెట్టుబడుల ఆకర్షణ ద్వారా పారిశ్రామికాభివృద్ధి , యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న తీరును ప్రజలకు వివరించాలని, ప్రతి ఒక్క ఓటు అత్యంత కీలకమని కార్యకర్తలకు తెలిపారు. ఇదే సమయంలో, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ గా అభివర్ణిస్తూ ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హింసే విధానంగా పెట్టుకున్న గొడ్డలి పార్టీ, రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతుందని, సొంత తల్లి, చెల్లి అని కూడా చూడకుండా కుట్రలకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు. ప్రజలు మంచి చెడులను విశ్లేషించి ఓట్లు వేస్తున్నారని, ఇటీవల జరిగిన పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయాలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గొడ్డలి పార్టీకి ఓటేయడానికి ప్రజలు ఏమాత్రం ఇష్టపడటం లేదని, వారి తప్పుడు ప్రచారాలు, కుట్రల పట్ల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని సూచించారు. గ్రామస్థాయి సమస్యలకు గ్రామస్థాయిలోనే పరిష్కారం లభించాలంటే సమర్థవంతమైన నాయకత్వం అవసరమని, అన్ని స్థాయిల్లోనూ మంచి నాయకత్వాన్ని అందించే సత్తా కేవలం కూటమి పార్టీలకే ఉందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోవద్దని, అర్హుడైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరేలా చూస్తూ, రాబోయే ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేసేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ముఖ్యమంత్రి శ్రేణులకు పిలుపునిచ్చారు.

Related Post

Previous
Next Post »