ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భవిష్యత్తులో పరిస్థితి మరింత తీవ్రంగా మారవచ్చని ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన పరిశోధకుడు టావో లిన్ హెచ్చరించారు. దాదాపు అన్ని రంగాల్లోనూ అత్యుత్తమ మానవ నిపుణుల స్థాయిని అందుకునే 'సూపర్‌హ్యూమన్ ఏఐ' మరో 15 నెలల్లో అందుబాటులోకి రావచ్చని ఆయన అంచనా వేశారు. ఈ పరిణామం ఉద్యోగ వ్యవస్థనే సమూలంగా మార్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పాలిసేడ్ రీసెర్చ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టావో లిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన అంచనా ప్రకారం 2027 చివరి నాటికి ఏఐ అనేక కీలక రంగాల్లో మనుషుల కంటే మెరుగైన ఫలితాలు సాధించగల స్థాయికి చేరవచ్చు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్, సినిమా నిర్మాణం, సృజనాత్మక రంగాలు, రాజకీయ విశ్లేషణ వంటి విభాగాల్లోనూ మానవ నిపుణులతో పోటీపడే సామర్థ్యం సాధించవచ్చని చెప్పారు. అయితే ఇది ఆయన వ్యక్తిగత అంచనా మాత్రమే. సూపర్‌హ్యూమన్ ఏఐ అందుబాటులోకి వచ్చినంత మాత్రాన మరుసటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలన్నీ కనుమరుగవుతాయని భావించాల్సిన అవసరం లేదని లిన్ వివరించారు. ఇందుకు ప్రధాన కారణం రోబోటిక్స్ రంగంలో ఉన్న పరిమితులే. కంప్యూటర్‌లో పనిచేసే ఏఐ సాఫ్ట్‌వేర్ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, మనుషుల్లా భౌతిక పనులు చేయగల రోబోలను పెద్ద సంఖ్యలో తయారు చేసి అన్ని రంగాల్లోకి తీసుకురావడానికి సమయం పడుతుంది. ముందుగా ఏఐ కారణంగా కొన్ని ఉద్యోగాలు ఆటోమేషన్ పరిధిలోకి వెళ్తాయి. దీంతో ఉద్యోగులు ఇతర పనుల వైపు మళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత రోబోట్ల వినియోగం పెరిగే కొద్దీ కొత్త ఉద్యోగాల అవకాశాలు కూడా తగ్గవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. చివరకు మనుషులకు ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏఐ అభివృద్ధి వల్ల ఆర్థిక శక్తి కొన్ని దేశాలు, సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతమయ్యే ప్రమాదం ఉందని లిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమెరికా, చైనా వంటి దేశాలు ఈ సాంకేతిక రంగంలో ముందంజలో ఉండటం ప్రపంచ అధికార సమీకరణాలను ప్రభావితం చేయవచ్చని సూచించారు. మరోవైపు, ఏఐ అభివృద్ధి మానవాళి ఉనికికే ముప్పుగా మారే ప్రమాదాన్ని ఆయన సుమారు 20 శాతంగా అంచనా వేశారు. అయితే మానవజాతి పూర్తిగా అంతరించిపోవడం కంటే, సాంకేతికంగా అభివృద్ధి చెందిన వ్యవస్థలపై ఆధారపడుతూ మనుషులు నిర్ణయాధికారాన్ని కోల్పోయే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత వేగంతోనే ఏఐ పరిశోధనలు కొనసాగితే సమాజానికి మార్పులకు సిద్ధమయ్యే సమయం సరిపోదని లిన్ అభిప్రాయపడ్డారు. అందుకే పరిశోధనల వేగాన్ని ప్రస్తుత స్థాయిలో నాలుగో వంతుకు తగ్గించాలని సూచించారు. అంటే ఇప్పుడున్న వేగంలో 25 శాతానికి పరిమితం చేయాలన్నది ఆయన అభిప్రాయం.
3
Beranda
› Artificial Intelligence Could Make the Future More Intense
› business
› science
› technology
› Warning from Anthropic Researcher Tao Lin
› ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భవిష్యత్తులో పరిస్థితి మరింత తీవ్రంగా మారవచ్చు : ఆంథ్రోపిక్ పరిశోధకుడు టావో లిన్ హెచ్చరిక
Subscribe to:
Post Comments (Atom)
