3

నెంబర్ 1 బ్రాండ్ల విలువను కైవశం చేసుకున్న ఎయిర్‌టెల్ : ఇండియన్ బ్రాండ్స్ 2026 వార్షిక నివేదిక

ఆర్థిక పనితీరు, వినియోగదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన బ్రాండ్ల విలువను అంచనా వేసే ప్రఖ్యాత 'కాంటార్ బ్రాండ్‌జెడ్ మోస్ట్ వాల్యుబుల్ ఇండియన్ బ్రాండ్స్ 2026 వార్షిక నివేదిక జాబితాలో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటివరకు నంబర్ వన్ స్థానంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును వెనక్కి నెట్టి ఎయిర్‌టెల్ తొలి స్థానానికి దూసుకెళ్లింది. 2014లో ఈ ర్యాంకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఓ టెలికాం బ్రాండ్ అగ్రస్థానాన్ని దక్కించుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. నివేదిక ప్రకారం ఎయిర్‌టెల్ బ్రాండ్ వాల్యూ వార్షిక ప్రాతిపదికన 5 శాతం పెరిగి 43.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2020తో పోలిస్తే ఎయిర్‌టెల్ బ్రాండ్ వాల్యూ ఏకంగా 210 శాతం వృద్ధి చెందడం గమనార్హం. కేవలం టెలికాం సేవలకే పరిమితం కాకుండా 5జీ నెట్వర్క్, డిజిటల్ సేవలు, బండిల్డ్ ఆఫర్లతో కూడిన విస్తృత డిజిటల్ ఎకోసిస్టమ్‌గా ఎదగడమే ఈ ఘనతకు ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. 112 విభాగాల్లోని 1,693 బ్రాండ్లపై 1.52 లక్షల మందికి పైగా వినియోగదారుల అభిప్రాయాలను సేకరించి ఈ అధ్యయనాన్ని రూపొందించారు. ఈ ఏడాది భారత్‌లోని టాప్ 100 బ్రాండ్ల ఉమ్మడి వాల్యూ 12 శాతం తగ్గినప్పటికీ.. 460.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది దేశ జీడీపీలో సుమారు 11 శాతానికి సమానం. స్వల్పకాలిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. 2020తో పోలిస్తే టాప్ 75 భారతీయ బ్రాండ్ల విలువ రెట్టింపై, దేశ జీడీపీ వృద్ధి రేటును మించిపోవడం భారత బ్రాండ్ల దీర్ఘకాలిక బలాన్ని సూచిస్తోంది. ఈ ఏడాది బ్రాండ్ వాల్యూను భారీగా పెంచుకున్న సంస్థల్లో ఈ-కామర్స్ వేదిక మీషో, ద్విచక్ర వాహన దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్ ముందువరుసలో నిలిచాయి. వీటితో పాటు టీవీఎస్, ఫోన్‌పే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బలమైన వృద్ధిని నమోదు చేశాయి. ఇక విభాగాల వారీగా చూస్తే.. టాప్ 100 బ్రాండ్ల మొత్తం వాల్యూలో 29 శాతం వాటాతో 'ఫైనాన్షియల్ సర్వీసెస్' అతిపెద్ద విభాగంగా కొనసాగుతోంది. మరోవైపు కాంటార్ బ్రాండ్‌జెడ్ 2026 'గ్లోబల్ టాప్ 100' జాబితాలో భారత్ నుంచి ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్ చోటు దక్కించుకున్నాయి. వినియోగదారులకు విభిన్నమైన, అర్థవంతమైన సేవలను అందించిన బ్రాండ్లు సగటున 7 శాతం వృద్ధి చెందగా.. మార్పులకు అనుగుణంగా మారని బ్రాండ్ల వాల్యూ 13 శాతం పడిపోయినట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

Related Post

Previous
Next Post »