3

ప్రేమ పేరుతో వంచన : పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపం గురై నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేసి, పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బూర్గంపాడు మండలం చెరువు సింగారం గ్రామానికి చెందిన చెరప కవిత (20) నర్సింగ్ విద్యను అభ్యసిస్తోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది ప్రేమకు దారితీసినట్లు సమాచారం. అయితే, వివాహం చేసుకోవాలని కవిత కోరగా సదరు యువకుడు నిరాకరించడంతో, తాను ప్రేమ పేరుతో మోసపోయానని ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో మనస్తాపం చెందిన కవిత ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కవిత మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. తమ కుమార్తె మృతికి కారణమైన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతురాలి కుటుంబ సభ్యులు బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Related Post

Previous
Next Post »