తమిళనాడు లోని మదురై జిల్లా తిరుపరంకుండ్రం కొండపై ఉన్న వివాదాస్పద దీపత్తూన్ రాతి స్తంభం వద్ద నవంబర్ 24న కార్తీక దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర అనుమతి ఇచ్చింది. అయితే ఇది ఒక్కసారికి పరిమితమైన తాత్కాలిక ఏర్పాటేనని, దీనివల్ల ఎటువంటి సంప్రదాయ హక్కులు ఏర్పడవని స్పష్టం చేసింది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనంఈ వివాదాస్పద ప్రాంతంలో దీపారాధనకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తమిళనాడు ప్రభుత్వం వేసిన అప్పీల్‌ను విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. స్తంభం స్వభావం, ఆ భూమి యాజమాన్యంపై హైకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలపై కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ తాత్కాలిక ఏర్పాటును స్తంభం స్వభావం, భూమి హక్కులు లేదా మతపరమైన ఆచారంపై తుది నిర్ణయంగా పరిగణించరాదని తేల్చిచెప్పింది. దీపారాధన వేడుక ప్రశాంతంగా సాగేందుకు ధర్మాసనం పలు జాగ్రత్తలు సూచించింది. ఆలయ నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు అనుమతించిన పరిమిత బృందం మాత్రమే దీపం వెలిగించేందుకు అక్కడికి వెళ్లాలని ఆదేశించింది. ఈ బృందం ఎంతమంది ఉండాలి, ఎవరెవరు ఉండాలనేది మదురై జిల్లా కలెక్టర్.. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), మదురై పోలీస్ కమిషనర్‌తో చర్చించి నిర్ణయించాలని స్పష్టం చేసింది. ఏర్పాట్లను కలెక్టర్ పర్యవేక్షిస్తారని, అవసరమైతే సీఆర్పీఎఫ్ సహకారంతో పోలీసులు భద్రత కల్పిస్తారని తెలిపింది. ఆ ప్రాంతంలో ప్రజలు గుమిగూడటం, ఊరేగింపులు, నిరసనలు, నినాదాలు చేయడంపై నిషేధం విధించింది. పక్కనే ఉన్న హజ్రత్ సుల్తాన్ సికందర్ బాదుషా ఔలియా దర్గా, మసీదుకు వెళ్లే వారికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలని, సంప్రదాయ ప్రార్థనలు యథావిధిగా కొనసాగాలని ఆదేశించింది. దీపత్తూన్ వద్ద దీపం వెలిగించే సంప్రదాయం ఎప్పుడూ లేదని, కొండ దిగువన ఉన్న ఉచ్చిపిళ్లైయార్ ఆలయం సమీపంలోని దీప మండపంలోనే దశాబ్దాలుగా దీపం వెలిగిస్తున్నారని తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వాదించారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఉచ్చిపిళ్లైయార్ ఆలయం వద్దే దీపారాధన జరుగుతుందని స్థానదీకులు తెలిపారని, గతంలోనూ ఇలాంటి డిమాండ్లను హైకోర్టు తిరస్కరించిందని గుర్తుచేశారు. హిందూ ధర్మాదాయ శాఖ కమిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శేఖర్ నాఫడే కూడా ప్రస్తుత పద్ధతినే కొనసాగించాలని కోరారు. మరోవైపు కొండ ప్రాంతమంతా తమ దర్గాకే చెందుతుందని దర్గా నిర్వహణ కమిటీ వాదించింది. 1920 నాటి సివిల్ కోర్టు ఉత్తర్వులను ప్రస్తావిస్తూ దర్గా న్యాయవాది అమిత్ ఆనంద్ తివారీ.. కొండపై, నెల్లితోపు నుంచి మెట్లు మార్గంపై తమకు హక్కులు ఉన్నాయని, దీపారాధన అనుమతి వల్ల కొత్త హక్కులు సృష్టించలేరని వాదించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కార్తిక దీపం జరిగే నవంబర్ 24 నాటికి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తిరుపరంకుండ్రం కొండ పరిసరాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు నిర్ణయంపై భక్తులు, హిందూ సంఘాల కార్యకర్తలు, మాజీ బీజేపీ నేత కె. అన్నామలై హర్షం వ్యక్తం చేశారు. ఆలయం ముందు కొబ్బరికాయలు కొట్టి, స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి కూడా దీపత్తూన్ వద్ద దీపారాధనకు శాశ్వత అనుమతి లభిస్తుందని ఆశిస్తున్నట్లు అన్నామలై పేర్కొన్నారు. దర్గాకు సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న ప్రాచీన రాతి స్తంభం వద్ద దీపం వెలిగించాలని హిందూ సంఘాలు కోరగా, ఆలయ యాజమాన్యం నిరాకరించడంతో ఈ వివాదం హైకోర్టుకు చేరింది. 2025 డిసెంబర్ 1న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను 2026 జనవరిలో డివిజన్ బెంచ్ సమర్థించగా, తాజాగా సుప్రీంకోర్టు షరతులతో కూడిన మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది.
3
Beranda
› A One-Time
› Lamp to be Lit on November 24
› Madurai district
› Supreme Court Grants Interim Permission for 'Karthika Deepam'
› Tamil Nadu
› Temporary Arrangement
› Tirupparankundram hill
› కార్తీక దీపంపై మధ్యంతర అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు : నవంబర్ 24న వెలగనున్న జ్యోతి : ఇది ఒక్కసారికి పరిమితమైన తాత్కాలిక ఏర్పాటు
Subscribe to:
Post Comments (Atom)
