3

అంబేద్కర్‌ స్మారకార్థం దాదర్‌ మెట్రో స్టేషన్‌కు 'చైత్యభూమి'గా పేరు : చైత్యభూమి, శివాజీపార్క్‌ పరిసరాల్లో సదుపాయాలు కల్పనకు ఆదేశం

డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ స్మారకార్థం ముంబైలోని దాదర్‌ మెట్రో స్టేషన్‌కు 'చైత్యభూమి'గా పేరు మార్చేందుకు అవసరమైన ప్రక్రియను శాసనసభ శీతాకాల సమావేశాల్లో పూర్తి చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ వెల్లడించారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని, కేంద్రం నుంచి అందిన మార్గదర్శకాల ప్రకారం శాసనసభ కమిటీకి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి నామకరణానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, ఈ మార్పు దాదర్‌ మెట్రో స్టేషన్‌కు మాత్రమే వర్తిస్తుందని, దాదర్‌ రైల్వే స్టేషన్‌ పేరు యథాతథంగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 70వ మహాపరినిర్వాణ దినోత్సవ ఏర్పాట్లపై బుధవారం విధాన్‌భవన్‌లో సీఎం ఫడ్నవీస్‌ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైత్యభూమికి వచ్చే అనుచరుల కోసం భద్రత, రవాణా, వైద్యం, వసతి, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలను పకడ్బందీగా కల్పించాలని అధికారులను ఆదేశించారు. డిసెంబరు 5, 6 తేదీల్లో చైత్యభూమి, శివాజీ పార్కు పరిసరాలకు సుమారు 15 లక్షల మంది అంబేడ్కర్‌ అనుచరులు వచ్చే అవకాశం ఉందని సమన్వయ కమిటీ ప్రతినిధులు సమావేశంలో తెలిపారు. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లలో లోటుపాట్లను సరిదిద్దాలని సీఎం సూచించారు. అనుచరుల బస, విశ్రాంతి, భోజనం కోసం పెద్ద మండపాలు, జర్మన్‌ హ్యాంగర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. చైత్యభూమి పరిసరాల్లో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలని, ఆటోరిక్షాల ప్రవేశంపై అవసరమైన పరిమితులు విధించాలని సీఎం సూచించారు. రైల్వే, రోడ్డు రవాణా, స్థానిక రవాణా సంస్థలు, పోలీసు శాఖ సమన్వయంతో పనిచేసి అనుచరుల ప్రయాణం సులభతరం చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చైత్యభూమి పరిసరాల్లో నిరసనలు, ధర్నాలు, ర్యాలీలపై అధికారికంగా నిషేధం విధించే అంశాన్ని పరిశీలించాలని హోంశాఖకు సూచించారు. ముంబైలోని ఇందూ మిల్‌ ప్రాంగణంలో నిర్మిస్తున్న డాక్టర్‌ అంబేద్కర్‌ స్మారక పనులకు నిధుల కొరత రానివ్వబోమని ఫడ్నవీస్‌ హామీ ఇచ్చారు. నిర్మాణంలో ఎక్కువ భాగం పూర్తయిందని, ప్రధాన విగ్రహానికి సంబంధించిన కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వ్యయం పెరిగినా అదనపు నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మిగిలిన పనులను వేగవంతం చేసేందుకు వచ్చే వారంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్‌ విగ్రహాల సుందరీకరణ, మహాపరినిర్వాణ్‌ దివస్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డాక్టర్‌ అంబేద్కర్‌ విగ్రహాలను శుభ్రపరిచి సుందరీకరించే పనులను రానున్న వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మహాపరినిర్వాణ దినం విషాదానికి సంబంధించినది దినం కాబట్టి ఉత్సవాల తరహాలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని సూచించారు. అంబేద్కర్‌ జీవిత చరిత్రకు సంబంధించిన సినిమాల ప్రదర్శన, ఆయన ఆశయాలను ప్రతిబింబించే కార్యక్రమాల నిర్వహణపై ఆలోచించాలని సూచించారు. చైత్యభూమికి వచ్చే లక్షలాది మంది అనుచరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే తెలిపారు. ముంబై మహానగరపాలక సంస్థ, పోలీసు, ప్రజాపనుల శాఖ, పట్టణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. బస, విశ్రాంతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, రైల్వే సేవల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తామన్నారు. మహాపరినిర్వాణ దినం సందర్భంగా ముంబైకి వచ్చే వాహనాలకు టోల్‌ రాయితీ కల్పించే అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని వెల్లడించారు. అనుచరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, చైత్యభూ మితోపాటు ముంబైలో అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఉప ముఖ్యమంత్రి సునేత్రా అజిత్‌ పవార్ అధికారులకు సూచించారు.

Related Post

Previous
Next Post »