3

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి : దెబ్బతిన్న కిటికీ అద్దం

గుజరాత్‌లోని సూరత్ నగర పరిధిలో గాంధీనగర్ నుంచి ముంబైకి వెళ్తున్న వందే భారత్ రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రైలులోని ఓ కోచ్ కిటికీ అద్దం దెబ్బతింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే మంగళవారం మధ్యాహ్నం గాంధీనగర్ నుంచి ముంబైకి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. నిర్ణీత మార్గంలో ప్రయాణిస్తూ సూరత్ రైల్వే స్టేషన్‌ను దాటిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. సూరత్‌లోని సచిన్, భేస్తాన్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి విసిరిన రాయి సీ4 కోచ్ కిటికీకి తగిలింది. దీంతో ఆ కోచ్‌కు సంబంధించిన కిటికీ అద్దం దెబ్బతిన్నట్లు పశ్చిమ రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే రాయిని తాకిన కిటికీ అద్దం దెబ్బతిన్నప్పటికీ, లోపల ప్రయాణిస్తున్న ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రాణనష్టం లేదా ఇతర గాయాలు సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులెవరు? ఉద్దేశపూర్వకంగానే రాళ్లు విసిరారా? అనే విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడంతో పాటు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మొత్తంగా సూరత్ సమీపంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన రాళ్ల దాడి మరోసారి రైల్వే భద్రత అంశాన్ని తెరపైకి తెచ్చింది.

Related Post

Previous
Next Post »