కోల్‌కతాలోని దుర్గా పూజా పండాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 19 మంది మృతి చెందగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మృతుల పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ప్రభుత్వం ప్రతి మృతుల కుటుంబానికి రూ. 25 లక్షలు అందించి, ప్రతి కుటుంబంలోని ఒక అర్హత గల సభ్యునికి గ్రూప్ డి ప్రభుత్వ ఉద్యోగాన్ని అందిస్తుంది. తొక్కిసలాటలో గాయపడిన వారి పూర్తి వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో సమగ్ర దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దుర్గా పూజా పండాల్ నిర్వాహక కమిటీ సభ్యులతో సహా ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని అవాంతరాలను నివారించడానికి అధికారులు అక్టోబర్ 18 నుండి 20 వరకు సెక్షన్ 163 కింద ఆంక్షలు విధించారు. కోల్‌కతా వ్యాప్తంగా భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆసుపత్రిలో గాయపడిన వారిని పరామర్శించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి వెంటరాగా, ఆయన వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్. ఎన్. రవి కూడా బాధితులను పరామర్శించి, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
3
Beranda › Posts filed under west bengal
Showing posts with label west bengal. Show all posts
Showing posts with label west bengal. Show all posts
నందిగ్రామ్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హాసీ రాణి రాత్ ఘన విజయం
పశ్చిమ బెంగాల్లో నందిగ్రామ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హాసీ రాణి రాత్ తన సమీప ప్రత్యర్థిపై భారీ ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో హత్యకు గురైన సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రాత్ తల్లి ఈమె. సువేందు అధికారి పేరిట ఉన్న గత రికార్డులను బద్దలు కొడుతూ ఆమె ఈ అఖండ విజయాన్ని సాధించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు అధికారి భబానీపూర్, నందిగ్రామ్ రెండూ స్థానాల నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన భబానీపూర్ స్థానాన్ని ఉంచుకుని, నందిగ్రామ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. దాంతో దివంగత తన వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రాత్ తల్లి హాసీ రాణి రాత్‌కు బీజేపీ తరఫున సువేందు అధికారి అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ 41,674 ఓట్లు సాధించగా, హాసీ రాణి రాత్ అత్యధికంగా 1,64,427 ఓట్లు సాధించారు.అంటే తన ప్రత్యర్థి కంటే ఏకంగా 1,22,753 ఓట్ల భారీ మెజారిటీతో ఆమె విజయం సాధించారు. 1967 తర్వాత ఈ నియోజకవర్గంలో నమోదైన అత్యధిక విజయ ఓట్ల తేడా ఇదే కావడం విశేషం. అంతకుముందు ఈ రికార్డు సువేందు అధికారి పేరు మీదే ఉండేది. ఆయన 2016లో తృణమూల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి 81,230 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
పార్టీని వీడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు 15 రోజుల్లో తిరిగి రావాలి : గడువు విధించిన మమతా బెనర్జీ
ఉత్తర బెంగాల్‌లోని ఉత్తర దినాజ్పూర్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా భారీ స్థాయిలో నిర్వహించిన సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ పార్టీని వీడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు 15 రోజుల్లో తిరిగి రావాలని గడువు విధించారు. తన పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత బయటకు వెళ్లిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలను ద్రోహులుగా అభివర్ణిస్తూ ఘాటు విమర్శలు చేశారు. వారు 15 రోజుల్లో తిరిగి వస్తే ఆహ్వానిస్తామని, ఆ తర్వాత వారికి పార్టీలో చోటు ఉండదని స్పష్టం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆమె, పార్టీకి అసలైన బలం నాయకులు కాదని, క్షేత్రస్థాయి కార్యకర్తలేనని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఎన్నికల సంఘంపైనా మమత తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బాధ్యతల్లో ఉన్నంతకాలం బీజేపీ అధికారంలో కొనసాగుతుందని ఆమె ఆరోపించారు. 1998లో తృణమూల్ కాంగ్రెస్‌ను తానే స్థాపించిన విషయాన్ని గుర్తుచేస్తూ పార్టీని మరోసారి బలోపేతం చేయగలనని అన్నారు. దేశవ్యాప్తంగా విపక్ష కూటమి బలోపేతానికి కూడా తృణమూల్ కాంగ్రెస్ కీలకమని మమత పేర్కొన్నారు. తృణమూల్ లేకుండా ఇండియా కూటమి బలంగా ఉండదు. బీజేపీని ఎదుర్కోవాలంటే తృణమూల్‌ను బలోపేతం చేయాలి అని ఆమె పిలుపునిచ్చారు.
Read More...
మమతా బెనర్జీకి తగిలిన కాలు గాయం నిజమైనది కాదు : సమగ్ర విచారణ జరిపిస్తామన్న ముఖ్యమంత్రి సువేందు అధికారి
2021 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నందిగ్రామ్‌లో నాటి సీఎం మమతా బెనర్జీకి తగిలిన కాలు గాయం నిజమైనది కాదని, అది పూర్తిగా డ్రామా అని పేర్కొంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2021 మార్చి 10న నందిగ్రామ్‌లోని విరులియా బజార్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా మమతా బెనర్జీ కాలుకు గాయమైంది. జనాల గుంపు మధ్య కారు తలుపు బలంగా తగలడం వల్ల ఆమె ఎడమ పాదం, మణికట్టుకు తీవ్ర గాయాలయ్యాయయి అప్పట్లో తెలిపారు. అయితే, ఆ గాయం పూర్తిగా కట్టుకథ అని సువేందు అధికారి ఆరోపించారు. అప్పట్లో కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో మమతా బెనర్జీకి చేసిన వైద్య పరీక్షల తాలూకు ఒరిజినల్ రిపోర్ట్ తన దగ్గర ఉందని ఆయన తెలిపారు. ఆ రిపోర్ట్‌లో వైద్యులు ఎలాంటి ఫ్రాక్చర్ కాలేదని స్పష్టంగా రాశారని, కానీ ఆమె ఆరోగ్యంగా ఉన్న కాలికి ప్లాస్టర్ వేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. నందిగ్రామ్ ప్రాంతాన్ని, స్థానిక ప్రజలను ఈ ఘటన ద్వారా కించపరిచారని మండిపడ్డ ఆయన, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ అబద్ధపు ప్రచారంపై సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రకటించారు. అప్పట్లో ఆ గాయం తర్వాత మమతా బెనర్జీ వీల్‌చైర్‌పైనే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించడం, ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించడం పొలిటికల్‌గా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత ఈ అంశం మళ్లీ తెరపైకి రావడం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Read More...
టీఎంసీ కునాల్ ఘోష్ పై రాళ్ల దాడి : వీడియో నెట్టింట వైరల్
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా ఉత్తరపారాలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ శ్రీరామ్‌పూర్‌లో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు వెళుతుండగా కారుపై దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది బీజేపీ గూండాల పని అని కునాల్ ఆరోపించారు. కొందరు వ్యక్తులు ఘోష్ వాహనాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. కొందరు కారును కొట్టి, గుడ్లు విసిరారు, వెనుక విండ్‌షీల్డ్‌ను పగలగొట్టారు. దీంతో ఘోష్ కోల్‌కతాకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కర్రలు, రాడ్లు, నల్లటి పోస్టర్లతో వచ్చిన ఒక గుంపు తన కారును అడ్డగించి, రాళ్లు, గుడ్లతో దాడి చేసిందని కునాల్ ఘోష్ ఆరోపించారు. ఈ దాడిలో కారు ముందు, వెనుక అద్దాలు ధ్వంసమయ్యాయని ఆరోపించారు. సంఘటనా స్థలంలో ఒక్క పోలీసు కూడా లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
Read More...
పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికలు : రెజీనగర్ నుంచి తప్పుకున్న టీఎంసీ అభ్యర్థి రబీ ఉల్ ఆలమ్ చౌద్రీ
పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి రబీ ఉల్ ఆలమ్ చౌద్రీ కూడా తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. రెజీనగర్‌లో మమతా బెనర్జీ వర్గం అనూహ్యంగా ఎంపిక చేసిన వ్యక్తి రబీ ఉల్ ఆలమ్ చౌద్రీ. ఆయనకు నియోజకవర్గంతో గట్టి రాజకీయ అనుబంధమే ఉంది. ఇక్కడి నుంచే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2013లో తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా రెజీనగర్ ఉప ఎన్నికలో విజయం సాధించారు. 2016లోనూ కాంగ్రెస్ తరఫున అదే స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి 2021లో టీఎంసీ అభ్యర్థిగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఆయనను రెజీనగర్ నుంచి కాకుండా బెల్డంగా నియోజకవర్గం నుంచి బరిలోకి దించింది. అక్కడ ఆయన ఓటమి చవిచూశారు. ఇప్పుడు ఉప ఎన్నికలో మళ్లీ తన పాత నియోజకవర్గంలోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది. దీంతో స్థానికంగా ఉన్న పరిచయం, గత రాజకీయ అనుభవం ఆయనకు కలిసొస్తాయని దీదీ భావించారు. అయితే అనూహ్యంగా ఆయన ఇప్పుడు తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకుంటూ పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.
నందిగ్రామ్ ఉప ఎన్నికకు అభ్యర్థులను ప్రకటించిన భారతీయ జనతా పార్టీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి హషీరామీ రథ్‌ను, రేజినగర్ నుంచి సఖారో సర్కార్‌ను ప్రకటించింది. నందిగ్రామ్ అభ్యర్థి హషీరామీ రథ్‌కు స్థానిక రాజకీయంగా ప్రత్యేక నేపథ్యం ఉంది. ఆమె ముఖ్యమంత్రి సువేందు అధికారి మాజీ వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ తల్లి. ఈ ఏడాది మే నెలలో చంద్రనాథ్ రథ్ హత్యకు గురయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం అప్పట్లో చర్చనీయాంశమైంది. సువేందు అధికారి సమక్షంలో హషీరామీ రథ్ నామినేషన్ దాఖలు చేశారు. సువేందు అధికారి రెండు స్థానాల్లో విజయం సాధించిన అనంతరం నందిగ్రామ్ సీటుకు రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మరోవైపు, హుమాయున్ కబీర్ రాజీనామాతో రేజినగర్ స్థానం ఖాళీ అయింది. బీజేపీ ప్రకటనకు ముందు టీఎంసీ తిరుగుబాటు వర్గం కూడా అభ్యర్థులను ప్రకటించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వర్గం, కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ సైతం అభ్యర్థులను రంగంలోకి దింపాయి. అక్టోబర్ 6న పోలింగ్, అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు జరగనుంది.
17 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు : కూచ్ బీహార్ ఎంపీ జగదీశ్ చంద్ర బాసునియా
టీఎంసీ నుంచి బయటకు వచ్చిన 17 మంది రెబల్ ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కూచ్ బీహార్ ఎంపీ జగదీశ్ చంద్ర బాసునియా అన్నారు. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై తిగుబాటు బావుటా ఎగురవేసిన 20 మంది ఎంపీలు నేషనలిస్టు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వీరిలో 17 మంది బీజేపీలోకి మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఎంపీ జగదీశ్ అన్నారు. 'మాలో 17 మంది ఎంపీలో బీజేపీలో చేరనున్నారు. మొత్తం ఎంపీల్లో ఈ సంఖ్య మూడింట రెండువంతులు కాబట్టి మాకు యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు' అని చెప్పారు. ఈ పరిణామాలకు బీజేపీ దూరంగా జరిగే ప్రయత్నం చేసింది. పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య మాట్లాడుతూ కేవలం పార్టీలో చేరతామంటూ వచ్చిన ప్రతి ఒక్కరినీ తాము చేర్చుకోమనిచెప్పారు. ఎంపీ జగదీశ్ కామెంట్స్‌పై మరో రెబల్ ఎంపీ శతాబ్దీ రాయ్ కూడా ఆచితూచి స్పందించారు. అవి జగదీశ్ వ్యక్తిగత వ్యాఖ్యలని అన్నారు. ఈ విషయంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. మరో ఎంపీ అబూతాహిర్ ఖాన్ మాత్రం ఘాటుగా స్పందించారు. తమ తరఫున మాట్లాడే హక్కు ఆయనకు లేదని తేల్చి చెప్పారు. మైనారిటీ వర్గానికి చెందిన ఎంపీలు బయటనుంచే బీజేపీకి మద్దతు ఇస్తారన్న జగదీశ్ వ్యాఖ్యలను కూడా తాహిర్ ఖండించారు. 'మేము బీజేపీలోకి గానీ ఎన్డీఏలో గానీ చేరము. ఇది మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను' అని అన్నారు. అయితే, ప్రధాని లేదా ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ప్రభుత్వ సంబంధిత కార్యక్రమాల్లో మాత్రం పాల్గొంటామని చెప్పారు.
అనుమానాస్పదస్థితిలో మమతా బెనర్జీ మేనకోడలు మృతి
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మేనకోడలు బ్రిస్టీ ముఖర్జీ ఘటక్ ఇవాళ అనుమానాస్పదస్థితిలో కన్నుమూశారు. బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్హట్లో ఉన్న తన నివాసంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి భౌతిక కాయాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. ఆమె మరణానికి గల కారణాలు తెలియరాలేదు. రాంపూర్‌హట్‌లోని తన ఇంటి రెండవ అంతస్తులో ఉన్న ఒక గదిలో 28 ఏళ్ల బ్రిస్టీ ముఖర్జీ ఘటక్ మృతదేహం పోలీసులకు లభ్యమైంది. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ముఖర్జీ గత కొన్నేళ్లుగా డిప్రెషన్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారని తెలిసింది. స్థానిక వార్తల ప్రకారం ఆమెకు, ఆమె భర్తకు మధ్య విడాకుల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. బ్రిస్టీ ముఖర్జీ గతంలో మమత హయాంలో జరిగిన ఉపాధ్యాయుల నియామకాల్లో అక్రమంగా ఉద్యోగం సంపాదించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో నియామకాల ప్రక్రియలో అవకతవకల కారణంగా ప్రభుత్వ సాయంతో నడుస్తున్న పాఠశాలల్లో నియామకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల తర్వాత ఆమె ఆ ఉద్యోగాన్ని కోల్పోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. ముఖర్జీ మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వసస్తే కానీ మృతికి గల కారణాలపై మరింత స్పష్టత వచ్చేలా లేదు. తాజాగా ఆదివారం రాంపూర్‌హాట్‌లోని పార్టీ కార్యాలయంలో సీనియర్ తృణమూల్ కాంగ్రెస్ నేత, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఉరి వేసుకుని చనిపోయారు. ఇది జరిగిన రెండు రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది.
మమతా బెనర్జీపై కలకత్తా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని ఆరోపణలు : కేసు నమోదు చేసిన హేస్టింగ్స్ పోలీసులు
కోల్‌కతాలోని కేథడ్రల్ రోడ్లో నిర్వహించిన వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో కలకత్తా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ తృణమూల్ ఛాత్ర పరిషత్ నిర్వాహకులపై హేస్టింగ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్లో ఆగస్టు 28న కేసు నంబర్ 112 నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 61(2), 223, 125(ఏ), 132, 285 కింద ఈ కేసు నమోదు చేశారు. హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్ అపూ బైద్య సమర్పించిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ప్రకారం డబ్ల్యూటీఎంసీపీ కార్యక్రమ నిర్వాహకులతో కలిసి బెనర్జీ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, దాని అమలులో భాగంగా 2026 నాటి డబ్ల్యూఈపీ నంబర్ 21728కు సంబంధించిన కలకత్తా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని ఆరోపించారు. ఆగస్టు 28న కేథడ్రల్ రోడ్లో నిర్వహించిన డబ్ల్యూటీఎంసీపీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఈ ఉల్లంఘన జరిగినట్లు ఆరోపించారు. ఫిర్యాదులో పేర్కొన్న అనుమతి, ఆదేశాల ప్రకారం కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు జరగాల్సి ఉంది. కార్యక్రమంలో బెనర్జీ, నిర్వాహకులు తమ మద్దతుదారులను రెచ్చగొట్టారని, దీంతో అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను జనసమూహం పక్కకు నెట్టివేసిందని పోలీసులు ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందితో జనసమూహం తోపులాటకు దిగిందని, దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని ఫిర్యాదులో ఆరోపించారు. పోలీసుల కథనం ప్రకారం, కేథడ్రల్ రోడ్డులో ఒక వైపు వాహనాల రాకపోకలకు కూడా జనసమూహం అడ్డంకిగా మారింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కలకత్తా హైకోర్టు ఆదేశాల ప్రకారం అనుమతించిన సమయం ముగిసిన తర్వాత కూడా.. నిర్వాహకులు కార్యక్రమాన్ని కొనసాగించారని పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో నేరపూరిత కుట్ర, ప్రభుత్వ ఉద్యోగి అధికారికంగా జారీ చేసిన ఆదేశాలను ధిక్కరించడం, ఇతరుల ప్రాణాలు లేదా వ్యక్తిగత భద్రతకు ప్రమాదం కలిగించే చర్యలు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి లేదా నేరపూరిత బలప్రయోగం, ప్రజా మార్గాలకు సంబంధించి నిర్లక్ష్యపూరిత ప్రవర్తనకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత నిబంధనలను చేర్చారు. మమతా బెనర్జీపై లీగల్ యాక్షన్‌కు సీఎం సువేందు అధికారి ఆదేశించడం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మూడు వారాల వ్యవధిలో 60 మంది పసిపిల్లలు మృతి
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మూడు వారాల వ్యవధిలోనే 60 మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. ఆస్పత్రి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకే ఒక్క రోజులో 10 మంది చిన్నారులు కన్నుమూయడం ఇక్కడి వ్యవస్థల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఆగస్టు నెల రెండవ వారంలో ఒకే రోజు 10 మంది చిన్నారులు చనిపోవడంతో ఈ దారుణం బయటపడింది. ఇందులో ఎనిమిది మంది పసికందులు వేరే చిన్న ఆస్పత్రుల్లో జన్మించగా, పరిస్థితి బాగా విషమించిన తర్వాతే మాల్దా మెడికల్ కాలేజీకి తీసుకొచ్చారు. మిగిలిన ఇద్దరు శిశువులు ఇదే ఆస్పత్రిలో జన్మించారు. ఊపిరితిత్తుల సమస్యలు, తీవ్రమైన కామెర్లు, పుట్టుకతో వచ్చిన గుండె సంబంధిత వ్యాధులతోనే ఎక్కువ మంది చిన్నారులు కన్నుమూసినట్లు వైద్యులు ప్రాథమికంగా వెల్లడించారు.మొత్తం చనిపోయిన 60 మంది శిశువుల్లో దాదాపు 44 మంది బయటి ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌ల నుంచే ఇక్కడికి రిఫర్ అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. చిన్న ఆస్పత్రుల్లో ప్రాథమిక వైద్యం సరిగ్గా అందక, వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత చివరి నిమిషంలో మెడికల్ కాలేజీకి పంపడమే ఈ మరణాలకు ప్రధాన కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటివరకు ఆ చుట్టుపక్కల ఉన్న 16 ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విచారణ వేగవంతం చేశారు.ఒకే ఆస్పత్రిలో ఇంతమంది పసికందులు చనిపోవడంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. ఘటనా స్థలం నుంచి సమగ్ర నివేదిక ఇవ్వాలని మాల్దా ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రసేన్‌జిత్ బార్‌ను ఆదేశించింది. మరోవైపు ఈ దారుణంపై మాల్దా జిల్లా కలెక్టర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి, తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. పసిపిల్లల వరుస మరణాలకు ఆస్పత్రి యాజమాన్య వైఫల్యమా లేక ప్రైవేట్ కేంద్రాల అలసత్వమా అన్నది విచారణలో తేలాల్సి ఉంది.
అనర్హత పిటిషన్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో అభిషేక్ బెనర్జీ పిటిషన్ దాఖలు
తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ బెనర్జీ, పార్టీని వీడి రెబెల్‌గా మారి స్పీకర్ ఓం బిర్లా వద్ద పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.టిఎంసికి చెందిన 20 మంది ఎంపీలు పార్టీ మారడమే కాకుండా, ఎన్సీపీఐ పార్టీలో విలీనమై ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. పార్టీని వీడి ఎన్డీఏలో చేరేందుకు గుర్తింపు లేని చిన్న పార్టీ అయిన ఎన్సీపీఐలో విలీనమైన 20 మంది రెబెల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది.తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, లోక్‌సభ పక్ష నేత అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. రెబెల్ ఎంపీలపై పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా త్వరితగతిన నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించి నోటీసులు జారీ చేసింది.ఆరంభంలో స్పీకర్‌కు కూడా నోటీసు జారీ చేస్తామని కోర్టు పేర్కొన్నప్పటికీ, స్పీకర్ తరఫున కోర్టులో హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థన మేరకు ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. స్పీకర్ తరఫున తానే హాజరవుతున్నానని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా, అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇప్పటికే నోటీసులు జారీ చేశారని తనకు స్పష్టమైన సమాచారం ఉందని పేర్కొన్నారు.ఎస్జి వ్యాఖ్యలపై స్పందించిన జస్టిస్ బాగ్చి, "కేవలం నోటీసులు ఇవ్వడం మాత్రమే ముఖ్యం కాదు; ఒక నిర్దిష్ట సమయ పరిమితిలో విచారణ ప్రక్రియను ముగించడమే ఇక్కడ అసలు ప్రశ్న" అని వ్యాఖ్యానించారు.ఎంపీలపై ప్రారంభమైన అనర్హత విచారణను పూర్తి చేయడంలో జరుగుతున్న ఆలస్యాన్ని సవాలు చేస్తూ బెనర్జీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కోర్టు విచారణపై అభిషేక్ బెనర్జీ తరఫు న్యాయవాది కల్యాణ్ బెనర్జీ స్పందిస్తూ.. ఇది తృణమూల్ కాంగ్రెస్‌కు వచ్చిన పెద్ద విజయమని, కోర్టు త్వరలోనే స్పష్టమైన తేదీని నిర్ణయిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలోని 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటు చేసి, త్రిపురకు చెందిన నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ప్రాంతీయ పార్టీలో చేరినట్లు లేదా విలీనమైనట్లు ప్రకటించి, సభలో తమకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని కోరడంతో ఈ వివాదం మొదలైంది. పార్టీని వీడి రెబెల్‌గా మారి స్పీకర్ ఓం బిర్లా వద్ద పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ బెనర్జీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.టిఎంసికి చెందిన 20 మంది ఎంపీలు పార్టీ మారడమే కాకుండా, ఎన్సీపీఐ పార్టీలో విలీనమై ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు.
మనసు మార్చుకున్న టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే కాసిమ్ సిద్ధిఖీ : తిరిగి మమతా బెనర్జీ వర్గంలో చేరిక
పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్ ఎమ్మెల్యే కాసిమ్ సిద్ధిఖీ తన మనసు మార్చుకుని, మమతా బెనర్జీ నేతృత్వంలోని శిబిరానికి తాను తిరిగి వస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపై ఆమె నాయకత్వంలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని అమ్దంగా నియోజకవర్గానికి చెందిన టీఎంసీ ఎమ్మెల్యే కాసిమ్ సిద్ధిఖీ కూడా ప్రతిపక్ష నాయకుడు రిటబ్రత బెనర్జీ నేతృత్వంలోని అసమ్మతి వర్గంలో చేరారు. అయితే తిరుగుబాటు జరిగిన కొన్ని నెలల తర్వాత మమతా బెనర్జీ నాయకత్వంలోని శిబిరానికి తిరిగి వస్తున్నట్లు సోమవారం ఆయన ప్రకటించారు. కాగా, అసమ్మతి వర్గం తనను తప్పుదారి పట్టించిందని ఎమ్మెల్యే కాసిమ్ సిద్ధిఖీ ఆరోపించారు. ఆ వర్గం కూడా మమతా బెనర్జీ నేతృత్వంలోనే పనిచేస్తుందని తనకు చెప్పి ఆ పత్రంపై సంతకం తీసుకున్నారని తెలిపారు. 'దీదీ మాకు సర్వస్వం. ఆమె మాకు టికెట్ ఇచ్చి అసెంబ్లీకి పంపారు. ఆమె ఫోటోతోనే మేం ఓట్లు అడిగాం. ప్రజలు ఆమెను చూసే మాకు ఓటు వేశారు. మేం దీదీతోనే ఉన్నాం. ఇక్కడ ఉన్నంత కాలం ఆమెతోనే ఉంటాం' అని ఆయన అన్నారు. హుగ్లీ జిల్లాలోని ప్రముఖ ఫుర్ఫురా షరీఫ్ దర్గాకు చెందిన 'పీర్జాదా’గా పిలిచే సిద్ధిఖీకి ముస్లిం సమాజంలోని కొన్ని వర్గాలలో గణనీయమైన ప్రభావం ఉన్నది. ఆయన గత ఏడాది టీఎంసీలో చేరారు. ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. టీఎంసీ ఆయనను అమ్దంగా నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించగా ఘన విజయం విజయం సాధించారు. అయితే బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతకు సంబంధించి టీఎంసీలో రాజకీయ పోరు నెలకొన్నది. ఈ అంశంపై స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని అసమ్మతి వర్గం సవాల్ చేయడంతో పాటు బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యే కాసిమ్ సిద్ధిఖీ తిరిగి మమతా బెనర్జీ వర్గంలో చేరినట్లు తెలుస్తున్నది.
హోటల్లో ఘోర అగ్నిప్రమాదం : ఆరుగురు సజీవదహనం!
పశ్చిమ బెంగాల్‌లోని బీర్బూమ్ జిల్లా తారాపీఠ్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రసిద్ధ తారాపీఠ్ ఆలయానికి, స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న 'బిదిష్ని' అనే హోటల్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో హాటల్లో బసచేసిన ఆరుగురు భక్తులు సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో హోటల్లోని అతిథులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. వర్షం పడుతుండటంతో హోటల్ సిబ్బంది కూడా నిద్రలోనే ఉన్నారని, ప్రాంగణమంతా దట్టమైన పొగ అలుముకోవడంతో లోపల ఉన్నవారికి ఊపిరాడక తీవ్ర ఇబ్బందికి గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అకస్మాత్తుగా హోటల్ కింది అంతస్తులో ప్రారంభమైన మంటలు నిమిషాల వ్యవధిలోనే పై అంతస్తులకు వేగంగా వ్యాపించాయి. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హోటల్లో చిక్కుకున్న పలువురిని రక్షించి, చికిత్స కోసం రాంపూర్హాట్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రికి తరలించారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శ్రావణ సోమవారం కావడంతో తారాపీఠ్ ఆలయంలో దేవుడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరుకున్నారు. ప్రమాదంలో మరణించిన వారు కూడా ఆలయ దర్శనం కోసం ఆదివారం రాత్రే ఈ హోటల్లో బస చేసినట్లు తెలిసింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ.. అధికారులు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు. జరిగిన ఆస్తి నష్టాన్ని, ప్రభావితులైన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
బెంగాలీ దర్శకుడు రాజా సేన్ కన్నుమూత
ప్రముఖ బెంగాలీ దర్శకుడు రాజా సేన్ (71) కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని బెంగాలీ చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. వెన్ను భాగంలో గాయపడటంతో తొలిత ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో ఆయన్ని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి దిగజారడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1996లో విడుదలైన 'దాము' చిత్రంతో రాజా సేన్ దర్శకుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఓ బాలుడు, ఏనుగు మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ఆ తర్వాత 'ఆత్మీయ స్వజన్', 'దేశ్', 'దేబీపక్ష', 'కృష్ణకాంతేర్ విల్', 'లాబొరేటరీ', 'మాయా మృదంగ', వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 2002లో విడుదలైన 'దేశ్' చిత్రంలో జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషించారు. సినిమాలతో పాటు డ్యాక్యుమెంటరీల రూపకల్పనలోనూ రాజాసేన్ తనదైన ముద్ర వేశారు. ప్రముఖ రవీంద్ర సంగీత గాయని సుచిత్రా మిత్రతో పాటు పలువురు ప్రముఖుల జీవితాలపై ఆయన డాక్యుమెంటరీలు రూపొందించారు.
మమతా బెనర్జీ కారుపై ఇటుకలు, రాళ్లతో దాడి చేసిన దుండగులు
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వాహనంపై ఉత్తర 24 పరగణాల జిల్లాలో దాడి జరిగింది. పోలీస్ కస్టడీలో మరణించిన పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు హాలిసహార్ వెళ్తుండగా కొందరు అజ్ఞాత వ్యక్తులు ఆమె కాన్వాయ్‌ను చుట్టుముట్టి ఇటుకలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని, వాహనంపై బురద చల్లి, నీళ్ల సీసాలు, చెప్పులు విసిరారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అద్దాలు మూసి ఉండటం వల్లే ప్రాణాపాయం తప్పిందని, లేకపోతే తన తల పగిలి ప్రాణాలు పోయేవని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని, వారు కేవలం బీజేపీకే రక్షణ కల్పిస్తున్నారని విమర్శించారు. ఘటన సమయంలో స్థానికంగా "చోర్ భగావో" అంటూ నినాదాలు హోరెత్తాయి. టీఎంసీ లోక్‌సభ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, రాజ్యసభ ఎంపీ డోలా సేన్లు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
కోల్‌కతాలో మలేషియా ఎయిర్‌లైన్స్ విమానానికి తప్పిన ప్రమాదం : లేజర్ లైట్ల ఎఫెక్ట్ వల్ల గాల్లో చక్కర్లు కొట్టిన విమానం
కోల్‌కతా విమానాశ్రయంలో మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో అంతరాయం ఏర్పడింది. కాక్‌పిట్ వైపు లేజర్ లైటింగ్ పడటంతో విమానం గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. కౌలాలంపూర్ నుంచి 159 మందితో వస్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం MH-184 శనివారం రాత్రి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కావాల్సి ఉంది. విమానాశ్రయ వర్గాల ప్రకారం కాక్‌పిట్ వైపు లేజర్ లైటింగ్ వల్ల పైలట్ దృష్టి మరలింది. రాత్రి 11:20 గంటలకు విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. విమానాశ్రయ రన్‌వేకు సుమారు 8 నాటికల్ మైళ్ల దూరంలో విమానం ఉన్నప్పుడు మధ్యమ్‌గ్రామ్-బరసాత్ దిశ నుంచి కాక్‌పిట్ వైపు లేజర్ లైటింగ్ పడినట్టు పైలట్ గమనించాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. లేజర్ నుంచి ఒక్కసారిగా వచ్చిన కాంతి కారణంగా పైలట్ క్షణకాలం పాటు అయోమయంగా అనిపించింది. దాంతో విమానం అనుకున్న సమయానికి ల్యాండ్ అవ్వలేకపోయింది. మరోసారి ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించే ముందు గాలిలో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. చివరకు రాత్రి సుమారు 11:25 గంటలకు విమానం సేఫ్ ల్యాండ్ అయింది. ప్రయాణీకులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన అనంతరం విమానయాన సంస్థ విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించింది. కోల్‌కతా విమానాశ్రయ యంత్రాంగం కూడా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వర్గాలు చెబుతున్నాయి. విమానాశ్రయం పరిసరాల్లో లేజర్ లైట్ల వాడకం నిషేధించినట్టు కోల్‌కతా విమానాశ్రయ డైరెక్టర్ విక్రమ్ సింగ్ తెలిపారు. అయినప్పటికీ, ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయని, విమాన కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఈ విషయాన్ని పోలీసు అధికారులకు రిపోర్టు చేశామని, దర్యాప్తు జరుగుతోందని ఆయన అన్నారు.
పశ్చిమ బెంగాల్లో సీనియర్ ఐపీఎస్ అధికారి కోటేశ్వరరావు సహా ఐదుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
పశ్చిమ బెంగాల్లో గత ప్రభుత్వ హయాంలో పక్షపాత ధోరణితో వ్యవహరించారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసు అధికారులపై వేటు వేస్తూ ప్రభుత్వం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి సువేందు అధికారి స్వయంగా ఈ విషయాన్ని అసెంబ్లీలో వెల్లడించారు. ప్రభుత్వం సస్పెండ్ చేసిన అధికారుల జాబితాలో సీనియర్ ఐపీఎస్ అధికారి కోటేశ్వరరావు కూడా ఉన్నారు. గతంలో డైమండ్ హార్బర్ ఎస్పీగా పనిచేసిన ఈయన, గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక నేత, ఎంపీ అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు. వీరితో పాటు కాళీయాగంజ్ పీఎస్ మాజీ ఇన్స్పెక్టర్ మొఅజ్జం హుస్సేన్, బర్తాలా పీఎస్ మాజీ ఓసీ సుబర్ణ దత్తా చౌదరి, అదే స్టేషన్ ఎస్సై సాధన్ పాండే, కృష్ణానగర్ పీఎస్ మాజీ ఇన్స్పెక్టర్ అమలేందు బిస్వాస్‌లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.ఈ సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి సువేందు అధికారి మాట్లాడుతూగత ప్రభుత్వ హయాంలో (2021-2026) శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం దారుణంగా దుర్వినియోగం చేశారని విమర్శించారు. ముఖ్యంగా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని సనాతన ధర్మాన్ని ఆచరించేవారి మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి మరియు అక్రమాలపై తమ ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానంతో ముందుకెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.
సీజేపీ చేపట్టిన నిరసనలకు పూర్తి మద్దతు ప్రకటించిన మమతా బెనర్జీ
ఢిల్లీలో సీజేపీ చేపట్టిన నిరసనలకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పూర్తి మద్దతును ప్రకటించారు. దేశంలో పరిస్థితి తీవ్రంగా ఉందన్న ఆమె, అవసరమైతే విద్యార్థులు, యువత సాధిస్తున్న హక్కుల కోసం తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లి ఆందోళన బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. సీజేపీ చేపట్టిన ఆందోళనల తీవ్రతను చూసి భయపడిన ప్రధాని నరేంద్ర మోదీ, తన కాన్వాయ్ దారి మళ్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈ సందర్భంగా ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. దేశంలో ప్రస్తుతం సాగుతున్న బీజేపీ పాలన అరాచకాలు, అణచివేత ధోరణి పూర్వపు నియంతలైన హిట్లర్, స్టాలిన్ పాలనలను కూడా మించిపోయాయని వ్యాఖ్యానిస్తూ, ఈ వైఖరిని ఎండగట్టేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరుగుతూనే, మరోవైపు టీఎంసీ పార్టీలో అసమ్మతి గళం వినిపిస్తున్న రెబెల్ నాయకులకు మమతా బెనర్జీ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ధైర్యముంటే, దమ్ముంటే పార్టీని వీడి బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలవాలని వారికి బహిరంగ సవాల్ విసిరారు. నిరసన తెలుపుతున్న యువత శక్తిని, జనాగ్రహాన్ని తక్కువగా అంచనా వేయకూడదని, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సమైక్య పోరాటమే ఏకైక మార్గమని ఆమె స్పష్టం చేశారు. మమతా బెనర్జీ నేరుగా రంగంలోకి దిగుతానని ప్రకటించడంతో ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ సీజేపీ నిరసనలు జాతీయ స్థాయిలో మరింత రాజకీయాగ్నిని రగిల్చాయి.
రైల్వే క్రాసింగ్ వద్ద పాఠశాల వ్యాన్‌ను ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు : ఇద్దరు పాఠశాల విద్యార్థులతో సహా ముగ్గురు మృతి
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా కర్ణసువర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద ఒక పాఠశాల వ్యాన్‌ను ప్యాసింజర్ రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఇద్దరు పాఠశాల విద్యార్థులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. స్థానిక సమాచారం ప్రకారం నిమ్‌తీతా-కటవా మార్గంలో వెళ్తున్న ప్యాసింజర్ రైలు కర్ణసువర్ణ రైల్వే గేట్ వద్దకు వచ్చేసరికి ట్రాక్ తెరిచే ఉంది. అదే సమయంలో పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న వ్యాన్ పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన రైలు వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు స్కూల్ వ్యాన్ పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది. ఘటనా స్థలానికి సంబంధించిన భీతావహ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ దుర్ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రైల్వే అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. గేట్ కీపర్ నిర్లక్ష్యం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Subscribe to:
Posts (Atom)

