కోల్‌కతా విమానాశ్రయంలో మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో అంతరాయం ఏర్పడింది. కాక్‌పిట్ వైపు లేజర్ లైటింగ్ పడటంతో విమానం గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. కౌలాలంపూర్ నుంచి 159 మందితో వస్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం MH-184 శనివారం రాత్రి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కావాల్సి ఉంది. విమానాశ్రయ వర్గాల ప్రకారం కాక్‌పిట్ వైపు లేజర్ లైటింగ్ వల్ల పైలట్ దృష్టి మరలింది. రాత్రి 11:20 గంటలకు విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. విమానాశ్రయ రన్‌వేకు సుమారు 8 నాటికల్ మైళ్ల దూరంలో విమానం ఉన్నప్పుడు మధ్యమ్‌గ్రామ్-బరసాత్ దిశ నుంచి కాక్‌పిట్ వైపు లేజర్ లైటింగ్ పడినట్టు పైలట్ గమనించాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. లేజర్ నుంచి ఒక్కసారిగా వచ్చిన కాంతి కారణంగా పైలట్ క్షణకాలం పాటు అయోమయంగా అనిపించింది. దాంతో విమానం అనుకున్న సమయానికి ల్యాండ్ అవ్వలేకపోయింది. మరోసారి ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించే ముందు గాలిలో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. చివరకు రాత్రి సుమారు 11:25 గంటలకు విమానం సేఫ్ ల్యాండ్ అయింది. ప్రయాణీకులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన అనంతరం విమానయాన సంస్థ విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించింది. కోల్‌కతా విమానాశ్రయ యంత్రాంగం కూడా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వర్గాలు చెబుతున్నాయి. విమానాశ్రయం పరిసరాల్లో లేజర్ లైట్ల వాడకం నిషేధించినట్టు కోల్‌కతా విమానాశ్రయ డైరెక్టర్ విక్రమ్ సింగ్ తెలిపారు. అయినప్పటికీ, ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయని, విమాన కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఈ విషయాన్ని పోలీసు అధికారులకు రిపోర్టు చేశామని, దర్యాప్తు జరుగుతోందని ఆయన అన్నారు.
0 Comments