పశ్చిమ బెంగాల్‌లో గత ప్రభుత్వ హయాంలో పక్షపాత ధోరణితో వ్యవహరించారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసు అధికారులపై వేటు వేస్తూ ప్రభుత్వం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి సువేందు అధికారి స్వయంగా ఈ విషయాన్ని అసెంబ్లీలో వెల్లడించారు. ప్రభుత్వం సస్పెండ్ చేసిన అధికారుల జాబితాలో సీనియర్ ఐపీఎస్ అధికారి కోటేశ్వరరావు కూడా ఉన్నారు. గతంలో డైమండ్ హార్బర్ ఎస్పీగా పనిచేసిన ఈయన, గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక నేత, ఎంపీ అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు. వీరితో పాటు కాళీయాగంజ్ పీఎస్ మాజీ ఇన్‌స్పెక్టర్ మొఅజ్జం హుస్సేన్, బర్తాలా పీఎస్ మాజీ ఓసీ సుబర్ణ దత్తా చౌదరి, అదే స్టేషన్ ఎస్సై సాధన్ పాండే, కృష్ణానగర్ పీఎస్ మాజీ ఇన్‌స్పెక్టర్ అమలేందు బిస్వాస్‌లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.ఈ సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి సువేందు అధికారి మాట్లాడుతూగత ప్రభుత్వ హయాంలో (2021-2026) శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం దారుణంగా దుర్వినియోగం చేశారని విమర్శించారు. ముఖ్యంగా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని సనాతన ధర్మాన్ని ఆచరించేవారి మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి మరియు అక్రమాలపై తమ ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానంతో ముందుకెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.
0 Comments