Sunday, October 18, 2026

చంచల్‌గూడ స్టీల్ బ్రిడ్జిపై ప్రమాదంలో విద్యార్థి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

హైదరాబాద్‌లోని చంచల్‌గూడ ప్రింటింగ్ ప్రెస్ ఎదురుగా ఉన్న స్టీల్ బ్రిడ్జిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో చాకలి పవన్‌ (20) అనే విద్యార్థి మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం సుమారు 12.45 గంటలకు స్టీల్ బ్రిడ్జిపై ప్రమాదం జరిగినట్లు స్థానికులు చాదర్‌ఘాట్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పెట్రోలింగ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై గాయాలతో పడి ఉన్న ఇద్దరిని గుర్తించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది పరీక్షించగా, వారిలో ఒకరు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మరో వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడిని చాకలి పవన్‌, తండ్రి చంద్రశేఖర్‌గా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని పల్టాన్ ప్రాంతంలో హరిహర క్షేత్రం సమీపంలో నివసిస్తున్న పవన్‌ విద్యార్థిగా తెలిపారు. ప్రమాద స్థలానికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ప్రాథమిక పరిశీలన ప్రకారం టిప్పర్‌ లారీ సమీపంలో మరో వాహనాన్ని దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పవన్‌ ద్విచక్ర వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు గుర్తించారు. ఈ క్రమంలో మరో వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.