రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రంపంతో విద్యార్థినిపై దాడి : నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన అమానుష దాడి కేసులో పోలీసులు వేగంగా స్పందించి, ఘటన జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పాఠశాలలో చెట్లు నరికే రంపంతో విద్యార్థినిపై విచక్షణారహితంగా దాడి చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో విద్యార్థిని ముఖం, వీపు సహా శరీర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయని, చేయి తెగిపోయినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పాఠశాల పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారాల ఆధారంగా నిందితుడిని ధర్మవరం రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడిని నాగూరుకు చెందిన హేమంత్‌గా గుర్తించారు. సుమారు పదేళ్ల క్రితం అయ్యవారిపల్లెకు వచ్చి నివాసముంటున్నట్లు సమాచారం. తల్లిదండ్రులు చనిపోవడంతో అక్క వద్దే ఉంటున్నట్లు తెలిసింది. ఈ ఘోర ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా బాధిత విద్యార్థిని తల్లికి ఫోన్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పారు. విద్యార్థినులపై ఇలాంటి దాడులు అత్యంత అమానుషమని విచారం వ్యక్తం చేశారు. బాలికకు మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిందితుడిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని బాధితురాలి కుటుంబానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ నిందితుడిని ఉపేక్షించేది లేదని, అత్యంత కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Post a Comment

Previous Post Next Post
3