దేశవ్యాప్తంగా సోషల్ మీడియా పోస్టులపై అప్రకటిత ఆంక్షలు అమలవుతున్నాయని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్న వేళ 'కాక్రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే వేలాది పోస్టులు, ఖాతాలను ప్రతిరోజూ బలవంతంగా తొలగింపజేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో విమర్శలను అణచివేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రభుత్వం ప్రతిరోజూ వేలాది పోస్టులు, అకౌంట్లను తొలగిస్తోంది, కానీ వారు ఒక ప్రధాన విషయాన్ని విస్మరిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ అనేది ప్రజలు తమ ప్రశ్నలను లేవనెత్తే ఒక వేదిక మాత్రమేనన్నారు. ఆ ప్రశ్నల వెనుక ఉన్న అసలు కారణాలు సోషల్ మీడియాకు ఆవల నిజ జీవితంలో ఉన్నాయని, అందువల్ల ఖాతాలను తొలగించినంత మాత్రాన ఆ సమస్యలు మాయమైపోవంటూ అభిజీత్ విమర్శించారు. ఈ రకమైన సెన్సార్షిప్ వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న విశ్వసనీయత దెబ్బతింటుందని ఇది మరింత అపనమ్మకాన్ని పెంచుతుందని హెచ్చరించారు. ఇన్ స్టా పోస్టులు అడ్డుకుంటున్నారంటూ ఇప్పటికే సీజేపీ నేత అశుతోష్ రంకా, యూట్యూబర్ ధృవ్ రాఠీ సైతం కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కాక్రోచ్ పార్టీ నేతల వాట్సాప్ అకౌంట్లు కూడా బ్లాక్ అవుతున్నాయని, మెసేజ్ లు పంపకుండా అడ్డుకుంటున్నారని సీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక కోర్టుల వార్తల్ని ప్రచురించే లైవ్ లా వెబ్ సైట్ కు చెందిన ఇన్ స్టా పేజ్ లో పోస్టు చేసిన ఈసీ విధుల పోస్టును కూడా తొలగించారని ధృవ్ రాఠీ ఆరోపించారు. కేవలం సీజేపీ నేతలే కాకుండా పలువురు స్వతంత్ర విమర్శకులు, ప్రముఖులు కూడా తమ పోస్టులు ఇన్స్టాగ్రామ్ నుండి తొలగించబడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 'వికసిత్ భారత్ 2047' హామీపై తాను రాసిన ఒక వ్యంగ్య కవితకు సంబంధించిన మ్యూజికల్ పోస్టును ఇన్స్టాగ్రామ్ తొలగించిందని హాస్య రచయిత, గేయ రచయిత వరుణ్ గ్రోవర్ ఆయన తెలిపారు. భారత ఐటీ చట్టం కింద వచ్చిన చట్టపరమైన అభ్యర్థన మేరకు ఈ పోస్టును నిరోధించినట్లు ఇన్స్టాగ్రామ్ పంపిన నోటీసు స్క్రీన్‌షాట్‌ను ఆయన పంచుకున్నారు.
