జియో కంటికి కనిపించకపోయినా కోట్లాది భారతీయుల డిజిటల్ కలల్లో గుండె చప్పుడులా కొట్టుకుంది !

జియో ప్లాట్‌ఫామ్స్ స్టాక్ మార్కెట్లలో అరంగేట్రం చేసిన చారిత్రాత్మక దినాన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బుధవారం ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వేదికగా వాటాదారులను ఉద్దేశించి ప్రసంగింస్తూ తమ కుటుంబ మూలాలు, దైవభక్తి, డిజిటల్ భారత్ స్వప్నాన్ని గుర్తుచేసుకున్నారు. వ్యాపారం అనేది తమ దృష్టిలో ఒక పవిత్రమైన పూజ అని, ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజ్ గంట తనకు గుడి గంటలా వినిపించిందని పేర్కొన్నారు. ప్రతి పూజ చివర ప్రసాదం పంచినట్లే, ఈ రోజు జియో విజయాన్ని ప్రసాదంలా యావత్ భారతదేశంతో పంచుకుంటున్నామని ప్రకటించారు. సంస్థపై విశ్వాసం ఉంచిన 53 కోట్ల మంది వినియోగదారులతో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది, టెక్నీషియన్లు, ఇంజనీర్లకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘనమైన మైలురాయి దేశ ప్రజలు కన్న కలల ప్రతిరూపమని వివరించారు. అనంత్ అంబానీ తన ప్రసంగంలో మూడు తరాల ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. ఏడెన్ పెట్రోల్ బంకులో పనిచేసిన సామాన్య యువకుడు, తమ తాత ధీరూభాయ్ అంబానీ చోర్వాడ్ గ్రామం నుంచి అసాధారణ కలలు కనడం నేర్పించారని చెప్పారు. ఆ తర్వాత తండ్రి ముఖేష్ అంబానీ జామ్‌నగర్ బీడు భూముల్లో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ నిర్మించి భారత సత్తా చాటారని వివరించారు. అక్క అక్క ఈశా అంబానీ జియో అనే విత్తనాన్ని నాటగా, అన్నయ్య ఆకాష్ అంబానీ దానిని స్వప్నంగా మార్చుకున్నారని చెప్పారు. నేడు తాము ముగ్గురం మూడు శరీరాలుగా కనిపిస్తున్నా, ఒకే ఆత్మగా, ఒకే లక్ష్యంతో భారత కలలను సాకారం చేయడానికి ముందుకొచ్చామని స్పష్టం చేశారు. జియో కంటికి కనిపించకపోయినా కోట్లాది భారతీయుల డిజిటల్ కలల్లో గుండె చప్పుడులా కొట్టుకుంటోందని అనంత్ పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రపంచం ఆగిపోయినా చదువులు ఆగకుండా జియో అండగా నిలిచిందని గుర్తుచేశారు. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడు వేల మైళ్ల దూరం నుంచి వీడియో కాల్ ద్వారా కుటుంబంతో మాట్లాడటం వెనుక జియో ఉందని చెప్పారు. ముంబై వైద్యుడు రాజస్థాన్‌లోని పాలి గ్రామంలో రోగి ప్రాణాలు కాపాడాలన్నా, ఒక చిన్న పట్టణ అమ్మాయి ఇంటర్నెట్ ద్వారా ప్రభావవంతమైన ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదగాలన్నా ఈ నెట్‌వర్క్ వారధిగా మారిందని కొనియాడారు. డిజిటల్ ఇండియా దార్శనికతతో సరికొత్త దిశానిర్దేశం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి అనంత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ప్రణామం చేశారు. రాబోయే కాలం యువ భారత్ సొంతమని, వికసిత్ భారత్ నిర్మాణంలో రిలయన్స్ కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని ఉద్ఘాటించారు. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో జియో షేర్లు దాదాపు 21.4 శాతం భారీ ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. ఒక్కరోజే మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 12.50 లక్షల కోట్లకు చేరడంతో దేశంలోనే రెండో అత్యంత విలువైన కంపెనీగా జియో చరిత్ర సృష్టించింది.

Post a Comment

Previous Post Next Post
3