హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ మూసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని, బీజేపీ ఈ ప్రాజెక్టును అడ్డుకుంటోందంటూ తప్పుడు ప్రచారం సాగిస్తోందని ఆయన మండిపడ్డారు. తాము మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును తప్పుబట్టడం లేదని రాంచందర్ రావు అన్నారు. కానీ 'గాంధీ సరోవర్' పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేద ప్రజలను నిర్వాసితులను చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. పేదల ఇళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మూసీని ప్రక్షాళన చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు ఇచ్చేందుకు, పీఆర్సీ అమలు చేయడానికి నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం.. మూసీ ప్రక్షాళన పేరుతో రూ.వేల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధపడటం విడ్డూరంగా ఉందన్నారు. పథకాలకు లేని డబ్బులు ఈ ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి వస్తున్నాయని రాంచందర్ రావు ప్రశ్నించారు. ఢిల్లీలో ప్రతిపక్షాలు నిర్వహించ తలపెట్టిన 'మాక్ పార్లమెంట్'పై రామ్‌చందర్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలో మాక్ పార్లమెంట్ నిర్వహిస్తే.. అసలు దీనిని ఎందుకు నిర్వహిస్తున్నారంటూ నిలదీసిన వ్యక్తి సోనియా గాంధీ కాదా అని ప్రశ్నించారు. పార్లమెంట్ అంటే ప్రజాస్వామ్య దేవాలయమని గతంలో కాంగ్రెస్ నాయకురాలు, మాజీ స్పీకర్ మీరా కుమార్ చెప్పారని గుర్తు చేశారు. కానీ నేడు అదే కాంగ్రెస్ నేతలు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మాక్ పార్లమెంట్లు పెట్టి పార్లమెంటరీ వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని చులకన చేస్తున్నారని రాంచందర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మూసీ పునరుజ్జీవానికి మేం వ్యతిరేకం కాదు - పేద ప్రజలను నిర్వాసితులను చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం
byTelugu Lo Computer
•
•
2 min read
