బీహార్ రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ తనదైన ముద్ర వేస్తున్నారు. తొలిసారి బీజేపీ కంచుకోటలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ తన బలం చూపించారు. శాసనమండలి ఎన్నికల్లో దర్భంగా ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి సురేశ్ ప్రసాద్ రాయ్ ఘనవిజయం సాధించి సంచలనం సృష్టించారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న ఈ స్థానంలో, మాజీ పీసీసీ చీఫ్, సిట్టింగ్ ఎమ్మెల్సీ డాక్టర్ మదన్ మోహన్ ఝాపై సురేశ్ ప్రసాద్ రాయ్ గెలుపొందడం రాష్ట్ర రాజకీయ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. శాసనమండలిలో తొలిసారిగా అధికారికంగా ఖాతా తెరవడం ద్వారా, ప్రశాంత్ కిశోర్ పార్టీ ఇక ఎంతమాత్రం ప్రయోగం కాదని.. క్షేత్రస్థాయిలో ఒక తిరుగులేని రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని స్పష్టమైంది. అధికార ఎన్డీయేతో పాటు ఇటు విపక్ష మహాగట్బంధన్ కూటమిపై విద్యావంతులు, ఉపాధ్యాయ వర్గాల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని జన్ సురాజ్ పార్టీ తమకు అనుకూలంగా మలుచుకున్నట్లు స్పష్టమవుతోంది. నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ అభ్యర్థి ఘనశ్యామ్ రాయ్ కేవలం 862 ఓట్లతో నాలుగో స్థానానికి పరిమితం కాగా, ప్రతిపక్ష కూటమిలోని కాంగ్రెస్ , సీపీఎం , ఆర్జేడీ వేర్వేరుగా బరిలోకి దిగి ఓట్లను చీల్చుకున్నాయి. ప్రశాంత్ కిశోర్ గత రెండేళ్లుగా బీహార్ అంతటా చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర, క్షేత్రస్థాయి వ్యవస్థాగత నిర్మాణం ఇప్పుడు ఎన్నికల రూపంలో ఫలితాలనిస్తున్నాయని భావిస్తున్నారు. సాధారణంగా కుల సమీకరణాలు, కుటుంబ రాజకీయాలే ప్రాతిపదికగా సాగే బీహార్లో.. విద్య, ఉపాధి, అభివృద్ధి ఎజెండాతో యువత, మధ్యతరగతి, విద్యావంతుల ఓటర్లను జన్ సురాజ్ ఆకర్షిస్తోంది. గ్రాడ్యుయేట్స్, టీచర్స్ వంటి చైతన్యవంతమైన నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు నెగ్గుకురావడం అనేది సమాజంలోని మేధావి వర్గం పీకే ఆలోచనా విధానం వైపు మొగ్గుచూపుతోందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.
బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న ప్రశాంత్ కిషోర్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటిన జన్ సురాజ్
byTelugu Lo Computer
•
•
2 min read
