మహారాష్ట్రలోని పూణే ప్లాంట్‌లో డిఫెండర్ 110ను స్థానికంగా అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించడంతో జాగ్వార్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 SUV ధరలను భారీగా తగ్గించింది. ఈ కారు ధర ఏకంగా రూ.34 లక్షల వరకు తగ్గింది. దీంతో గతంలో కోటి రూపాయలకు పైగా ఉన్న ఈ SUV ఇప్పుడు రూ.99 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. యూరప్ కాకుండా డిఫెండర్ 110ను అసెంబ్లింగ్ చేస్తున్న తొలి దేశంగా భారత్ నిలిచింది. దేశంలో ప్రస్తుతం డిఫెండర్ 110 X-డైనమిక్ HSE వేరియంట్‌ను మూడు ఇంజిన్ ఆప్షన్లతో అందిస్తున్నారు. స్థానికంగా అసెంబ్లింగ్ చేసిన ఈ SUV ధరలను కంపెనీ ఇప్పుడు సవరించింది. కొత్త ధరలు చూస్తే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ గతంలో రూ.1.13 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.99 లక్షలకి తగ్గింది. 3.0 లీటర్ టర్బో పెట్రోల్ గతంలో రూ.1.52 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.1.18 కోట్లకి తగ్గింది. 3.0 లీటర్ డీజిల్ గతంలో రూ.1.52 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.1.18 కోట్లకి తగ్గింది. 3.0 లీటర్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై ఏకంగా రూ.34 లక్షల తగ్గింపు లభిస్తోంది. ఇక 2.0 లీటర్ పెట్రోల్ మోడల్ ధర రూ.14 లక్షలు తగ్గింది. ఈ SUV బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కస్టమర్లకు డెలివరీలు నవంబర్ 15, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మూడు ఇంజిన్ ఆప్షన్లలోనూ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ ఉంటాయి. దీంతో రోడ్లపై మాత్రమే కాకుండా కఠినమైన ఆఫ్‌రోడ్ పరిస్థితుల్లోనూ ఈ SUV మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ధర తగ్గింపుతో పాటు 2.0 లీటర్ పెట్రోల్ వేరియంట్లో కంపెనీ ఎక్స్ట్రా ఫీచర్లను కూడా అందిస్తోంది. దింతో సుమారు రూ.6.5 లక్షల విలువైన ఫీచర్లు ఇప్పుడు స్టాండర్డ్‌గా లభిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫికేషన్, 14-వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, సీట్లకు హీటింగ్ & కూలింగ్ సదుపాయాలు, మెమరీ ఫంక్షన్‌తో కూడిన ఫ్రంట్ సీట్లు... ఇక పెద్ద ఇంజిన్ వేరియంట్లలో మెరిడియన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, హెడ్-అప్ డిస్ప్లే, ఎలక్ట్రానిక్ యాక్టివ్ డిఫరెన్షియల్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉంటాయి.
పూణే ప్లాంట్‌లో డిఫెండర్ 110 అసెంబ్లింగ్ ప్రారంభం : డిఫెండర్ 110 SUV ధరలను భారీగా తగ్గించిన జాగ్వార్ ల్యాండ్ రోవర్
byTelugu Lo Computer
•
•
2 min read
