ప్రభుత్వ ఉద్యోగాల అభ్యర్థులకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల అభ్యర్థుల క్యారెక్టర్ వెరిఫికేషన్ నిబంధనలను కఠినతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఉగ్రవాద, హింసాత్మక, అవకతవకలకు పాల్పడినా, లేదా అలాంటి సంస్థలలో పాలుపంచుకున్న అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించనున్నారు. హింసాత్మక చర్యలపై నిషేధం: దేశంలో లేదా రాష్ట్రంలో హింస ద్వారా అధికార మార్పిడిని కోరుకునే కార్యకలాపాల్లో భాగస్వామ్యమైన వారికి ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, లోకల్ బాడీలలో నేరుగా భర్తీ అయ్యే ఉద్యోగాలు లభించవు. అయితే, కేవలం ఒక ప్రత్యేక రాజకీయ భావజాలం లేదా సిద్ధాంతాన్ని కలిగి ఉన్నంత మాత్రాన ఎవరినీ అనర్హులుగా చేయరు. కేవలం హింసాత్మక ఘటనల్లో పాల్గొంటేనే ఈ నిబంధన వర్తిస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదైతే ఆటోమేటిక్ అనర్హత కాదు: అభ్యర్థిపై కేవలం ఎఫ్‌ఐఆర్ నమోదైనంత మాత్రాన లేదా దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన నేరుగా ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటించరని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. 21 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత గత 3 సంవత్సరాలలో ఇటువంటి హింసాత్మక 'అధికార మార్పిడి' లేదా సమాజ వ్యతిరేక చర్యల్లో పాల్గొన్నట్లు ఆధారాలు లభిస్తే దానిని పరిగణనలోకి తీసుకుంటారు. జిల్లా పోలీస్, లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్ క్యారెక్టర్ వెరిఫికేషన్ నివేదికను 30 రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ ప్రక్రియ ఆలస్యమైతే అభ్యర్థి ఇచ్చే స్వీయ ప్రకటన ఆధారంగా తాత్కాలిక నియామక పత్రాన్ని జారీ చేయవచ్చు. ఒకవేళ తర్వాత వెరిఫికేషన్ నెగెటివ్‌గా వస్తే ఉద్యోగం రద్దవుతుంది. ఒకవేళ నివేదిక ప్రతికూలంగా వస్తే, సదరు అభ్యర్థికి ఆన్‌లైన్ లేదా స్వయంగా తన వివరణ ఇచ్చుకునే అవకాశాన్ని కలెక్టర్లు కల్పిస్తారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అపాయింట్‌మెంట్స్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. దేవరాజ్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. బంగ్లాదేశ్‌లో జరిగిన మాదిరిగా భారత్‌లో అల్లర్లు సృష్టించి అధికార మార్పిడికి కుట్ర పన్నుతున్నారంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది

Post a Comment

Previous Post Next Post
3