టెల్కోలు కృత్రిమ మేథ వినియోగంపై ముసాయిదా మార్గదర్శకాలను ప్రతిపాదించిన ట్రాయ్‌

టెల్కోలు కృత్రిమ మేథ (ఏఐ)ని బాధ్యతాయుతంగా వినియోగించేలా చూసే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) ముసాయిదా మార్గదర్శకాలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం టెల్కోలు తమ బోర్డులు ఆమోదించిన ఏఐ పాలసీలను అమలు చేయాలి. అలాగే ప్రత్యేకంగా గవర్నెన్స్, సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలి. ఏఐకి సంబంధించిన తీవ్రమైన ఉదంతాలను సత్వరం నియంత్రణ సంస్థ దృష్టికి తీసుకెళ్లాలి. తమ తమ నెట్‌వర్క్‌లు, సర్వీసుల్లో ఏఐ సిస్టమ్‌లను వినియోగించడం వల్ల తలెత్తే పరిణామాలకు ఆయా టెల్కోలే బాధ్యత వహించాల్సి వస్తుంది. రిస్క్‌ల వర్గీకరణ, వినియోగ అనుమతులు, మానవ పర్యవేక్షణ, డేటా గవర్నెన్స్, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలతో ఏఐ పాలసీని కంపెనీలు అంతర్గతంగా అమలు చేయాలి. దీనికి డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర ఉండాలి. ఏఐ సంబంధ ఉదంతాలను ప్రధానంగా అత్యంత తీవ్రమైనవి, తీవ్రమైనవి, ఒక మోస్తరుగా ఉన్నవి, అంత తీవ్రం కానివి అనే నాలుగు కేటగిరీల కింద వర్గీకరించాలి. తీవ్రమైన, అత్యంత తీవ్రమైన ఉదంతాలను నిర్దేశిత ఫార్మాట్‌లో, నిర్దిష్ట వ్యవధిలోగా ట్రాయ్‌కి తెలియజేయాలి. ఈ ముసాయిదా మార్గదర్శకాలపై సంబంధిత వర్గాలు నవంబర్‌ 27లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది.

Post a Comment

Previous Post Next Post
3