3

చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు : 108 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు గుర్తింపు, ముగ్గురికి పాజిటివ్

తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఓ ఫామ్‌హౌస్ వేదికగా రహస్యంగా నిర్వహిస్తున్న రేవ్ పార్టీని ఎస్‌ఓటీ, చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా భగ్నం చేశారు. ఈ పార్టీలో ఏకంగా 108 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు గుర్తించారు. పోలీసుల తనిఖీల్లో ముగ్గురికి గంజాయి పాజిటివ్‌గా రావడం కలకలం రేపింది. ప్రధాన నిర్వాహకుడితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేవెళ్ల సీఐ కట్టా నరేందర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మెట గ్రామంలో ఉన్న ఎల్జీ ఫామ్‌హౌస్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా ఈ పార్టీ నిర్వహించారు. ప్రధాన నిందితుడు మన్నన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా అక్టోబర్ 30న పార్టీ నిర్వహిస్తున్నట్లు స్నేహితులు, పరిచయస్తులకు సమాచారం ఇచ్చాడు. పార్టీ జరిగే ప్రాంతం వివరాలను ముందుగానే వెల్లడించకుండా గోప్యంగా ఉంచాడు. హాజరయ్యే వారి నుంచి రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఎంట్రీ ఫీజుగా వసూలు చేశాడు. డబ్బులు చెల్లించిన వారికి చివరి నిమిషంలో ఫామ్‌హౌస్ లొకేషన్ పంపించి అక్కడికి రప్పించాడు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 108 మంది విద్యార్థులు ఈ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో అత్యధికులు ఐక్యూఫై కాలేజీకి చెందిన విద్యార్థులుగా సమాచారం. ప్రధాన నిందితుడు మన్నన్ గతంలో అదే కాలేజీలో ఫ్రెషర్స్ డే కార్యక్రమం నిర్వహించడంతో విద్యార్థులతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని వారిని పార్టీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఫామ్‌హౌస్‌లో రహస్యంగా పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. అక్కడ ఉన్న విద్యార్థులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ప్రధాన నిందితుడు మన్నన్‌తో పాటు మరో ఇద్దరు విద్యార్థులకు గంజాయి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేవెళ్ల సీఐ కట్టా నరేందర్ రెడ్డి తెలిపారు.

Related Post

Previous
Next Post »