విద్యుదాఘాతానికి బలైన ఇద్దరు విద్యార్థులు

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో కాలేజ్ ఫెస్ట్ ముగించుకుని సరదాగా బయటకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు విద్యుత్ తీగలు తగిలి దుర్మరణం చెందారు. పోలీసుల కంటపడకుండా పరుగెత్తే క్రమంలో ఈ ప్రమాదం జరగడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. స్థానికంగా ఉన్న కేజీ రెడ్డి కాలేజీలో ఫెస్ట్ ముగిసిన తర్వాత, సుమారు పది మంది విద్యార్థులు కలిసి సమీపంలోని పొలాల్లోకి వెళ్లినట్లు సమాచారం. ఆ సమయంలో అక్కడే రాజిరెడ్డి అనే రైతు పొలానికి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఈ ప్రమాదం సంభవించింది. పొలంలో విద్యార్థులు మద్యం సేవిస్తున్న సమయంలో అటుగా వచ్చిన పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని వారు గమనించారు. పోలీసులకు పట్టుబడతామనే భయంతో విద్యార్థులంతా ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు తీశారు. చీకట్లో పరుగులు తీస్తున్న సమయంలో పొలంలో ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో మోహన్‌తో పాటు మరో విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాలేజీ వేడుకల్లో సంతోషంగా గడపాల్సిన విద్యార్థులు ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో తోటి విద్యార్థుల్లో, కళాశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Post a Comment

Previous Post Next Post
3