గుజరాత్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం బనాస్కాంతా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రూ.14 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు మరికొన్ని పనులను జాతికి అంకితం చేశారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ, రవాణా, గ్రామీణ మౌలిక సదుపాయాలు, బాలల సంక్షేమం వంటి రంగాలకు ఈ ప్రాజెక్టులు సంబంధించినవి. ఉత్తర గుజరాత్ అభివృద్ధికి వీటిలో ప్రాధాన్యం కల్పించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరైన వారందరూ ఇక్కడ మంచాలపై (చార్పాయ్లపై) కూర్చోవడం చూసి దేశ ప్రజలు ఆశ్చర్యపోవచ్చు. బనాస్కాంతా మన గ్రామీణ సంప్రదాయాలకు మళ్లీ జీవం పోసింది. ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ దృష్టికి తీసుకెళ్లి ఉంటే వారు దీనిని ప్రపంచ రికార్డుగా గుర్తించేవారు అని అన్నారు. బనాస్కాంతాలోని భిల్డీలో 127 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన భారత్ బోవైన్ బ్రీడింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. పశువుల సంతతి అభివృద్ధి, జన్యు మెరుగుదల, ఆధునిక పునరుత్పత్తి సాంకేతికతలపై పరిశోధన చేసేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. కంక్రేజ్ పశువుల జాతి కోసం దేశంలోనే తొలిసారిగా ప్రత్యేకంగా నెలకొల్పిన ఈ కేంద్రం ద్వారా ఆ జాతి అభివృద్ధి వేగం 10 నుంచి 20 రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా అక్టోబర్ 31న కేవడియాలోని ఏక్తా నగర్లో జరిగే రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకల్లో మోడీ పాల్గొననున్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే ఈ కార్యక్రమంలో భారత్ పర్వ్ 2026ను ప్రారంభించనున్నారు. అలాగే రూ.400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
గుజరాత్లో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన : రూ.14 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
byTelugu Lo Computer
•
•
2 min read
