రాష్ట్రంలో ఎన్నడూ చూడని దారుణాలు జరిగాయి : వైఎస్సార్‌సీపీ నాయకులు, శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్‌మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీ నాయకులు, శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం, అధికార యంత్రాంగం వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో రాష్ట్రంలో ఎన్నడూ చూడని దారుణాలు జరిగాయని ఆరోపించారు. పోలీసుల అండదండలతో తమ పార్టీ అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారని, రిటర్నింగ్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏజెంట్లుగా వ్యవహరించారని మండిపడ్డారు. నామినేషన్ పత్రాలను చింపివేయడం, ఫోర్జరీ సంతకాలతో విత్‌డ్రా చేయించడం, బి-ఫారాలను మాయం చేయడం వంటి అక్రమాలకు పాల్పడి ఏకగ్రీవాలంటూ ప్రచారం చేసుకుంటున్నారని జగన్ విమర్శించారు. నామినేషన్ల సమయంలోనే ఇన్ని అక్రమాలు, రిగ్గింగ్‌లు చూశామని, రాబోయే పోలింగ్ రోజున కూడా గతంలో జరిగినటువంటి ఘటనలే మళ్లీ జరిగే సూచనలు కనిపిస్తున్నాయని పార్టీ శ్రేణులను హెచ్చరించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని జగన్ పిలుపునిచ్చారు. మన ఓటర్లను సురక్షితంగా పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకువచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి సమస్యలు, అక్రమాలు ఎదురైనా వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని, లీగల్ సెల్ సహాయంతో చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తప్పులు చేసిన అధికారులను, నాయకులను భవిష్యత్తులో తప్పనిసరిగా చట్టం ముందు బోనులో నిలబెడతామని, వారికి వడ్డీతో సహా చెల్లింపులు ఉంటాయని హెచ్చరించారు.

Post a Comment

Previous Post Next Post
3