బహుదా నది వరద ఉధృతి : శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలన

తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాతో పాటు ఎగువ ప్రాంతమైన ఒడిశా రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బహుదా నది వరద నీరు ఇచ్చాపురం పరిధిలోని కొజ్జిరియా (బెళ్ళుపడ) టోల్ గేట్ సమీపంలో పేటూరు వద్ద జాతీయ రహదారిపైకి చేరుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. అక్కడ డ్రోన్ కెమెరాల ద్వారా వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ,జాతీయ రహదారిపై ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. వాహనదారులు, ప్రయాణికుల భద్రతకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.పోలీసు, రెవెన్యూ, ఇతర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ, రహదారిపై ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.వరద నీరు ప్రవహిస్తున్న రహదారులపై ప్రయాణించవద్దని, నీటి లోతు, ప్రవాహ వేగాన్ని అంచనా వేయలేని పరిస్థితుల్లో వాహనాలతో దాటేందుకు ప్రయత్నించవద్దని జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనవసర ప్రయాణాలను నివారించాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులు హెచ్చరికలను తప్పనిసరిగా పాటిస్తూ, వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వరద ముప్పు పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అధికారులు సూచించినప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసు లేదా రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

Post a Comment

Previous Post Next Post
3