నిర్మాతగా మారిన యాంకర్ ఉదయభాను : రేపటి నుంచి జీ5లో 'పంచనామా' స్ట్రీమింగ్

తెలుగు బుల్లితెరపై తనదైన యాంకరింగ్‌తో, నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటి ఉదయభాను ఇప్పుడు సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆమె మొదటిసారి నిర్మాతగా మారి 'పంచనామా' అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్‌ను రూపొందించారు. ఈ సిరీస్ రేపటి నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఉదయభాను తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈవెంట్‌లో మాట్లాడుతూ ఉదయభాను కన్నీటిపర్యూమ అయ్యారు. తాను ఎంతగానో భావోద్వేగాన్ని అదుపు చేసుకోవాలని అనుకున్నానని, కానీ అస్సలు కుదరలేదని తెలిపారు. నిర్మాతగా మారాలని తాను దాదాపు 15 ఏళ్లుగా ఎంతో తపస్సు చేశానని చెప్పుకొచ్చారు. తన ప్రయాణం టెలివిజన్‌లోనే ప్రారంభమైందని, ఇక్కడే ఉదయభాను అందరి హృదయభానుగా మారిందని గుర్తుచేసుకున్నారు. అందుకే నిర్మాతగా కూడా టెలివిజన్‌తోనే అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.  మంచి కంటెంట్ ఉందని ఎంతోమందిని కలిసినప్పటికీ పనులు ముందుకు పడలేదని వాపోయారు. వచ్చే నెల, వచ్చే వారం అంటూ కాలం గడిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఇన్నేళ్లు ఎందుకు ఆలస్యమైందనేది తనకూ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయిందని చెప్పారు. అప్పట్నుంచి ఇప్పటివరకు తాను ప్రశాంతంగా రెండు గంటలు కూడా నిద్రపోలేదని తెలిపారు. తన సుదీర్ఘ కలకు జీ5 సంస్థ ప్రాణం పోసిందని, వారికి జీవితాంతం రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితోనే ఇండస్ట్రీకి వచ్చానని ఆమె గుర్తుచేసుకున్నారు. కేవలం 12 ఏళ్ల వయసులోనే మైక్ పట్టుకుని ఒక్కో విషయం నేర్చుకుంటూ ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. తనకు పెద్ద పెద్ద స్టూడియోలు లేవని, ఏ అగ్రహీరోల కుటుంబం నుంచి తాను రాలేదని స్పష్టం చేశారు. ఈవెంట్‌కు ఏ అగ్రహీరోను ఆహ్వానించినా వచ్చేవారని, కానీ తన అసలైన బలం మాత్రం ప్రేక్షకుల ప్రేమేనని తెలిపారు. జీవితంలో ఎన్నిసార్లు కిందపడ్డా రెట్టింపు ఉత్సాహంతో తిరిగి నిలబడ్డానని చెప్పారు. ఈ సిరీస్ నిర్మాణం కోసం కొంతమంది హీరోలను సంప్రదిస్తే సిరీస్ మొత్తం బడ్జెట్‌ను కేవలం రెమ్యునరేషన్‌గా అడిగారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భరత్ నివాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌కు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ తన 'ఉదయభాను ప్రొడక్షన్స్' తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆమె వెల్లడించారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం