నల్లగొండలో వ్యక్తి దారుణ హత్య
తెలంగాణలోని నల్గొండలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఓ అపార్ట్మెంట్ నాలుగో అంతస్తులోని 402వ నంబర్ గదిలో ఈ హత్య వెలుగుచూసింది. గదిలో వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో డీఎస్పీ శివరామ రెడ్డి, టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్సై సైదాబాబు ఆధ్వర్యంలో క్లూస్ టీమ్లతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తమిళనాడుకు చెందిన కూలీల మధ్య కూలీ డబ్బుల విషయంలో తీవ్ర ఘర్షణ జరిగిందని, ఆ గొడవ తారస్థాయికి చేరడంతోనే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, వేతనాల వివాదం ఈ ఘర్షణకు దారితీసి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని తమిళనాడు రాష్ట్రానికి చెందిన మరియన్ ముత్తుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.