జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించాలని అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం ఒమర్ అబ్దుల్లా : వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేల రగడ
Monday, September 28, 2026
BJP MLAs create uproar in opposition CM Omar Abdullah moves resolution in Assembly seeking statehood for Jammu & Kashmir national
జమ్మూ కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తితో కూడిన రాష్ట్ర హోదా కల్పించాలని సీఎం ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేపెట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలు దీనిని వ్యతిరేకించారు. సభ మధ్యలోకి దూసుకెళ్లి హంగామా చేశారు. మైక్రోఫోన్లు విసిరేందుకు ప్రయత్నించడంతో సభలో గందరగోళం చెలరేగింది. శుక్రవారం ఒమర్ అబ్దుల్లా ప్రవేశపెట్టిన రాష్ట్ర హోదా తీర్మానంలో, ఆర్టికల్స్ 370, 35ఏ పునరుద్ధరణను చేర్చాలని కోరుతూ అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఎమ్మెల్యేలతో సహా పలువురు సభ్యులు సోమవారం సవరణ తీర్మానాలను ప్రవేశపెట్టారు. 2000లో ప్రవేశపెట్టిన స్వయంప్రతిపత్తి తీర్మానాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు. కాగా, ఈ తీర్మానాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. 'దేశ వ్యతిరేక, పాకిస్థానీ ఎజెండా' అని ఆరోపించారు. తీర్మానం ప్రతులను చించివేశారు. సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ రహీం రథర్‌ను తొలగించాలని నినాదాలు చేశారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలంతా సభ మధ్యలోకి దూసుకెళ్లారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపైకి మైక్రోఫోన్లు విసిరేందుకు ఒక బీజేపీ ఎమ్మెల్యే ప్రయత్నించారు. ఆ తర్వాత, ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు కూడా సభ మధ్యలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా గందరగోళం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు బీజేపీ సభ్యులను బయటకు పంపివేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ తిరిగి సమావేశమైనప్పుడు కూడా బీజేపీ సభ్యులు మళ్లీ సభ మధ్యలోకి దూసుకెళ్లారు. 'దేశ విభజనను మేం అనుమతించం' అంటూ నినాదాలు చేశారు.అయితే సీఎం ఒమర్ అబ్దుల్లా బీజేపీపై మండిపడ్డారు. గత రెండేళ్లుగా రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు స్థానిక బీజేపీ నాయకత్వం వ్యతిరేకమని, వారి అసలు స్వరూపం బయటపడిందని ఆయన ఆరోపించారు. 'ఈ తీర్మానం కేవలం రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సంబంధించినది. జమ్ముకశ్మీర్ ప్రజల నిజమైన శత్రువులు ఎవరో కూడా ఈ తీర్మానం బయటపెడుతుంది. రాష్ట్ర హోదా పునరుద్ధరణను ఎవరు కోరుకుంటున్నారు, ఎవరు దానికి వ్యతిరేకంగా ఉన్నారు? రాష్ట్ర హోదా అనేది నా ప్రభుత్వం కోసం లేదా నా పార్టీ కోసం కాదు. ఇది జమ్ముకశ్మీర్ అస్తిత్వం, ప్రజల కోసం' అని ఆయన అన్నారు. దేశం కోసం తమ పార్టీ ఎన్నో త్యాగాలు చేసిందని, తమకు బీజేపీ నుంచి ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
No comments:
Post a Comment