బీజేపీ ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తోంది : మిర్యాలగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Monday, September 28, 2026
BJP is weakening democratic institutions Minister Uttam Kumar Reddy at a Congress public meeting in Miryalaguda telangana TPCC's call regarding Chief Election Commissioner Gyanesh
దేశంలో ఓటు చోరీకి తెరపడిన రోజే కేంద్రంలో బీజేపీ పాలన అంతానికి నాంది పలికినట్టేనని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. భారత ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటం ఇప్పుడు నిర్ణాయక దశకు చేరుకుందన్నారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కు వ్యతిరేకంగాగా టీపీసీసీ పిలుపుమేరకు మిర్యాలగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దేశ ఎన్నికల వ్యవస్థకు పెనుముప్పుగా మారిన ఓటు చోరీపై రాహుల్ గాంధీ ధైర్యంగా, దృఢసంకల్పంతో పోరాడుతున్నారని చెప్పారు. అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసమున్న ప్రతి పౌరుడు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాహుల్ గాంధీ నాయకత్వంలో సాగుతున్న ఈ పోరాటంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఎన్ని ఎన్నికల ఎదురుదెబ్బలు తగిలినా, ఎన్ని రాజకీయ సవాళ్లు ఎదురైనా మారుమూల గ్రామాల వరకు కార్యకర్తలు పార్టీపై అచంచల విశ్వాసంతో నిలిచారని ఉత్తమ్ కొనియాడారు. వారి చెమట, కష్టం, త్యాగాల పునాదులపైనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌కు ప్రజలు ఎప్పుడూ బలమైన విజయాలను అందించారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై దేశ ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ఆయన తదుపరి ప్రధానమంత్రి కావాలని దేశం కోరుకుంటోందని చెప్పారు. 'రాహుల్ గాంధీ భారత తదుపరి ప్రధానమంత్రి అవుతారు.. తెలంగాణలోనూ కాంగ్రెస్ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఖాయం' అని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని నియోజకవర్గాల నుంచే తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యానని గుర్తు చేశారు. సాగునీటి విషయంలో తనపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, రాజకీయ దురుద్దేశంతోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ నైరుతి రుతుపవనాలు బలహీనపడి వర్షపాతం, జల లభ్యత తగ్గినట్లు వివరించారు. క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ నాగార్జునసాగర్ జలాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వినియోగిస్తోందన్నారు. సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకోవడంతోపాటు వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా అవసరమైన నిల్వలను కాపాడుతున్నామని చెప్పారు. బీఆరఎస్ ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన ముతక బియ్యాన్ని లబ్దిదారులు వాడుకోనందున అవి అక్రమ మార్కెట్‌కు తరలిపోయేవని ఉత్తమ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చి 3.42 కోట్ల మంది లబ్దిదారులకు ప్రతీ వ్యక్తికి నెలకు ఆరు కిలోల చొప్పున ఉచితంగా సన్న బియ్యం అందిస్తూ ప్రజాపంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చినట్లు చెప్పారు. నాగార్జునసాగర్-మిర్యాలగూడ ప్రాంతంలో కొనసాగుతున్న ఆరు ఎత్తిపోతల పథకాలను ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పనులను వేగవంతం చేసేందుకు అదనపు నిధులు కేటాయించినట్లు తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని 2028 జూన్ నాటికి పూర్తి చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఉత్తమ్ కుమార్ పునరుద్ఘాటించారు.
No comments:
Post a Comment