Sunday, October 18, 2026

తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కుందేలైన తమకు చేయూతనివ్వండి !


భారత్‌తో సిరీస్ ఆడటం వల్ల తమకు ఎలాంటి ఆదాయం లభించదని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సిఇవొ డెహ్రింగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. విదేశాల్లో తమ జట్టు ఆడట వల్ల భారీగానే రెవెన్యూ వచ్చినా తమకు ప్రయోజనం లేకుండా పోతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ ఓ విజ్ఞప్తి చేశాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కుందేలైన తమకు చేయూతనివ్వాలని కోరాడు. భారత్‌తో సిరీస్ హోరాహోరీగా సాగిందని.. ఇదే రాబోయే కాలంలో స్పాన్సర్లతో మరింత అర్థవంతమైన చర్చలు జరిపేందుకు తమకు అవకాశం కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ''మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. బాధ్యతాయుతమైన శ్రద్ధ ఉండాలి. ఏ పని చేసినా దానిని మాత్రం కోల్పోకూడదు. ఇప్పుడు విండీస్ క్రికెట్ కూడా ఇదే పరిస్థితుల్లో ఉందని అనుకుంటున్నా. ఆర్థిక మద్దతు మాకు అత్యంత అవసరం. ప్రపంచంలోనే అత్యుత్తమ టీమ్‌తో హోరాహోరీగా ఆడాం. సిరీస్ నెగ్గేందుకు చాలా చేరువగానే వచ్చాం'' అని సామి తెలిపాడు. ''భారత జట్టు ఏదైనా ఐసిసి ఈవెంట్‌లో పాల్గొన్న ప్రతిసారీ గెలుస్తుందని అభిమానులు ఆశిస్తారు. టీం ఇండియా కూడా అందుకు తగిన విధంగా సిద్ధమవుతుంది. అదే మా జట్టు విషయానికొస్తే.. అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని మరీ రాణించాల్సి ఉంటుంది. ఇప్పుడు భారత్‌తోనూ మా కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణించగలమనే నమ్మకం తిరిగి వచ్చింది. మరింత ఉత్సాహంగా ఉంచేలా చేయడమే కోచ్‌గా నా బాధ్యత. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి.. సుదీర్ఘ కాలం తర్వాత సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావించాం. ఆ మైండ్2సెట్‌తోనే బరిలోకి దిగాం. ఇదే ఆత్మవిశ్వాసంతో మున్ముందు నాణ్యమైన ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం'' అని సామి స్పష్టం చేశాడు.