Sunday, October 18, 2026

ఇరాన్ రక్షణ మంత్రిగా మెహర్దాద్ అఖ్లాఘీ నియామకం

ఇరాన్ దేశ కొత్త రక్షణ, సాయుధ బలగాల లాజిస్టిక్స్ మంత్రిగా మెహర్దాద్ అఖ్లాఘీని ప్రభుత్వం నియమించింది. ఆదివారం జరిగిన ఇరాన్ పార్లమెంట్ సమావేశంలో ఎంపీలు ఆయన నియామకానికి పచ్చజెండా ఊపారు. అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభమై ఎనిమిది నెలలు కావస్తున్న నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం ఈ కొత్త నియామకాన్ని చేపట్టింది. మొత్తం పోలైన 277 ఓట్లలో, అఖ్లాఘీకి అనుకూలంగా 237 ఓట్లు వచ్చాయి. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అప్పటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, రక్షణ మంత్రి అజీజ్ నసీర్‌జాదే సహా పలువురు సీనియర్ కమాండర్లు మరణించారు. దాంతో ఈ పదవి ఖాళీగా ఉంది. ఓటింగ్‌కు ముందు పార్లమెంట్‌ను ఉద్దేశించి అఖ్లాఘీ మాట్లాడుతూ దేశ రక్షణపై తన కార్యాచరణను వెల్లడించారు. “ఈ సున్నితమైన సమయంలో రక్షణ బాధ్యతలు స్వీకరించడం సవాలుతో కూడుకున్నది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుకోవాలంటే భౌగోళిక పరిణామాలపై స్పష్టమైన అవగాహన, భవిష్యత్ సవాళ్లను తట్టుకునే ముందస్తు సన్నాహాలు చాలా ముఖ్యం అని అఖ్లాఘీ పేర్కొన్నారు. మెహర్దాద్ అఖ్లాఘీకి నేరుగా సైనిక హోదా లేకపోయినా, రక్షణ రంగంలో విశేష అనుభవం ఉంది. ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖలో ఆయన సుమారు 42 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. 2013 నుంచి ఇరాన్ ప్రభుత్వ ఆయుధ తయారీ సంస్థ ‘ఇరానియన్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఆర్గనైజేషన్’ చీఫ్‌గా పనిచేస్తున్నారు. అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలతో 2007లోనే ఐక్యరాజ్యసమితి ఆయనపై ఆంక్షలు విధించింది.