ప్రముఖ డెయిరీ ఉత్పత్తుల సంస్థ అమూల్ నెయ్యి, వెన్న ధరలను పెంచింది. దేశవ్యాప్తంగా కొత్త ధరలను ఇప్పటినుంచే అమల్లోకి తీసుకొచ్చింది. అన్నీ రిటైల్ అవుట్లెట్లతో పాటు ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌లలో కొత్త ధరలను తక్షణమే అప్డేట్ చేశారు. ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో ఇప్పటికే ఉత్పత్తి లేబుళ్లను అప్డేట్ చేశారు. దీపావళి సందర్భంగా స్వీట్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ ఉంటారు. స్వీట్ల తయారీలో నెయ్యి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు అమూల్ తీసుకున్న నిర్ణయతో స్వీట్ల ధరలు పెరగనున్నాయి. కేజీ నెయ్యి కార్టన్ ధర రూ.50 పెంచగా, 500 గ్రాముల వెన్న ప్యాక్ ధర రూ.15 పెరిగింది. దీంతో పెరిగిన ధరలతో కేజీ నెయ్యి కార్టన్ ధర రూ.630 నుంచి రూ.680కి చేరుకుంది. ఇక 500 గ్రామలు స్వచ్చమైన నెయ్యి పౌచ్ ధర రూ.325 నుంచి రూ.345కి పెరిగింది. ఇక 100 గ్రాముల వెన్న క్యాక్ ధర రూ.63 నుంచి రూ.66కి పెరగ్గా.. 500 గ్రామలు ప్యాక్ ధర రూ.310 నుంచి రూ.325కి పెంచినట్లు అమూల్ సంస్థ తెలిపింది. నెయ్యి, వెన్న కొనుగోలు చేసేవారిపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. పండుగ సమయంలో వివిధ రకాల వంటల్లో నెయ్యి, వెన్న ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు వీటి ధరలు పెరగడం సామాన్యులకు చేదువార్తగా చెప్పవచ్చు. పశువుల మేత, ప్యాకేజింగ్ ఖర్చు, ఇంధన ఖర్చుల ధరలు పెరగడమే వీటి ధరలు పెంచడానికి కారణమని అమూల్ చెబుతోంది. ఈ ఏడాది మే నెలలో దేశవ్యాప్తంగా పాల ప్యాకెట్ల ధరలను పెంచింది. లీటర్‌పై రూ.2 చొప్పున పెంచింది. మే 14వ తేదీ నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చేశాయి. తాజా, గోల్డ్, శక్తి, ఆవు పాలు ధరలను పెంచింది. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. పశువుల మేత, ప్యాకేజింగ్, ఇంధన ఖర్చులు పెరగడం వల్ల ధరలను పెంచుతున్నట్లు చెబుతోంది. ఇక పాల రైతులకు చెల్లించే సేవకరణ ధరల్లో కూడా మార్పుల చేసింది. లీటర్‌కు 2.5 శాతం నుంచి 3.50 శాతానికి పెంచింది. అటు ఎల్‌నివో ప్రభావం కూడా పాల ఉత్పత్తుల ధరలు పెరగడానికి కారణంగా చెబుతోంది.
3
Beranda › Posts filed under food
Showing posts with label food. Show all posts
Showing posts with label food. Show all posts
ఏనుమాముల మార్కెట్లో మొక్కజొన్నకు ఆల్ టైం రికార్డు ధర : రూ.3230 ధర పలికిన క్వింటాల్ మొక్కజొన్న
ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ గా పేరొందిన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్నకు ఆల్ టైం రికార్డు ధర నమోదైంది. క్వింటాల్ మొక్కజొన్నకు రూ.3230 ధర పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండే కాకుండా కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన మొక్కజొన్న రైతులు తమ పంటను విక్రయించేందుకు ఏనుమాముల మార్కెట్ కు వస్తుంటారు. గత సంవత్సరం క్వింటాల్ మొక్కజొన్న 2000 నుండి 2300 రూపాయల వరకు పలకగా, ఈ సంవత్సరం మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 3230 రూపాయల ధర నమోదైంది. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నారు. గత సంవత్సరం ఎకరాకు 35 నుండి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తే, ఈ సంవత్సరం 25 నుండి 30 క్వింటాళ్లకే పరిమితమైందన్నారు. అయినప్పటికీ మార్కెట్ లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులకు కొంత ఊరటనిస్తుందని వరంగల్ ఏనుమామూల మార్కెట్ వ్యవసాయ కమిటీ చైర్మన్ ప్రియాంక అంటున్నారు. ఈ ధరలు ఇలాగే కొనసాగితే నష్టాల నుండి బయటపడతామని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తగ్గుముఖం పట్టిన కూరగాయల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. గత కొంతకాలంగా పెరిగిన ధరలతో ఇబ్బందులు ఎదుర్కొన్న వినియోగదారులకు ఇప్పుడు టమాటా, ఉల్లి సహా పలు కూరగాయల ధరలు తగ్గడం ఉపశమనంగా మారింది. వంటగదిలో నిత్యం ఉపయోగించే టమాటా, ఉల్లి ధరలు తగ్గడం వినియోగదారులకు ప్రధాన ఉపశమనంగా మారింది. హైదరాబాద్‌లో టమాటా కిలో ₹27, ఉల్లి ₹40గా ఉండగా.. విజయవాడలో టమాటా ₹40, ఉల్లి ₹39గా నమోదయ్యాయి.
పెరగనున్న నిత్యావసర ధరలు
నిత్యావసర వినియోగ వస్తువులైన సబ్బులు, టూత్పేస్ట్లు, వంటనూనెలు, చాక్లెట్ల వంటి ధరలు పెరగవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉత్పత్తి వ్యయం, రవాణా ఖర్చులు పెరగడంతో పలు ఎఫ్ఎంసీజీ కంపెనీలు ధరల పెంపుపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం వల్ల ఉత్పత్తుల తయారీ, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు అధికమవుతున్నాయి. మరోవైపు ముడిసరుకుల ధరల పెరుగుదల, తక్కువ వర్షపాతం కారణంగా వ్యవసాయ దిగుబడులపై ప్రభావం పడటం కంపెనీలకు సవాలుగా మారింది. ఈ పరిణామాలతో ఉత్పత్తుల తయారీ వ్యయం పెరిగి లాభాలపై ఒత్తిడి ఏర్పడుతోందని క్రిసిల్, ఎలరా క్యాపిటల్, కొటక్ నియో వంటి సంస్థల విశ్లేషణలు సూచిస్తున్నాయి. పెరుగుతున్న ఖర్చులను కంపెనీలు పూర్తిగా భరించడం కష్టమైతే, కొంత భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేసే అవకాశముంది. దీంతో రోజువారీ ఉపయోగించే వస్తువుల కొనుగోలుకు కుటుంబాలు మరింత ఖర్చు చేయాల్సి రావచ్చు. అయితే ధరల పెంపుపై కంపెనీల నుంచి అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది. నిత్యావసర వస్తువులతో పాటు టెలికాం రంగంలోనూ ధరల పెంపుపై అంచనాలు వినిపిస్తున్నాయి. అంబిత్ క్యాపిటల్ నివేదిక ప్రకారం, డిసెంబర్ నాటికి ప్రముఖ టెలికాం సంస్థలు మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే ఖర్చుల భారంతో సతమతమవుతున్న మధ్యతరగతి, పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, మొబైల్ సేవల ధరల పెరుగుదల అదనపు భారంగా మారే అవకాశం ఉంది.
జీడిపప్పు - ఆరోగ్య ప్రయోజనాలు
జీడిమామిడి పంటను పదహారో శతాబ్దంలో పోర్చుగీసు నావికులు బ్రెజిల్ నుంచి గోవాకు పరిచయం చేసినట్లు చారిత్రక వివరాలు చెబుతున్నాయి. అక్కడి నుంచి క్రమంగా భారత తీరప్రాంతాలకు ఈ పంట విస్తరించింది. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో జీడిమామిడి సాగు జరుగుతోంది. జీడిపప్పు శక్తిని అందించే ఆహారం. సాధారణంగా 100 గ్రాముల ముడి జీడిపప్పులో సుమారు 553 కిలోకేలరీలు ఉంటాయి. ఇందులో ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లతో పాటు మెగ్నీషియం, ఫాస్ఫరస్, రాగి, జింక్ వంటి ఖనిజాలు కూడా లభిస్తాయి. శరీర కణజాలాల నిర్మాణం, నిర్వహణకు తోడ్పడతాయి. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. రాగి, జింక్: శరీరంలోని పలు జీవక్రియలకు సహాయపడతాయి. జీడిపప్పులో కేలరీలు అధికంగా ఉంటాయి కాబట్టి పరిమితంగా తీసుకోవడం మంచిది. సాధారణంగా రోజుకు చిన్న గుప్పెడు, అంటే సుమారు 20-30 గ్రాములు, చాలామందికి సరిపోవచ్చు. వ్యక్తిగత ఆహార అవసరాలను బట్టి పరిమాణం మారుతుంది. జీడిపప్పు అలర్జీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. మొత్తానికి, జీడిపప్పు రుచికరమైనదే కాకుండా పోషకాలు అందించే ఆహారం కూడా. అయితే ఆరోగ్య ప్రయోజనాల కోసం దీన్ని సమతుల్య ఆహారంలో భాగంగా, తగిన పరిమాణంలో తీసుకోవడం ముఖ్యం.
కాఫీ - ఆరోగ్య ప్రయోజనాలు !
ప్రతిరోజు ఉదయం కాఫీ తాగడం వల్ల యాక్టివ్ ఉండడమే గాక, తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని, దీర్ఘాయువులో కీలక పాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. మితంగా తాగితేనే ఈ ప్రయోజనాలు పొందగలమని అంటున్నారు. అలాంటి ప్రయోజనాలు పొందాంటే ఎలా తాగాలో, ఏవిధంగా ఎప్పటికీ తాగకూడదు సవివరంగా వెల్లడించారు. క్రమం తప్పకుండా కాఫీ తాగితే ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి కాలేయ వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. అలాగే ఇది కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి కాలేయాన్ని రక్షిస్తుంది. కాఫీలో శక్తివంతమైన పాలీఫెనాల్స్ ఉంటాయి, ఇవి ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఒక కప్పు కాఫీ తాగడం వల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం 8% తగ్గుతుంది, 2 కప్పులు తాగితే 15% కాఫీ తాగే మహిళలకు ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందట. కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలను డీఎన్ఏ నుంచి రక్షిస్తాయి. కాఫీ ఈస్ట్రోజెన్ జీవక్రియ జరిగే విధానాన్ని మారుస్తుంది, తద్వారా రక్తప్రవాహంలో ప్రసరించే ఫ్రీ ఈస్ట్రోజెన్ స్థాయిలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. కాఫీలోని ఇతర సమ్మేళనాలు పార్కిన్సన్స్ వ్యాధి ప్రమాధాన్ని తగ్గిస్తాయట. కెఫీన్‌కు మెదడు ఆరోగ్యానికి తోడ్పడే న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలు ఉంటాయట. అందువల్ల దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం 37% తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.కాఫీలోని పాలిఫెనాల్స్ ఆక్సిడేటివ్ ఒత్తిడిని ఎదుర్కొని, దీర్ఘకాలిక మంటను తగ్గిస్తాయి, తద్వారా గుండె పనితీరు మెరుపడుతుందట. అంతేగాదు గుండె వైఫల్యం, అరిథ్మియాస్ ప్రమాదం కూడా తగ్గుతుందట. అలాగే పక్షవాత మరణాలు 19% తగ్గుతాయి. పొయ్యి మీద నుంచి తీసిన వెంటనే దాన్ని ఎప్పుడూ తాగవద్దు. చల్లగా ఉంటేనే సురక్షితం. 65 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉండే వేడి పానీయాలు అన్నవాహిక కేన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది. మరీ వేడిగా ఉండకూడదు, మరీ తీపిగా ఉండకూడదు, మరీ ఆలస్యంగా ఉండకూడదని నిపుణులు అంటున్నారు.
కాలం చెల్లిన శనగపిండి ప్యాకెట్లను డెలివరీ చేసిన జెప్టో : వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసిన FSSAI
జెప్టో కాలం చెల్లిన శనగపిండి ప్యాకెట్లను కస్టమర్ కు డెలివరీ చేసినట్లుగా వచ్చిన ఓ ఫిర్యాదుపై FSSAI స్పందించింది. ఈ క్రమంలోనే నియమనిబంధలన ఉల్లంఘనపై వివరణ కోరుతూ జెప్టోకు నోటీసులు జారీ చేసింది. ఆర్డర్ వివరాలు, ఉత్పత్తులను సరఫరా చేసిన వేర్‌హౌస్, సెల్లర్, ప్రొడక్ట్ వివరాలను తమకు సమర్పించాలని జెప్టోను ఆదేశించింది.
కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు : సోషల్ మీడియాలో వీడియో వైరల్
హైదరాబాద్‌లోని మాల్లో కొనుగోలు చేసిన కిట్‌క్యాట్ చాక్లెట్లో పురుగులున్నాయి ఒక వినియోగదారు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. దీనికి సంబంధించి వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. కూకట్‌పల్లిలో లులూ మాల్లో పిల్లల కోసం కొనుగోలు చేసినకిట్క్యాట్ చాక్లెట్లో సజీవ పురుగులు ఉన్నాయంటూ ఒక యూజర్ ఆందోళన వ్యక్తం చేశారు. పండుగ షాపింగ్ కోసం మాల్లో తమకు ఆ అనుభవం ఎదురైందని వాపోయారు. దీనిపై కిట్ క్యాట్ కంపెనీగానీ, లూలూమాల్ యాజమాన్యం గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
రేపు అంతర్జాతీయ గుడ్డు దినోత్సవం
మన రోజువారీ ఆహారంలో గుడ్డును చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు అందుతాయి. గుడ్డు ఈజీగా దొరికే హెల్తీ ప్రోటీన్. ఇందులో శరీరానికి అవసరమైన పలు విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు సమతుల్య ఆహారంలో గుడ్డుకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపం ఒక ముఖ్యమైన సమస్యగా కొనసాగుతోంది. తక్కువ ఖర్చుతో శరీరానికి అవసరమైన పోషకాలను అందించే ఆహారాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం అవసరం. గుడ్డు అలాంటి పోషక ఆహారాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్ శరీరంలోని కండరాల నిర్మాణం, నిర్వహణకు ఉపయోగపడుతుంది. అలాగే గుడ్డులోని ఇతర పోషకాలు శరీర ఎదుగుదల, సాధారణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలు, శారీరకంగా చురుకుగా ఉండే వ్యక్తులకు తగినంత ప్రోటీన్ తీసుకోవడం ముఖ్యం. గుడ్లలో ఉండే పోషకాలు కండరాల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా శరీర రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన పోషకాలను అందించడంలో, మెదడు పనితీరుకు తోడ్పడటంలో కూడా ఉపయోగపడతాయి. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాహారంలో గుడ్లను భాగం చేసుకోవచ్చు. అయితే ప్రతి వ్యక్తికి అవసరమైన ఆహారం, పోషకాల పరిమాణం వయస్సు, ఆరోగ్య పరిస్థితి, జీవనశైలి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని మొదటిసారిగా 1996లో నిర్వహించారు. గుడ్లలో ఉండే పోషక విలువ, వాటి ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ రోజు ప్రధాన ఉద్దేశం. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా గుడ్ల ప్రాముఖ్యతను తెలియజేస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గుడ్డు అన్ని వయసుల వారికి ఉపయోగపడే పోషక ఆహారంగా ప్రచారం చేయబడుతోంది. 2026లో ప్రపంచ గుడ్డు దినోత్సవం 30వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది 'Protein that Powers and Protects' అనే థీమ్‌ను తీసుకున్నారు. శరీరానికి శక్తిని అందించడంలో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ పోషించే ముఖ్యమైన పాత్రను ఈ థీమ్ తెలియజేస్తుంది. గుడ్డు సహజమైన అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్‌తో పాటు పలు ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. అందువల్ల కండరాల ఆరోగ్యం, శరీర సాధారణ ఎదుగుదల, రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన పోషకాహారం, మెదడు పనితీరు వంటి అంశాలకు గుడ్లు దోహదపడే ఆహారంగా పరిగణించవచ్చు. ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా గుడ్డును కేవలం సాధారణ ఆహారంగా కాకుండా, శరీరానికి అవసరమైన ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలను అందించే సహజమైన ఆహార వనరుగా గుర్తించాలనే సందేశాన్ని అందిస్తున్నారు.
అక్టోబర్ 1 : అంతర్జాతీయ కాఫీ దినోత్సవం
అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా "అంతర్జాతీయ కాఫీ దినోత్సవం" జరుపుకుంటారు. కాఫీ ప్రియులకు ఇది ఒక ప్రత్యేకమైన రోజు. సాధారణంగా మనం తాగే బ్లాక్ కాఫీ, ఫిల్టర్ కాఫీ లేదా కాపుచినోలకు భిన్నంగా వివిధ దేశాల్లో కాఫీని తయారు చేసే మరియు తాగే ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. కాఫీ జన్మస్థలంగా భావించే ఇథియోపియాలో కాఫీ తయారీ అనేది ఒక పెద్ద పండుగలా సాగుతుంది. అక్కడ పచ్చి కాఫీ గింజలను వేయించి, రోకలితో నూరి, 'జెబెనా' అనే సాంప్రదాయ మట్టి పాత్రలో కాఫీని మరిగిస్తారు. బంధువులు, స్నేహితులు అంతా కలిసి కూర్చుని ఈ కాఫీని ఆస్వాదించడం వారి సంస్కృతిలో భాగం. టర్కీలో కాఫీని 'సిజ్వే' అనే రాగి పాత్రలో సన్నని ఇసుక వేడిపై తయారు చేస్తారు. గింజలను చాలా సన్నగా పొడి చేసి, నీరు, చక్కెరతో కలిపి మరిగిస్తారు. ఈ కాఫీ చాలా చిక్కగా, గాఢమైన రుచితో ఉంటుంది. కాఫీ తాగిన తర్వాత కప్పు అడుగున మిగిలే పొడి ఆధారంగా భవిష్యత్తును చెప్పే సాంప్రదాయం కూడా అక్కడ ఉంది. వియత్నాం రాజధాని హనోయ్‌లో 'ఎగ్ కాఫీ' చాలా ప్రసిద్ధి. కోడిగుడ్డు పచ్చసొనను మిఠాయి చక్కెరతో బాగా మిక్స్ చేసి, దాన్ని వేడి డార్క్ కాఫీపై నురుగులా వేస్తారు. ఇది క్రీమీగా, డెసర్ట్ రూపంలో అద్భుతమైన రుచిని ఇస్తుంది. స్వీడన్లో కాఫీ తాగడాన్ని 'ఫికా' అంటారు. ఇది కేవలం కాఫీ విరామం మాత్రమే కాదు; పని ఒత్తిడి నుంచి బయటపడి స్నేహితులు లేదా సహద్యోగులతో కలిసి కాఫీ తాగుతూ, పిండి వంటకాలు (ముఖ్యంగా సిన్నమన్ బన్స్) తింటూ సమయాన్ని గడపడం అక్కడ ఒక సాంప్రదాయం. మెక్సికోలో కాఫీని మట్టి పాత్రల్లో తయారు చేస్తారు. కాఫీ పొడితో పాటు దాల్చిన చెక్క, 'పిలోన్సిల్లో' (ఒక రకమైన బెల్లం) కలిపి మరిగిస్తారు. మట్టి పాత్ర సువాసన, దాల్చినచెక్క తీపిదనం కలగలసి ఈ కాఫీకి ప్రత్యేకమైన ప్రాంతీయ రుచిని అందిస్తాయి. ఇటలీలో కాఫీ అంటే కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక జీవనశైలి. అక్కడ కాఫీని నిలబడి వేగంగా తాగే అలవాటు ఉంది. ఉదయం పూట మాత్రమే కాపుచినో తాగుతారు, మధ్యాహ్నం తర్వాత కేవలం స్ట్రాంగ్ ఎస్ప్రెస్సోను మాత్రమే ఇష్టపడతారు.
Read More...
ఉసిరికాయ ఒక 'సూపర్‌ఫుడ్' : మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ
భారతీయులు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన ఓ ఆయుర్వేద ఫలం గురించి సెప్టెంబర్ 27 ఆదివారం తాజా మన్ కీ బాత్ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోడీ చర్చించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్‌గడ్ జిల్లాను ఉసిరి సాగుతో ఉపాధి, లాభాలు పొందుతున్న ఓ ఉత్పత్తిదారుల గురించి వివరంగా తెలిపారు. భారతీయ సంప్రదాయ ఫలం ఉసిరి అంటూ చెప్పిన మోడీ ఉసిరికాయను ఒక 'సూపర్‌ఫుడ్'గా అభివర్ణించారు. ఉసిరి రుచికి రుచిని, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందిస్తుందని మోడీ కొనియాడారు. ఆయుర్వేదం భారతీయ మూలాల్లో దాగివున్న దివ్యఔషద నిలయంగా చూస్తారు. అందుకే చాలా వరకు ఇప్పటి కూడా ఆయుర్వేద మూలికలు, ఫలాలను తినడానికి చాలా మంది మొగ్గు చూపుతారు. వీటిలో కేవలం ఆరోగ్య ప్రయోజనాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరీ ముఖ్యంగా ఉసిరికాయ గురించి మోదీ మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. ఈ స్థానిక ఫలాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు పౌష్టికాహార భద్రతను కూడా బలోపేతం చేయవచ్చని ప్రధాని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాను ప్రధాని మోదీ ఉదాహరణగా చూపించారు. ఈ ప్రాంతానికి ఉసిరితో శతాబ్దాల అనుబంధం ఉందని ప్రస్తుతం 'ఒక జిల్లా - ఒక ఉత్పత్తి' పథకం కింద ఇక్కడి ఉసిరి పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.
Read More...
ఆకాశాన్నంటిన చక్కెర ధరలు
దేశీయంగా చక్కెర ధరలు ఆకాశాన్నంటడం సామాన్య వినియోగదారులకు పెద్ద నిరాశను మిగిల్చింది. గత జూలై నెలలో కిలో రూ. 48 వద్ద ఉన్న చక్కెర ధర, ఆగస్టు ఆఖరు నాటికి రిటైల్ మార్కెట్లో రూ. 58 నుండి రూ. 62 దాటింది. కొన్ని స్థానిక మార్కెట్లలో చిల్లర ధరలు కిలోకు రూ. 67 నుంచి రూ. 70 వరకు చేరగా, బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ప్యాకింగ్, ఇతర ఛార్జీలతో కలిపి కిలో రూ. 75 వరకు విక్రయిస్తుండటంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో వర్షపాతం, నీరు నిలవడం వల్ల చెరకు పంట దెబ్బతినడమే కాకుండా, ఉత్తరప్రదేశ్‌లో చెరకు పంటకు రెడ్-రాట్ వ్యాధి, పురుగుల దాడి సోకింది. దీంతో ప్రస్తుత సీజన్లో అంచనా వేసిన 343 లక్షల టన్నుల ఉత్పత్తి కాస్తా 306 లక్షల టన్నులకు పడిపోవడం ప్రధాన కారణమైంది. వినాయక చవితి, దసరా నాటికి స్వీట్లు, పిండివంటలు తయారు చేసే వ్యాపారులు, కుటుంబాలు పెద్ద ఎత్తున చక్కెర కొనుగోలు చేస్తుండటంతో డిమాండ్-సప్లై మధ్య వ్యత్యాసం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 33 లక్షల టన్నుల చక్కెర కొరత ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లో టన్ను ధర $474 నుంచి $552 దాకా పెరిగింది. మార్కెట్లో డిమాండ్‌ను చూసి కొందరు డీలర్లు, మిల్లు యజమానులు సరుకును ముందే నిల్వ చేయడం వల్ల కూడా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. దేశీయంగా కొరత లేకుండా చూసేందుకు 10 లక్షల టన్నుల ముడి చక్కెరను ఎటువంటి కస్టమ్స్ సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. డీలర్లు గరిష్ఠంగా 400 టన్నులకు మించి నిల్వ చేయకూడదని, అలాగే బల్క్ వినియోగదారులు 15 రోజులకు సరిపడా వినియోగ నిల్వలు మాత్రమే కలిగి ఉండాలని అక్టోబర్/నవంబర్ వరకు నిబంధనలు విధించింది. క్రషింగ్ సీజన్‌ను అక్టోబర్ 15 నాటికే ప్రారంభించాలని మిల్లులకు సూచించింది.
అవకాడో - ఆరోగ్య ప్రయోజనాలు
అవకాడోలో డైటరీ ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. అవకాడోలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఉపయోగపడే ఆహారంగా పనిచేయడంతో గట్ మైక్రోబయోమ్ ఆరోగ్యానికి సహకరించవచ్చు. ప్రధానంగా మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. వీటితో పాటు కొంత ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ కూడా ఉంటుంది. శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలను సరైన పరిమాణంలో తీసుకోవడం మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమైనది. అవకాడోలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ వంటివి సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకున్నప్పుడు గుండె ఆరోగ్యానికి కూడా ఉపయోగపడవచ్చు. అయితే అవకాడోను ఏదైనా ఒక వ్యాధిని నివారించే మందుగా భావించకూడదు. దీనిలోని కొన్ని పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యానికి సహకరించే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్ E వంటి పోషకాలు శరీరానికి అవసరం. అయితే అవకాడో తినడం వల్ల అల్జీమర్స్ లేదా డిమెన్షియా వంటి వ్యాధులు ఖచ్చితంగా రాకుండా నివారించవచ్చని చెప్పడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవు. కాబట్టి మెదడు ఆరోగ్యం కోసం మొత్తం ఆహారపు అలవాట్లు, శారీరక చురుకుదనం, నిద్ర వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E, ఇతర యాంటీఆక్సిడెంట్ పదార్థాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడవచ్చు. చర్మం పొడిబారకుండా ఉండేందుకు కూడా ఇవి కొంతవరకు తోడ్పడవచ్చు. అయితే అవకాడో తినడం వల్ల ముఖంపై ముడతలు పూర్తిగా తొలగిపోవడం, కళ్ల కింద నల్లటి వలయాలు పోవడం వంటి విషయాలకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. నల్లటి వలయాలకు నిద్రలేమి, జన్యుపరమైన కారణాలు, అలర్జీలు వంటి అనేక కారణాలు ఉండవచ్చు. వీటిలో ఉండే ఫైటో న్యూట్రియెంట్లు, యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షించడంలో సహాయపడవచ్చు. కొన్ని వృక్ష ఆధారిత సమ్మేళనాలు హార్మోన్లపై ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ, అవకాడో తినడం వల్ల పునరుత్పత్తి సంబంధిత సమస్యలు లేదా పెద్దప్రేగు క్యాన్సర్ వంటి క్యాన్సర్లను నివారించవచ్చని నిర్ధారించలేం. అలాగే దీనిని "యాంటీ-రేడియేషన్" ఆహారంగా భావించడానికి తగిన ఆధారాలు లేవు. అవకాడోను సలాడ్లు, స్మూతీలు, టోస్ట్ లేదా ఇతర ఆరోగ్యకరమైన వంటకాలలో భాగంగా తీసుకోవచ్చు.
అనలాగ్ డెయిరీ ప్రొడక్ట్స్‌తో తయారు చేసిన వంటకాలను విక్రయించడంపై జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రకటించిన జొమాటో
ఇకపై తమ ప్లాట్ఫామ్లో అనలాగ్ డెయిరీ ప్రొడక్ట్స్‌తో తయారు చేసిన వంటకాలను విక్రయించడంపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేయనున్నట్లు జొమాటో ప్రకటించింది. ఈ నిబంధనను ఉల్లంఘించే రెస్టారెంట్లను ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే అనలాగ్ డెయిరీని ఉపయోగిస్తున్నట్లు ప్రకటించిన వంటకాలను జొమాటో డీలిస్ట్ చేసింది. జొమాటో తీసుకున్న తాజా నిర్ణయం వినియోగదారుల ఆహార భద్రత, పారదర్శకత దిశగా ఒక అడుగుగా కనిపిస్తోంది. కానీ రెస్టారెంట్ ఏం ప్రకటించింది? అన్నదానికంటే రెస్టారెంట్ నిజంగా ఏం వాడుతోంది? అన్నది నిర్ధారించడం కీలకం. అందుకే జొమాటోకు ఇప్పుడు ఎదురవుతున్న అసలు సవాలు అనలాగ్ పనీర్‌ను నిషేధించడం కాదు, నిషేధాన్ని ఉల్లంఘిస్తున్న రెస్టారెంట్లను ఎలా గుర్తించి చర్యలు తీసుకుంటుందన్నదే. ఆ తనిఖీ విధానం స్పష్టమైతేనే ఈ కొత్త పాలసీపై వినియోగదారుల్లో పూర్తి నమ్మకం ఏర్పడే అవకాశం ఉంది.
ఫుడ్ ప్యాకెట్లపై రెడ్ కలర్ వార్నింగ్ : ప్రతిపాదించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
పరిమితికి మించిన చెక్కర, ఉప్పు, కొవ్వు పదార్థాలు ఉన్న ఆహార పదార్థాల ప్యాకెట్ల ముందు భాగంలో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా రెడ్ కలర్ వార్నింగ్ లేబుళ్లను తప్పనిసరి చేయాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. ప్రజారోగ్యాన్ని కాపాడే నిబంధనలను రూపొందించడంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆలస్యం చేయడంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలతో రంగంలోకి దిగిన ఆహార భద్రతా సంస్థ, ఐసీఎమ్ఆర్-ఎన్ఐఎన్ నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా ఆరు పేజీల అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించింది. వినియోగదారులకు ఏది మంచిదో, ఏది చెడో క్షణాల్లో తెలపడానికి ప్యాకెట్ ముందే స్పష్టమైన ఎరుపు రంగు లేబుల్ వేయాలని నిర్ణయించింది. ప్రతిపాదిత కొత్త నిబంధనల ప్రకారం, ప్యాకెట్ ముందు భాగంలో ఎరుపు రంగు ఆరుభుజాల ఆకారంలో వార్నింగ్ గుర్తును ముద్రించాలి. ఇవి సులువుగా అందరి కంటికి కనిపించేలా ఉండాలి. వెనుక ముద్రించే సాధారణ పోషకాల వివరాల కంటే ఈ లేబుల్లోని అక్షరాలు పెద్దగా ఉండాలి. ఒకవేళ కొవ్వు ఎక్కువగా ఉంటే "హై ఫ్యాట్", చెక్కర ఎక్కువగా ఉంటే "హై షుగర్", ఉప్పు ఎక్కువగా ఉంటే "హై సాల్ట్" అని రాయాలి. ఒకవేళ రెండూ ఎక్కువగా ఉంటే "హై ఫ్యాట్, హై షుగర్" అని, అలాగే కూల్ డ్రింక్స్‌పై "హైలీ స్వీటెండ్ బెవరేజ్" అని పెద్దగా ముద్రించాల్సి ఉంటుంది. ప్రతిపాదించిన నిబంధనల నుంచి కొన్ని రకాల సహజసిద్ధమైన పదార్థాలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ మినహాయింపు ఇచ్చింది. ఒకే ఒక్క పదార్థంతో రూపొందే సహజ ఉత్పత్తులకు ఈ ఎరుపు రంగు వార్నింగ్ లేబుళ్లు అవసరం లేదని తెలిపింది. పాలు, నెయ్యి, వంట నూనెలు, స్వచ్ఛమైన పంచదార, బెల్లం, తేనె వంటి నాచురల్ పదార్థాలకు ఈ వార్నింగ్ సింబల్స్ నుంచి ఊరట కలిగించారు. ఈ సరికొత్త రూల్స్‌ను దేశవ్యాప్తంగా రెండు దశల్లో అమల్లోకి తీసుకురావాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ భావిస్తోంది. మొదటి దశలో రెండింటి కంటే ఎక్కువ హానికర పోషకాలుగా పరిగణించే ఉప్పు, పంచదార, కొవ్వు) ఉన్న పదార్థాలతో పాటు, ఎక్కువ తీపి ఉండే కూల్ డ్రింక్స్ ప్యాకెట్లపై వార్నింగ్ గుర్తును తప్పనిసరి చేస్తారు. ఆ తర్వాత రెండో దశలో, కేవలం ఒక్క పోషకం పరిమితికి మించి ఉన్న ప్యాకేజ్డ్ ఆహారాలకు కూడా ఈ రెడ్ కలర్ వార్నింగ్ నిబంధనను విస్తరిస్తారు.
భారతదేశం మామిడి పండ్లపై నిషేధం విధించిన జపాన్ !
భారతదేశం నుండి తాజా మామిడి పండ్ల దిగుమతులను జపాన్ తక్షణమే నిలిపివేసింది. భారతీయ చికిత్సా కేంద్రాలలో ఫ్యూమిగేషన్, క్రిమిసంహారక చర్యలలో తీవ్ర లోపాలు ఉన్నట్లు జపాన్ క్వారంటైన్ తనిఖీ అధికారులు కనుగొనడమే ఈ కఠిన నిర్ణయానికి కారణమైంది. గతంలో 1986లో పండ్ల ఈగలు వ్యాప్తి చెందుతాయనే నెపంతో భారతీయ మామిళ్లపై జపాన్ ఏకంగా 20 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఆ తర్వాత సుదీర్ఘ చర్చల అనంతరం జూన్ 23, 2006న ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. అప్పట్లో ఇది "ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రతీక"గా నిలిచింది. అయితే, ఆ తర్వాత గత రెండు దశాబ్దాలుగా ఎప్పుడూ లేని విధంగా, మళ్లీ 20 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయిలో భారతీయ మామిడి దిగుమతులకు జపాన్ బ్రేక్ వేయడం ఇదే మొదటిసారి. ఈ ఆకస్మిక నిలిపివేత వల్ల అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉన్న మన ఆల్ఫాన్సో, కేసర్, లంగ్రా, బంగినపల్లి వంటి ప్రధాన నాలుగు మామిడి రకాల ఎగుమతులు నిలిచిపోయాయి. ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉండే అత్యంత కీలకమైన పీక్ ఎగుమతి సమయాన్నే ఈ నిషేధం తాకడం వల్ల భారతీయ ఎగుమతిదారులు భారీగా ఆర్థిక నష్టాలను చవిచూడబోతున్నారు. యోకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ జారీ చేసిన నోటీసు ప్రకారం.. మార్చి 25, 2026 లేదా ఆ తర్వాత భారత్ నుండి జారీ చేయబడిన తనిఖీ ధ్రువపత్రాలు కలిగిన ఏ ఒక్క మామిడి సరుకును కూడా జపాన్ ఆమోదించదు. నిబంధనల ప్రకారం జపాన్‌కు ఎగుమతి చేసే ప్రతి మామిడి కాయను రసాయన రహితమైన 'వేపర్ హీట్ ట్రీట్మెంట్' ప్రక్రియకు గురిచేయాలి. ప్రతి ఏటా జపాన్ క్వారంటైన్ అధికారులు భారత్‌కు వచ్చి ఈ ప్లాంట్లను తనిఖీ చేస్తారు. ఈ ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని రెహమాన్పూర్లో ఉన్న వేపర్ హీట్ ట్రీట్మెంట్ సౌకర్యాన్ని జపాన్ అధికారులు తనిఖీ చేసినప్పుడు, అక్కడ ఫ్యూమిగేషన్ ప్రొటోకాల్స్, క్రిమిసంహారక చర్యలలో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సాంకేతిక లోపాలు ఏమిటనేది ఇరు దేశాలు బహిరంగపరచకపోయినప్పటికీ.. ఈ లోపాలను సరిదిద్ది, తమ క్వారంటైన్ ప్రమాణాలు మెరుగుపడ్డాయని జపాన్ అధికారులు సంతృప్తి చెందే వరకు దిగుమతుల పునరుద్ధరణ జరగదని నోటీసులో స్పష్టం చేశారు.
సపోటా పండు - మధుమేహం
సపోటా పండులో సహజంగానే చక్కెరలు మరియు కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సపోటా తిన్నప్పుడు అవి శరీరంలో త్వరగా కలిసిపోయి రక్తంలోని షుగర్ లెవల్స్‌ను పెంచే అవకాశం ఉంది. అందుకే ఇక షుగర్ పేషెంట్లు సపోటాను తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ముఖ్యంగా ముదిరిన, బాగా పండిన సపోటాలో తీపి శాతం ఎక్కువగా ఉంటుంది. సపోటాలో కేవలం చక్కెరలే కాదు, మంచి ఫైబర్ కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేసి, చక్కెరలు రక్తంలోకి వేగంగా చేరకుండా కొంతవరకు అడ్డుకుంటుంది. ఇక దీనివల్ల షుగర్ ఒక్కసారిగా పెరగకుండా కంట్రోల్ అవుతుంది. అయితే, ఇది కేవలం తక్కువ పరిమాణంలో తిన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మధుమేహం ఉన్నవారు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న పండ్లను ఎంచుకోవడం ఎప్పుడూ ఉత్తమం. సపోటాతో పోలిస్తే జామకాయ, ఆపిల్, బెర్రీలు లేదా బొప్పాయి వంటివి షుగర్ పేషెంట్లకు చాలా మేలు చేస్తాయి. ఇక వీటివల్ల కడుపు నిండుగా ఉండటమే కాకుండా, షుగర్ లెవల్స్ కూడా అదుపులో ఉంటాయి. సపోటా తినాలనిపిస్తే, అప్పుడప్పుడు కేవలం ఒక చిన్న ముక్క లేదా ఒక చిన్న పండుకు పరిమితం కావడం మంచిది. షుగర్ ఉన్నంత మాత్రాన సపోటాను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ రోజువారీ తీసుకునే ఆహారం, షుగర్ లెవల్స్ ఎలా ఉన్నాయనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఇతర కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకున్న రోజున ఒకటి లేదా అర పండు తినవచ్చు. అయితే జ్యూస్ రూపంలో కాకుండా నేరుగా పండులా తింటేనే అందులోని ఫైబర్ శరీరానికి అందుతుంది. మధుమేహ బాధితులు ఏదైనా తినేటప్పుడు రుచి కంటే ఆరోగ్యం గురించి ఆలోచించడం ముఖ్యం. సపోటా వంటి తీపి పండ్లను పరిమితంగా తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు.
చెరుకు రసం - డయాబెటిస్
చెరుకు రసం తక్షణ శక్తిని ఇస్తుంది. కానీ చెరుకు రసం అందరికీ మంచి చేస్తుందా అంటే అవునని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. చెరుకు రసంలో సహజంగా ఎక్కువ షుగర్ ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు దీన్ని తాగితే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే షుగర్ కంట్రోల్లో లేకపోతే, చెరుకు రసం పరిస్థితిని మరింత కష్టతరం చేయవచ్చు. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు దీన్ని పూర్తిగా నివారించడం మంచిది. చెరుకు రసంలో క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది తాగిన వెంటనే శరీరంలో షుగర్ పెరుగుతుంది. ఈ రెండు కారణాలు బరువు పెరగడానికి దారితీస్తాయి. ఇప్పటికే అధిక బరువు ఉన్నవారు తరచుగా చెరుకు రసం తాగితే మరింత సమస్యలు రావచ్చు. అయితే బరువు కంట్రోల్లో ఉంటే అప్పుడప్పుడు ఒక గ్లాస్ మాత్రమే తాగడం మంచిది. కొంతమందికి తరచుగా అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు ఉంటాయి. అలాంటి వారు చెరుకు రసం తాగితే ఈ సమస్యలు మరింత పెరగవచ్చు. కాబట్టి జీర్ణ సమస్యలు ఉన్నవారు దీన్ని తాగకుండా ఉండటం మంచిది. చెరుకు రసం తాగాలనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖాళీ కడుపుతో ఎక్కువగా తాగకూడదు. ఒకేసారి ఎక్కువ మోతాదులో తాగడం కూడా మంచిది కాదు. పరిశుభ్రమైన ప్రదేశంలో తయారుచేసిన రసాన్ని మాత్రమే తాగాలి.
వేప రసం - మంచి - చెడులు
ప్రాచీన కాలం నుండి భారతీయ గృహవైద్యంలో వేప ఒక తిరుగులేని ఔషధంగా నిలుస్తూ వస్తోంది. ఉదయాన్నే లేవగానే వేప రసం సేవించడం అనేది కేవలం ఒక చేదు అనుభవం మాత్రమే కాదు, అది శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరిచే ఒక పవిత్ర ప్రక్రియగా చాలామంది భావిస్తారు. అయితే, మారుతున్న జీవనశైలిలో ఫిట్‌నెస్‌పై పెరిగిన అవగాహన కారణంగా, చాలా మంది దీనిని ఒక సంప్రదాయంగా కాకుండా 'హెల్త్ ట్రెండ్'గా మార్చేస్తున్నారు. అమృతం లాంటి వేప రసం కూడా సరైన అవగాహన లేకుండా, మోతాదు మించి తీసుకుంటే ఆరోగ్యానికి అమృతం కాస్తా విషంగా మారే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు వేప రసం తాగడం వెనుక ఉన్న సైన్స్ ఏంటి, దానివల్ల కలిగే అద్భుత ప్రయోజనాలతో పాటు పొంచి ఉన్న ప్రమాదాలు ఏమిటన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేప రసం రక్తంలోని టోక్సిన్లను (విషతుల్యాలను) బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీనివల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. రక్తం శుద్ధి అవ్వడం వల్ల మొటిమలు, మచ్చలు, దురద వంటి చర్మ సమస్యలు దరిచేరవు. సహజసిద్ధమైన మెరుపు మీ సొంతమవుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో వేప కీలక పాత్ర పోషిస్తుంది. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఒక మంచి న్యాచురల్ రెమెడీ. నోటి దుర్వాసనను పోగొట్టి, చిగుళ్లను బలంగా ఉంచడంలో వేప రసం సహాయపడుతుంది. పోషకాహార నిపుణుల ప్రకారం, వేప రసాన్ని 'జ్యూస్' లాగా గ్లాసులతో తాగకూడదు. దీనిని ఒక 'ఔషధం'గా భావించాలి. రోజుకు 5 నుండి 10 ఎంఎల్ (సుమారు రెండు టీస్పూన్లు) మించకుండా తీసుకోవడం ఉత్తమం. ఉదయాన్నే పరగడుపున అర గ్లాసు గోరువెచ్చని నీటిలో ఈ రసాన్ని కలిపి తీసుకోవచ్చు. దీన్ని ప్రతిరోజూ వరుసగా నెలల తరబడి తాగకూడదు. ఒక వారం పాటు తాగి, మళ్ళీ కొంత విరామం ఇచ్చి కొనసాగించాలి. గర్భవతులు వేప రసం తాగితే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. అలాగే పాలిచ్చే తల్లులు కూడా దీనికి దూరంగా ఉండాలి. చిన్న పిల్లలకు వేప రసం ఇవ్వకూడదు. ఇది వారిలో లివర్ లేదా కిడ్నీ సమస్యలకు దారితీయవచ్చు. ఏదైనా ఆపరేషన్ జరగాల్సి ఉంటే, దానికి రెండు వారాల ముందే వేప రసం తాగడం మానేయాలి. ఎందుకంటే ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను ఒక్కసారిగా తగ్గించే అవకాశం ఉంది. కిడ్నీ లేదా కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వైద్యుల సలహా లేకుండా దీనిని అస్సలు ముట్టుకోకూడదు. వేప రసం నిస్సందేహంగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ దీనిని సరైన పద్ధతిలో, సరైన మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు లేదా మందులు వాడుతున్న వారు వైద్యుడిని సంప్రదించి వేప రసాన్ని డైట్లో చేర్చుకోవడం మంచిది.
ఆయుర్వేదం - బొప్పాయి
బొప్పాయి పండు రోజూ తింటే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్పడంతో ఇప్పుడిది పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. మందులు లేకుండా, ఖరీదైన డైట్లు పాటించకుండా కేవలం ఒక పండుతో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చని చాలా మంది నమ్ముతున్నారు. న్యూట్రిషన్ నిపుణుల ప్రకారం బొప్పాయిలో ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఖచ్చితంగా సహాయపడతాయి. అయితే కేవలం బొప్పాయి పండు మాత్రమే తినేసి కొలెస్ట్రాల్ మొత్తాన్ని కంట్రోల్ చేసేయవచ్చు అనుకోవడం మాత్రం పొరపాటే. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కేవలం ఒక సపోర్ట్‌లా మాత్రమే పనిచేస్తుంది. బొప్పాయిలో ఉండే కరిగే పీచు పదార్థం మన జీర్ణ వ్యవస్థలో ఉండే కొలెస్ట్రాల్ కణాలతో కలిసిపోతుంది. అవి రక్తంలో కలవక ముందే శరీరం నుండి బయటకు పంపేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఒక రకమైన నేచురల్ క్లీనింగ్ సిస్టమ్‌లా పనిచేస్తుంది. అందుకే కొలెస్ట్రాల్ తగ్గడానికి ఫైబర్ ఉన్న పండ్లను రోజూ తినమని డాక్టర్లు చెబుతుంటారు. దీనిలో విటమిన్-సి తో పాటు బోలెడన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి. ఇక దీనివల్ల భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అయితే ఇవి కేవలం రక్షణ ఇస్తాయే తప్ప, అప్పటికే పేరుకుపోయిన భారీ కొలెస్ట్రాల్‌ను ఒక్కసారిగా మాయం చేయలేవు. కొలెస్ట్రాల్ సమస్య అనేది మన జీవనశైలి వల్ల వస్తుంది. అందుకే బొప్పాయితో పాటు ఆపిల్స్, జామకాయలు, ఆకుకూరలు, గింజలు వంటివి కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక వీటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువు అదుపులో ఉంచుకోవడం మరియు నూనె వస్తువులను తగ్గించడం వంటివి చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది.
Subscribe to:
Posts (Atom)








