భారతదేశం నుండి తాజా మామిడి పండ్ల దిగుమతులను జపాన్ తక్షణమే నిలిపివేసింది. భారతీయ చికిత్సా కేంద్రాలలో ఫ్యూమిగేషన్, క్రిమిసంహారక చర్యలలో తీవ్ర లోపాలు ఉన్నట్లు జపాన్ క్వారంటైన్ తనిఖీ అధికారులు కనుగొనడమే ఈ కఠిన నిర్ణయానికి కారణమైంది. గతంలో 1986లో పండ్ల ఈగలు వ్యాప్తి చెందుతాయనే నెపంతో భారతీయ మామిళ్లపై జపాన్ ఏకంగా 20 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఆ తర్వాత సుదీర్ఘ చర్చల అనంతరం జూన్ 23, 2006న ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. అప్పట్లో ఇది "ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రతీక"గా నిలిచింది. అయితే, ఆ తర్వాత గత రెండు దశాబ్దాలుగా ఎప్పుడూ లేని విధంగా, మళ్లీ 20 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయిలో భారతీయ మామిడి దిగుమతులకు జపాన్ బ్రేక్ వేయడం ఇదే మొదటిసారి. ఈ ఆకస్మిక నిలిపివేత వల్ల అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉన్న మన ఆల్ఫాన్సో, కేసర్, లంగ్రా, బంగినపల్లి వంటి ప్రధాన నాలుగు మామిడి రకాల ఎగుమతులు నిలిచిపోయాయి. ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉండే అత్యంత కీలకమైన పీక్ ఎగుమతి సమయాన్నే ఈ నిషేధం తాకడం వల్ల భారతీయ ఎగుమతిదారులు భారీగా ఆర్థిక నష్టాలను చవిచూడబోతున్నారు. యోకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ జారీ చేసిన నోటీసు ప్రకారం.. మార్చి 25, 2026 లేదా ఆ తర్వాత భారత్ నుండి జారీ చేయబడిన తనిఖీ ధ్రువపత్రాలు కలిగిన ఏ ఒక్క మామిడి సరుకును కూడా జపాన్ ఆమోదించదు. నిబంధనల ప్రకారం జపాన్‌కు ఎగుమతి చేసే ప్రతి మామిడి కాయను రసాయన రహితమైన 'వేపర్ హీట్ ట్రీట్‌మెంట్' ప్రక్రియకు గురిచేయాలి. ప్రతి ఏటా జపాన్ క్వారంటైన్ అధికారులు భారత్‌కు వచ్చి ఈ ప్లాంట్లను తనిఖీ చేస్తారు. ఈ ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని రెహమాన్‌పూర్‌లో ఉన్న వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ సౌకర్యాన్ని జపాన్ అధికారులు తనిఖీ చేసినప్పుడు, అక్కడ ఫ్యూమిగేషన్ ప్రొటోకాల్స్, క్రిమిసంహారక చర్యలలో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సాంకేతిక లోపాలు ఏమిటనేది ఇరు దేశాలు బహిరంగపరచకపోయినప్పటికీ.. ఈ లోపాలను సరిదిద్ది, తమ క్వారంటైన్ ప్రమాణాలు మెరుగుపడ్డాయని జపాన్ అధికారులు సంతృప్తి చెందే వరకు దిగుమతుల పునరుద్ధరణ జరగదని నోటీసులో స్పష్టం చేశారు.
0 Comments