భారత మహిళా పవర్‌లిఫ్టర్ కేయా కునాల్ బెనర్జీ ఆన్‌లైన్ లైంగిక వేధింపుల బారినపడ్డారు. ఏఐ సాంకేతికత ద్వారా రూపొందించిన వేలాది అసభ్యకర, అభ్యంతరకర చిత్రాలను విచ్చలవిడిగా పోస్ట్ చేస్తున్నారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడారంగంలో తన ప్రతిభ ద్వారా దేశం గర్వించే స్థాయికి ఎదగాలని శ్రమిస్తున్న తరుణంలో, ఇటువంటి డిజిటల్ వేధింపులు తనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నాయని ఆమె వాపోయారు. అసభ్యకర చిత్రాల ప్రచారంతో పాటు కొందరు నెటిజన్లు తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. క్రీడాకారుల విజయాలను గుర్తించి ప్రోత్సహించాల్సింది పోయి, సామాజిక మాధ్యమాల్లో ఇలా దిగజారి ట్రోల్ చేయడం తనను ఎంతగానో కలచివేస్తోందని ఆమె పేర్కొన్నారు. నిరంతరం కొనసాగుతున్న ఈ ఆన్‌లైన్ వేధింపుల వల్ల తీవ్రమైన అసౌకర్యం, ఇబ్బంది ఎదురవుతోందని వివరించారు. మహిళా క్రీడాకారిణుల గౌరవానికి భంగం కలిగిస్తూ, ఏఐ టెక్నాలజీని తప్పుడు మార్గాల్లో వాడుతున్న ఇలాంటి వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు, క్రీడాభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
0 Comments