Ad Code

నెల్లూరు రైల్వే స్టేషన్‌లో $1.5 లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు రైల్వే స్టేషన్‌లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న లక్షా యాభై వేల అమెరికన్ డాలర్లను రెవెన్యూ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తున్న వ్యక్తి వద్ద ఈ విదేశీ కరెన్సీని గుర్తించిన అధికారులు పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించి నగదును పట్టుకున్నట్లు తెలియజేశారు. ఢిల్లీ నుంచి చెన్నైకు వెళ్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక వ్యక్తి విదేశీ కరెన్సీని తరలిస్తున్నట్లు నెల్లూరు రెవెన్యూ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది.దీంతో పక్కా సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. నెల్లూరు రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించగా సంబంధిత వ్యక్తి వద్ద ఎలాంటి సరైన పత్రాలు లేకుండా 1,50,000 అమెరికన్ డాలర్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ మొత్తంలో అమెరికన్ డాలర్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడికి తరలిస్తున్నారు? వీటికి సంబంధించిన పత్రాలు ఎందుకు లేవు? ఈ నగదు వెనుక ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే కోణాల్లో అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. విదేశీ మారకద్రవ్యానికి సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించారా? లేదా మరేదైనా అక్రమ లావాదేవీలకు ఈ నగదుతో సంబంధం ఉందా? అనే అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. స్వాధీనం చేసుకున్న విదేశీ కరెన్సీ విలువ, దాని మూలం, తరలింపుదారుడి వివరాలు తదితర అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కు సమాచారం/కేసు అప్పగించినట్లు తెలియజేశారు.

Post a Comment

0 Comments

Close Menu