జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడిలో విద్యార్థులు : తీవ్రరూపం దాల్చిన విద్యార్థుల ఆందోళన
జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల అవకతవకలపై విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో, సోమవారం రాంచీలో రాష్ట్ర అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ పరీక్షను రద్దు చేయాలని, ఈ పరిణామాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పరీక్ష జరిగినందున సీబీఐ విచారణ సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థుల డిమాండ్లలో 98 శాతం ఆమోదించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, విద్యార్థులు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము కోరిన 13 పరీక్షల్లో కేవలం మూడింటిని మాత్రమే ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. నిరసనల్లో భాగంగా ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నేత దేవేంద్ర నాథ్ మహ్తో, సోమవారం నిర్ణయాత్మక పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ నిరసనల నేపథ్యంలో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు అజీతా భట్టాచార్య, అనిమా హన్సా, జమాల్ అహ్మద్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. పేపర్ లీక్ ఆరోపణలపై సీఐడీ వీరిని విచారణకు పిలవడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అసెంబ్లీ పరిసరాల్లో 750 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధించడంతో పాటు, రాంచీ వ్యాప్తంగా భారీ పోలీసు బలగాలను మోహరించారు. ప్రభుత్వం, విద్యార్థుల మధ్య పట్టువీడని ధోరణి కొనసాగుతుండటంతో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.