Ad Code

జియో ప్లాట్‌ఫార్మ్స్’ తొలి పబ్లిక్ ఆఫరింగ్ ప్రతిపాదనకు ‘సెబీ’ ఆమోదం

రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగమైన ‘జియో ప్లాట్‌ఫార్మ్స్’ తొలి పబ్లిక్ ఆఫరింగ్ ప్రతిపాదనకు ‘సెబీ’ తుది ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ దాదాపు 27 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సమాయత్తమవుతోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఈ ఆఫర్ ద్వారా కంపెనీ సుమారు రూ. 37,000 కోట్లకు పైగా నిధులను సమీకరించే అవకాశం ఉంది. దీంతో భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓలలో ఒకటిగా జియో ప్లాట్‌ఫార్మ్స్ నిలవనుంది. ఇది పూర్తిగా ‘ఫ్రెష్ ఇష్యూ’ రూపంలో వస్తోంది. అంటే, పాత భాగస్వాములు లేదా ప్రమోటర్లు తమ వద్ద ఉన్న వాటాలను విక్రయించే ఆఫర్ ఫర్ సేల్ విధానం ఉండదు. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా వచ్చే నిధుల మొత్తాన్ని నేరుగా కంపెనీ ఖాతాలోనే జమ చేస్తారు. సేకరించిన నిధులను ప్రధానంగా కంపెనీకి చెందిన పాత రుణాలను చెల్లించడానికి, డిజిటల్ నెట్‌వర్క్ మౌలిక వసతులను మరింత ఆధునీకరించడానికి, 5G , రాబోయే తరం సాంకేతికతల విస్తరణకు, ఇతర జనరల్ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించనున్నారు. ఈ ఈక్విటీ షేర్లు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ రెండింటిలోనూ లిస్ట్ కానున్నాయి. మెటా, గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాల పెట్టుబడులు ఉండటం, దేశంలోనే అతిపెద్ద టెలికాం, డిజిటల్ నెట్‌వర్క్‌గా 50 కోట్లకు పైగా ఇన్వెస్టర్ల మద్దతు ఉండటంతో ఈ పబ్లిక్ ఇష్యూపై మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu