ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వశిష్ఠ వంతెనపై తమ మూడేళ్ల చిన్నారిని ఒంటరిగా వదిలేసి ఓ దంపతులు గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది. స్థానికులు. పోలీసులు కదనం మేరకు.. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన దొడ్డా సాయి (29), శిరీష (28) దంపతులు తమ మూడేళ్ల చిన్నారితో కలిసి స్కూటీపై చించినాడ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. గురువారం రాత్రి చిన్నారిని స్కూటీపైనే ఒంటరిగా కూర్చోబెట్టి, దంపతులిద్దరూ నదిలోకి దూకేశారు. చిన్నారి చీకట్లో, తీవ్రమైన చలిలో ఆ పసిపాప ఒంటరిగా ఏడుస్తూ "అమ్మ.. నాన్న" అని రోదిస్తున్న దృశ్యాన్ని చూసి ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు ఆ చిన్నారిని సురక్షితంగా రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దొడ్డా సాయి గతంలో గల్ఫ్‌లో పనిచేసి వచ్చి, వేల్పూరులో రెడీమేడ్ దుస్తుల దుకాణం ప్రారంభించారు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడం, అప్పుల బాధలు ఎక్కువై ఇల్లు కూడా విక్రయించాల్సి రావడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేపట్టారు.
0 Comments