Ad Code

వైయస్సార్‌సీపీకి కర్త, కర్మ, క్రియ ఒక్క వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డే !

వైయస్సార్‌సీపీ నాయకుడు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు అత్యంత దారుణమని అన్నారు. వైయస్సార్‌సీపీకి కర్త, కర్మ, క్రియ ఒక్క వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డే. పార్టీలో నంబర్‌ వన్‌, నంబర్‌ టూ అనే ప్రశ్నే లేదు. జగన్‌ నంబర్‌ టూ, సజ్జల నంబర్‌ వన్‌ అన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్య అత్యంత అన్యాయం. జగన్‌ లేని వైయస్సార్‌సీపీకి అర్థమే లేదు. విజయసాయిరెడ్డిని పార్టీలో వెనక్కి లాగారన్న ఆరోపణకు ఆయనకు వచ్చిన పదవులే సమాధానం. రాజ్యసభ సభ్యత్వం, జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ఉత్తరాంధ్ర సమన్వయకర్త, అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్‌ వంటి అత్యంత కీలక బాధ్యతలు ఆయనకే దక్కాయి. 2020 నుంచే తనను తగ్గించారని విజయసాయిరెడ్డి ఇప్పుడు చెబుతున్నారు. అలా అయితే 2022లో రెండోసారి రాజ్యసభకు ఎందుకు పంపారు? పార్టీ నుంచి వెళ్లినప్పుడు 'వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నాను, ఎవరిపైనా కోపం లేదు, సజ్జల వల్ల రాజీనామా చేయలేదు' అని చెప్పిన విజయసాయిరెడ్డి ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. జగన్‌ మతమార్పిడులను ప్రోత్సహించారన్న విజయసాయిరెడ్డి ఆరోపణ దారుణం. వైయస్‌ కుటుంబం అన్ని మతాలను ఎలా గౌరవించిందో దశాబ్దాలుగా దగ్గరగా ఉన్న విజయసాయిరెడ్డికి బాగా తెలుసు. విజయసాయిరెడ్డిపై జగన్‌కు ప్రత్యేకమైన అభిమానం, విశ్వాసం ఉండేది. తప్పుడు కేసుల్లో తనతో పాటు ఇబ్బందులు పడ్డారన్న భావనతో అత్యున్నత స్థాయి అవకాశాలు, బాధ్యతలు ఇచ్చారు. రాజకీయ పార్టీ పెట్టుకోవాలంటే విజయసాయిరెడ్డి స్వేచ్ఛగా పెట్టుకోవచ్చు. కానీ కొత్త రాజకీయ ప్రయాణానికి ప్రచారం కోసం జగన్‌ను, వైయస్సార్‌సీపీని టార్గెట్‌ చేయడం సరికాదు. ఇదే ధోరణి కొనసాగితే సమాధానం కూడా అంతే ఘాటుగా ఉంటుంది. 2024 ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినా వైయస్సార్‌సీపీ సంస్థాగతంగా మళ్లీ పుంజుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకైనా, 2029 సాధారణ ఎన్నికలకైనా, అంతకంటే ముందే ఎన్నికలు వచ్చినా పార్టీ సిద్ధం. వైయస్సార్‌సీపీ ఎన్నికలకు భయపడటం లేదు. డెడ్‌, అబ్సెంట్‌, ఘోస్ట్‌ ఓట్లను తొలగించి ఓటర్ల జాబితా శుద్ధి చేసిన తర్వాత ఎన్నికలు జరపాలన్నదే పార్టీ డిమాండ్‌.

Post a Comment

0 Comments

Close Menu