అమెరికాలోని న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ భారత్‌లో ముస్లింలు ఉండకూడదని ఎవరైనా అనుకుంటే వారు అసలు హిందువే కాదని అన్నారు. దీనిపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ ప్రపంచం ముందు ఒకరకంగా, తమ కార్యకర్తలకు నూరిపోసేందుకు మరొక రకంగా మాట్లాడటం ఆరెస్సెస్‌కు అలవాటైన పాత వ్యూహమేనని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఒవైసీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, ఆ సంస్థ పూర్వ నాయకుల పుస్తకాలలోని సారాంశాన్ని ప్రస్తావిస్తూ ఘాటు విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్ భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదని ఒవైసీ ఆ సంస్థ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ గాంధీజీ నాయకత్వంలోని 'హిందూ-ముస్లిం ఐక్యత'ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారని ఒవైసీ అన్నారు. ఈ విషయం ఆర్ఎస్ఎస్ ప్రచురించిన ఆయన జీవిత చరిత్రలోనే స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తుందని, 1940లోనే ఎం.ఎస్. గోల్వాల్కర్ ఒకే జెండా, ఒకే నాయకుడు, ఒకే సిద్ధాంతం అని ప్రకటించారని పేర్కొన్నారు. గోల్వాల్కర్ రాసిన 'బంచ్ ఆఫ్ థాట్స్' పుస్తకంలోని ఇంటర్నల్ త్రెట్స్ అధ్యాయంలో ముస్లింలు, క్రైస్తవులను దేశానికి మొదటి, రెండు ప్రధాన ముప్పులుగా వర్ణించారని, ముస్లింలను నిరంతరం అనుమానించాలని రాశారని ఒవైసీ పేర్కొన్నారు. ఉమ్మడి పౌర స్మృతి, మతమార్పిడి నిరోధక చట్టాలు, ఉపా వంటి చట్టాల పేరుతో మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, 2002 గుజరాత్ అల్లర్లలో ముస్లింలపై జరిగిన హింసను ఈ సందర్భంగా ప్రస్తావించారు. మోహన్ భగవత్ బయటకు ఇలాంటి తియ్యటి మాటలు చెప్పడం మాని తమ పూర్వ నాయకులు హెడ్గేవార్, గోల్వాల్కర్, సావర్కర్ రాసిన పుస్తకాలలోని విషపూరిత అంశాలను ప్రజలకు బహిరంగంగా చదివి వినిపించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. అప్పుడే ప్రజలు ఆర్ఎస్ఎస్ అసలు నిజస్వరూపాన్ని అర్థం చేసుకుంటారని విమర్శించారు.
0 Comments