మూడు రోజుల్లో తెగిపోనున్న బ్యారియర్ సరస్సు : చైనా హెచ్చరిక

నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన వరద విషాదం నుంచి కోలుకోకముందే చైనా అధికారులు మరో కీలక హెచ్చరిక జారీ చేశారు. నేపాల్-టిబెట్ సరిహద్దుకు ఎగువ ప్రాంతంలోనే మంచు కొండలు, మట్టి, రాళ్లతో ఏర్పడిన అడ్డు వల్ల ఓ 'బ్యారియర్ సరస్సు(తాత్కాలిక నీటి రిజర్వాయర్ )' తయారైందని వెల్లడించారు. ఈ అడ్డు నీటి వత్తిడిని తట్టుకోలేక వచ్చే 72గంటలల్లో తెగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే భారీ వరదలు, బురద ప్రవాహంతో దెబ్బతిన్న నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతానికి ఎగువన ఈశాన్యంలో సరస్సు ఉందన్నారు. ముఖ్యంగా ఛోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్పో అనే రెండు నదులు కలిసే సంగమ స్థలంలో బ్యారియర్ సరస్సు ఏర్పడిందని చెప్పారు. కొండ చరియలు విరిగిపడటం, మంచు చరియలు అడ్డుపడటం వల్ల నది ప్రవాహానికి సహజంగా ఏర్పడిన ఈ అడ్డుకట్ట కారణంగా నీరు భారీగా నిల్వ ఉండిపోయిందని వివరించారు. గురువారం నాటి లెక్కల ప్రకారమే ఈ బ్యారియర్ సరస్సులో సుమారు 2 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి పరిమాణం ఉంది. ఇది ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటి పొర్లుతోంది. దీనికి తోడు రాబోయే మూడు రోజుల్లో ఎగువ నుంచి మరో 3 మిలియన్ క్యూబిక్ మీటర్ల అదనపు నీరు సరస్సులోకి వచ్చి చేరే అవకాశం ఉందని చైనా సెంట్రల్ టెలివిజన్ (సీసీటీవీ) స్పష్టం చేసింది. ఈ భారీ నీటి వత్తిడిని తట్టుకోలేక రాబోయే 72 గంటల్లో సరస్సు అడ్డుకట్ట ఒక్కసారిగా తెగిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ఒకవేళ సరస్సు తెగిపోతే, దిగువ ప్రాంతాలైన భోటే కోషి, త్రిశూలి నదీ పరీవాహక ప్రాంతాలపై మరోసారి పెను జలప్రళయం ముంచెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రయులు కావడం, వందలాది మంది గల్లంతై సహాయక చర్యలు కొనసాగుతుండటం తెలిసిందే. ఈ తరుణంలో ఈ కొత్త బ్యారియర్ సరస్సు ముప్పు రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర ఆటంకం కలిగిస్తుందని చైనా ఆందోళన వ్యక్తం చేసింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org