అర్హత ఉన్నప్పటికీ ఈపీఎఫ్ పరిధిలోకి రాని ఉద్యోగులను నమోదు చేసేందుకు 'ఎంప్లాయీస్ ఎన్‌రోల్‌మెంట్ క్యాంపెయిన్ 2026'ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. గతంలో మిగిలిపోయిన నమోదు, కాంప్లయన్స్ లోపాలను సరిదిద్దడంతోపాటు మరింత మంది ఉద్యోగులకు పీఎఫ్, పెన్షన్, బీమా వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 2026 జూన్ 29న ఈఈసీ - 2026ను నోటిఫై చేసింది. ఈ ప్రత్యేక ప్రచారం జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఉద్యోగుల నమోదు కోసం అక్టోబర్ 31 వరకు అవకాశం ఉంది. వివిధ సంస్థల్లో 2009 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్య కాలంలో పనిచేసినా, అర్హత ఉన్నప్పటికీ గతంలో ఈపీఎఫ్ లో నమోదు కాని ఉద్యోగులను ఈ పథకం కింద చేర్చవచ్చు. అయితే డిక్లరేషన్ సమయంలో సంబంధిత ఉద్యోగి అదే సంస్థలో ఉద్యోగంలో కొనసాగుతూ ఉండాలి. గతంలో ఉద్యోగుల నుంచి పీఎఫ్ వాటా మినహాయించకపోయిన సందర్భాల్లో, EEC-2026 కింద ప్రకటించిన ఉద్యోగులకు ఉద్యోగి వాటా చెల్లింపు నుంచి మినహాయింపు కల్పించారు. అయితే యజమాని తన వాటాతోపాటు వర్తించే వడ్డీ, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా విధించే నష్టపరిహారానికి బదులుగా ఈ ప్రచారం కింద ఒక్కో సంస్థకు రూ.100 లంప్‌సమ్ డ్యామేజెస్ నిబంధనను తీసుకొచ్చారు. ఈ ప్రచారం ప్రధానంగా గతంలో ఈపీఎఫ్ కవరేజీకి దూరమైన అర్హత కలిగిన ఉద్యోగుల కోసం ఉద్దేశించినది. ఈపీఎఫ్ పరిధిలో ఉన్న లేదా ఈపీఎఫ్ చట్టం/సామాజిక భద్రతా కోడ్ కింద కవరేజీకి వచ్చే సంస్థలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. యజమానులు తమ పాత ఉద్యోగ, వేతన రికార్డులను పరిశీలించి అర్హులైన ఉద్యోగులు ఎవరైనా నమోదు కాకుండా మిగిలిపోయారా అనేది గుర్తించాలని ఈపీఎఫ్‌వో సూచించింది. EEC-2026 కింద నమోదు ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ప్రకటించిన ఉద్యోగులకు ఉమాంగ్‌యాప్ ద్వారా ఫేస్ ఆథెంటికేషన్ ఆధారంగా UAN జనరేషన్, అనంతరం ECR ద్వారా సంబంధిత పీఎఫ్ కాంట్రిబ్యూషన్ల చెల్లింపు వంటి విధానాలను ఈపీఎఫ్‌వో పేర్కొంది. దీంతో గతంలో నమోదు కాని ఉద్యోగులను అధికారిక సామాజిక భద్రతా వ్యవస్థలోకి తీసుకురావడంతోపాటు రికార్డుల్లో పారదర్శకత పెరగనుంది. ఈపీఎఫ్‌లో నమోదు కావడం ద్వారా అర్హత కలిగిన ఉద్యోగులకు భవిష్య నిధి మాత్రమే కాకుండా సంబంధిత పెన్షన్, ఉద్యోగి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి. అదే సమయంలో సంస్థల గత కాంప్లయన్స్ లోపాలను క్రమబద్ధీకరించేందుకు కూడా ఈ ప్రత్యేక విండో ఉపయోగపడుతుంది.
0 Comments