నేపాల్‌లో జలప్రళయం :గ్లేసియర్ విరిగిపడుతున్న దృశ్యాలు టూరిస్ట్ డ్రోన్ కెమెరాలో రికార్డ్ : వీడియో నెట్టింట వైరల్

నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాలను ఊహించని రీతిలో ముంచెత్తి వందలాది మంది ప్రాణాలను బలిగొన్న భయంకరమైన జలప్రళయానికి అసలు కారణం గ్లాసియర్ విరిగి పడడం అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇదెలా జరిగిందో మాత్రం ఎవరికీ తెలియదు. కానీ ఓ టూరిస్ట్ డ్రోన్ కెమెరాలో గ్లేసియర్ విరిగిపడిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. అయితే పర్వత ప్రాంతాల్లోని మంచు కొండలు హఠాత్తుగా కూలిపోతుండగా అనుకోకుండా రికార్డు కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సముద్ర మట్టానికి సుమారు 7,200 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న లాంగ్‌టాంగ్ లిరుంగ్ పర్వత శిఖరం సమీపంలో ఈ ఘోరం జరిగింది. ఒక చైనా ఫోటోగ్రాఫర్ తీస్తున్న డ్రోన్ ఫుటేజ్‌లో ఒక భారీ రాతి కొండ, దానికి ఉన్న మంచు పలకలు ఒకేసారి పర్వత శ్రేణి నుంచి తెగిపడి కిందకు జారిపోయాయి. కొండచరియలు విరిగిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన దూళి మేఘాలు ఆవరించాయి. ఇదంతా డ్రోన్ కెమెరాలో రికార్డు కాగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా పర్వతం పైభాగం నుంచి తెగిపడిన భారీ మంచు, రాళ్లు, మట్టి సుమారు 1,200 మీటర్ల కింద ఉన్న లోయలోకి తీవ్ర వేగంతో దూసుకొచ్చాయి. ఈ విధ్వంసకర ప్రవాహం వల్ల కింద ఉన్న భోటేకోషి, త్రిశూలి నదులు ఒక్కసారిగా ఉప్పొంగి ఆకస్మిక వరదలకు దారితీశాయి. ఆగస్టు 26వ తేదీన సంభవించిన ఈ భీకర ప్రళయంలో నేపాల్‌లో 903 మంది, టిబెట్‌లో 16 మంది మరణించారు. దాదాపు 4,500 మందికి పైగా ప్రజలు గల్లంతు అయ్యారు. ఈ దారుణ వైపరీత్యంపై నేపాల్ ప్రధాన మంత్రి బాలేంద్ర షా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశం ఊహించని, హృదయ విదారకమైన విపత్తును ఎదుర్కొంటోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రసువాలోని భోటే కోషి నది సృష్టించిన బీభత్సం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలను అంచనా వేయడం అధికారులకు అత్యంత కష్టంగా మారిందని తెలిపారు. ప్రతికూల వాతావరణం, క్లిష్టమైన కొండ దారులు ఉన్నప్పటికీ పౌరుల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని, ప్రజల ఐక్యతతో ఈ సంక్షోభం నుంచి బయటపడతామని ఆయన ధైర్యం చెప్పారు.

No comments:

Post a Comment

3