పైలట్ శిక్షణ కేంద్రాన్ని కర్నూలు విమానాశ్రయంలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ప్రాజెక్టు కోసం ప్రసిద్ధ ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ' సంస్థకు విమానాశ్రయ ప్రాంగణంలో 1.25 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఔత్సాహిక యువత పైలట్ శిక్షణ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది. దాదాపు రూ. 100 కోట్ల భారీ వ్యయంతో ఈ శిక్షణ కేంద్రాన్ని సకల సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా అకాడమీ భవనం, విమానాలను ఉంచేందుకు హ్యాంగర్ , టాక్సీవే, మెయింటెనెన్స్ , రిపేర్ సెంటర్లతో పాటు విద్యార్థులకు అత్యంత ఖచ్చితమైన ప్రాక్టికల్ అనుభవాన్ని అందించేందుకు అధునాతన ఫ్లైట్ సిమ్యులేటర్లను అందుబాటులోకి తేనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనలకు కట్టుబడి ఈ కేంద్రం రూపుదిద్దుకుంటోంది. శిక్షణ కార్యకలాపాలను ప్రారంభించడంలో భాగంగా కర్ణాటకలోని మైసూర్ కేంద్రం నుంచి మూడు శిక్షణా విమానాలను కర్నూలు ఎయిర్‌పోర్టుకు తీసుకురానున్నారు. ఈ కేంద్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు క్లాస్‌రూమ్ పాఠాలతో పాటు ప్రాక్టికల్ ఫ్లయింగ్ ట్రైనింగ్‌ను ఇక్కడే ప్రత్యక్షంగా అందించనున్నారు. స్పష్టమైన వాతావరణం, విశాలమైన రన్‌వే ఉండటం వల్ల కర్నూలు ఎయిర్‌పోర్ట్ ఫ్లయింగ్ శిక్షణకు అత్యంత అనుకూలమైన వేదికగా నిలవనుంది. కమర్షియల్ పైలట్ లైసెన్స్ కోర్సులతో పాటు, రాబోయే రోజుల్లో ఏవియేషన్ రంగానికి అవసరమైన ఇతర వృత్తిపరమైన కోర్సులను కూడా ఇక్కడ విస్తరించాలని నిర్వాహకులు నిర్ణయించారు. భవిష్యత్తులో ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ , కేబిన్ క్రూ శిక్షణా కోర్సులను కూడా ఇక్కడ నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక కేంద్రం ఏర్పాటుతో రాయలసీమ ప్రాంతం ఏవియేషన్ హబ్‌గా మారడమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి, ఉన్నత అవకాశాలు లభించనున్నాయి.
0 Comments