Ad Code

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘానికి కీలక లేఖ రాసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై  కేంద్ర ఎన్నికల సంఘానికి కీలక లేఖ రాశారు. ఓటర్ల జాబితా సవరణలో అర్హత ఉన్న ఒక్క ఓటరు పేరు కూడా తొలగించకూడదని, అదే సమయంలో అనర్హులైన వారి పేర్లు జాబితాలో ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. SIR ప్రక్రియలో ఓటర్లకు తగిన సమయం, అవసరమైన సహాయం అందించేలా విధానపరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. జూన్ 10, 2026 నాటికి తెలంగాణలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. వీరిలో 73.39 లక్షల మంది అంటే 21.7 శాతం మంది గైర్హాజరైన, నివాసం మారిన, మరణించిన లేదా ఒకటికి మించి నమోదైన ఓటర్లుగా ఎఎస్డీడీ కేటగిరీలో గుర్తించినట్లు ఈసీ గణాంకాలే చూపిస్తున్నాయన్నారు. ఈ ఎఎస్డీడీ కేటగిరీలోనే సుమారు 62 శాతం అంటే 45.19 లక్షల మందిని 'పర్మనెంట్లీ షిఫ్టెడ్'గా గుర్తించడం ఆందోళనకరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అదే సమయంలో డిజిటలైజ్ చేసిన 2.65 కోట్ల గణన పత్రాల్లో 60.50 లక్షల పత్రాల్లో లోపాలు ఉన్నాయని, మరో 32.36 లక్షల పత్రాలు గత ఓటర్ల జాబితాతో అనుసంధానం కాలేదని తెలిపారు. దీంతో సుమారు 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఇది రాష్ట్రంలోని దాదాపు మూడో వంతు ఓటర్లపై ప్రభావం చూపే అంశమని సీఎం అభిప్రాయపడ్డారు. SIR ప్రక్రియలో కొన్ని విధానపరమైన సమస్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి లేఖలో ప్రస్తావించారు. గణన సిబ్బంది ఇంటికి వచ్చిన సమయంలో తాత్కాలికంగా అందుబాటులో లేని వారిని, శాశ్వతంగా నివాసం మార్చిన వారిని ఒకే విధంగా పరిగణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజంగా నివాసం మార్చిన ఓటర్లకు కొత్త ప్రాంతంలో ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవసరమైన సహాయం అందించకుండా, పాత ప్రాంతంలోని ఓటు తొలగించే పరిస్థితి రాకూడదని కోరారు. అలాగే ఓటరు పేరు తొలగించే ముందు అధికారిక నోటీసు, విచారణ వంటి ప్రక్రియలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉన్న క్లెయిమ్స్, అభ్యంతరాల గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీని కూడా ప్రస్తుతం నిర్ణయించిన అక్టోబర్ 19 నుంచి ముందుకు మార్చాలని కోరారు. రోజువారీ కూలీలు, వలస కార్మికులు, వృద్ధులు వంటి వారికి కేవలం వారం రోజుల వ్యవధిలో అవసరమైన పత్రాలు సమర్పించడం కష్టమని.. నోటీసులు అందుకున్న వారికి కనీసం 3 నుంచి 4 వారాల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితాలపై ప్రజలకు ముందుగానే విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం కోరారు. గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ప్రచారం నిర్వహించడంతో పాటు కనీసం రెండుసార్లు గ్రామసభలు, వార్డు కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలను బహిరంగంగా చదివి వినిపించాలని సూచించారు. అర్హత ఉన్న ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో సులభంగా తెలుసుకునేలా ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఓటర్లకు అవసరమైన పత్రాలపై అవగాహన కల్పించేందుకు నియోజకవర్గ, పోలింగ్ కేంద్ర స్థాయిలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. అవసరమైన ధ్రువపత్రాలను పొందడంలో కూడా ప్రజలకు సహకరించాలని కోరారు. ప్రభుత్వ ఉత్తర్వు GO No.172 ప్రకారం జారీ చేసే కుటుంబ నమోదు ధ్రువపత్రాన్ని అంగీకరించకపోవడం వల్ల పట్టణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. మండల స్థాయిలో సులభంగా లభించే ఇతర పత్రాలను కూడా అంగీకరించేలా ఆధారాల జాబితాను విస్తరించాలని కోరారు. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే రాష్ట్రంలోని మొత్తం ఎఎస్డీడీ ఓటర్లలో 58.6 శాతం, పరిశీలన నోటీసుల్లో 41.9 శాతం కేంద్రీకృతమై ఉన్నాయని సీఎం తెలిపారు. ఉద్యోగాలు, వివాహాలు, తాత్కాలిక నివాస మార్పుల కారణంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రక్రియను మరింత సులభతరం చేయాలని కోరారు. హైదరాబాద్‌లో ప్రతి నియోజకవర్గంలో సగటున 78 వేలకుపైగా కేసులు ఉన్నందున అదనపు అధికారులను నియమించి వికేంద్రీకృత విచారణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణలో సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేనందున ఓటర్ల జాబితా సవరణను మరింత సమగ్రంగా నిర్వహించేందుకు తగిన సమయం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. SIR ప్రక్రియలో ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఒక్క అర్హుడి ఓటు కూడా తొలగిపోకుండా.. ఒక్క అనర్హుడి పేరు కూడా జాబితాలో చేరకుండా పారదర్శకంగా SIR ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

Post a Comment

0 Comments

Close Menu