Ad Code

నేపాల్‌ వరద బీభత్సం : 1643 మంది విద్యార్థులను రావి చెట్టు కిందకు సురక్షితంగా చేర్చిన ఉపాధ్యాయుడు

నేపాల్‌ వరద బీభత్సం పెను విషాదాన్ని మిగిల్చింది. వందలాదిమందిని పొట్టన బెట్టుకుంది. అయితే ఇంతటి భారీ విపత్తులో అక్కడక్కడా వెలుగు చూస్తున్న కొన్ని ఘటనలు నెట్టింట ప్రశంసలందుకుంటున్నాయి. ఒక ఉపాధ్యాయుడు రానున్న విపత్తును ఊహించి, త్వరితగతిన స్పందించి, వందలమంది విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించి వారి ప్రాణాలను కాపాడిన ఘటన భారీ ఊరటనిస్తోంది. బుధవారం ఉదయం 9:20 గంటలకు, నేపాల్‌లోని నువాకోట్‌కు చెందిన త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ రాజేంద్ర దవాడీ (47), ఆకస్మికంగా వచ్చిన భయంకరమైన వరదల నుంచి తన సమయస్ఫూర్తితో 1,643 మంది విద్యార్థులను సురక్షితంగా కాపాడారు. గ్రామం వరదల్లో కొట్టుకుపోయిందని స్నేహితుడి నుంచి ఫోన్ రావడంతో పాటు, ఒక విద్యార్థి తండ్రి వరద నీరు వేగంగా పెరుగుతోందని హెచ్చరించాడు. దీనితో వెంటనే అప్రమత్తమైన ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు , ప్రిన్సిపాల్ కూడా అయిన దవాడీ, పాఠశాల గంట మోగించి తరగతి గదులను ఖాళీ చేయాల్సిందిగా ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాల భవనాలు వరద నీటిలో కొట్టుకుపోకముందే, దవాడీ 1,643 మంది పిల్లలను కాలినడకన కొండపై ఉన్న ఒక రావి చెట్టు కిందకు సురక్షితంగా తీసుకెళ్లారు. అయితే విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడినప్పటికీ, ఇద్దరు పాఠశాల సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం అంతులేని విచారాన్ని మిగిల్చింది. సంతోష్ పరియార్ (32), సోషల్ హిస్టరీ టీచర్, నది ఒడ్డున ఉన్న తన గదికి తిరిగి వెళ్లిన సమయంలో వరదలో కొట్టుకుపోయారు. అలాగే పాఠశాల తలుపులు మూసివేయడానికి వెనుకకు వెళ్లిన పాఠశాల జానిటర్ సుల్తాన్ లామా కూడా వరదలో ప్రాణాలు కోల్పోయారు.

Post a Comment

0 Comments

Close Menu