బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన స్లీపర్ బస్సు డ్రైవర్, కండక్టర్ : నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ వస్తున్న 16 ఏళ్ల మైనర్ బాలికపై కదులుతున్న స్లీపర్ బస్సులోనే డ్రైవర్, కండక్టర్ కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఆగస్టు 4న చోటుచేసుకున్న ఉందంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులైన డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్‌లను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాకు చెందిన 16 ఏళ్ల విద్యార్థిని కుటుంబ సభ్యులతో గొడవపడి నోయిడాలోని తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. ఈ క్రమంలో ఆమె గ్రేటర్ నోయిడాలోని పరిచౌక్ వద్ద ఢిల్లీ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సు ఎక్కింది. గ్రేటర్ నోయిడాలోని పరిచౌక్ నుంచి ఢిల్లీలోని కశ్మీరీ గేట్ వరకు ఉన్న దాదాపు 47 కి.మీ ప్రయాణ దూరంలో ఈ దారుణం జరిగింది. స్లీపర్ బస్సు కిటికీలకు తెరలు వేసి ఉండటంతో లోపల ఏం జరుగుతుందో బయటి వారికి కనిపించకుండా పోయింది. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న బస్సు డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్‌లు కదులుతున్న బస్సులోనే బాలికపై అమానుషంగా అత్యాచారానికి ఒడిగట్టారు. దారుణం ముగిశాక బాలికను ఢిల్లీలోని కశ్మీరీ గేట్ బస్ స్టాండ్ వద్ద దింపి నిందితులు పరారయ్యారు. అనంతరం అచేతన స్థితిలో ఉన్న బాధితురాలు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేయడంతో వారు స్పాట్‌కు చేరుకుని ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు బస్సు సమాచారం ఆధారంగా విచారణ జరిపి డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

No comments:

Post a Comment

3