హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో శుక్రవారం జరిగిన రాఖీ వేడుకల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి శుభా కాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక ఆదివాసి బిడ్డగా, మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఆడబిడ్డగా తనను ఈ స్థాయికి తీసుకురావడంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర, కృషి ఎంతో ఉందని చెప్పారు. ఆయన అందించిన సహకారం, ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువలేనన్నారు. ములుగు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, సమ్మక్కసారలమ్మ దీవెనలతో తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేస్తున్నానని మంత్రి సీతక్క అన్నారు. తనను ఇంతటి స్థాయికి తీసుకొచ్చిన ములుగు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ సోదరుడు సంతోషంగా, ఆనందంగా ఉండాలని ప్రతీ ఆడబిడ్డ కోరుకుంటుందని, వారి రక్షణ కోసం కట్టే రాఖీ ప్రేమ, ఆప్యాయత, నమ్మకానికి ప్రతీక అని అన్నారు. తాను పన్నెండేళ్లుగా రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్నానని మంత్రి సీతక్క తెలిపారు. ప్రతి ఏడాది రాఖీ పండగ సందర్భంగా ములుగు నియోజకవర్గ ప్రజలకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపే సంప్రదాయాన్ని కొనసాగిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన రాఖీ వేడుకల్లో మంత్రి కొండా సురేఖతోపాటు కాంగ్రెస్ మహిళా నాయకులు, బ్రహ్మకుమారీలు, పలువురు మహిళలు సీఎం రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. వందలాది మంది మహిళలు రాఖీలు కట్టేందుకు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపికగా అందరి నుంచి రాఖీలు స్వీకరించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం నివాసంలో ఆయన వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు సీతక్క రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపి మీడియాతో మాట్లాడారు. మహిళల శ్రమకు గుర్తింపు, గౌరవం, భద్రతతో కూడిన వాతావరణం ప్రతి చోటా ఉండాలన్నారు. తన హోదాను పక్కనపెట్టి సామాన్యులకు సైతం ఆమె రాఖీలు కట్టడంతో వారంతా ఆనందం వ్యక్తం చేశారు. అంతకుముందు మంత్రి సీతక్క తన అధికారిక నివాసం ప్రజాభవన్‌లోనూ రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తన వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యుల మాదిరిగా తనతో కలిసి పనిచేస్తున్న సిబ్బందితో ఆత్మీయంగా మెలిగిన మంత్రి వారి సేవలను అభినందించారు. ప్రజా జీవితంలో తనతో కలిసి పనిచేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, ఇతర ప్రముఖులకు కూడా మంత్రి సీతక్క రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ బంధం కేవలం అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధానికే పరిమితం కాదని, పరస్పర గౌరవం, నమ్మకం, ఆప్యాయత, ఒకరికి ఒకరు అండగా నిలిచే బంధానికి ప్రతీక అని అన్నారు. తనకు రాఖీలు కట్టిన మహిళా సిబ్బందికి మంత్రి సీతక్క నూతన వస్త్రాలను బహూకరించారు. మహిళా సిబ్బందితో ఆప్యాయంగా మాట్లాడి పండగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
0 Comments